తుంగభద్ర పుష్కరాలు.. భక్తులకు తిప్పలే..!
దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: తుంగభద్ర నది.. తెలంగాణలో 70 కిలోమీటర్ల మేర ప్రవహిస్తుంటుంది. ఈ నెల 20 నుంచి తుంగభద్ర నది పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది పుణ్యస్నానాలకు తరలివస్తారు. పన్నేండ్లకు ఒక్కసారి వచ్చే పుష్కరాలకు ఏపీ సర్కారు భారీ ఏర్పాట్లు చేస్తోంది. రూ.250 కోట్లు నిధులు కేటాయించింది. నిరంతరం మంత్రులతో ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. ఇందుకు భిన్నంగా తెలంగాణ సర్కారు వ్యవహరిస్తోంది. ఇంతవరకు పుష్కరాలకు ఒక్క రూపాయి నిధులు కేటాయించలేదు. కొవిడ్ […]
దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: తుంగభద్ర నది.. తెలంగాణలో 70 కిలోమీటర్ల మేర ప్రవహిస్తుంటుంది. ఈ నెల 20 నుంచి తుంగభద్ర నది పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది పుణ్యస్నానాలకు తరలివస్తారు. పన్నేండ్లకు ఒక్కసారి వచ్చే పుష్కరాలకు ఏపీ సర్కారు భారీ ఏర్పాట్లు చేస్తోంది. రూ.250 కోట్లు నిధులు కేటాయించింది. నిరంతరం మంత్రులతో ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. ఇందుకు భిన్నంగా తెలంగాణ సర్కారు వ్యవహరిస్తోంది. ఇంతవరకు పుష్కరాలకు ఒక్క రూపాయి నిధులు కేటాయించలేదు. కొవిడ్ సాకు చూపి పుష్కరాలను పట్టించు కోవడం లేదని సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రులు తూతూమంత్రంగా సమావేశం నిర్వహించి మమ అనిపించారు. యాత్రికులకు వసతులు, ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. నిధులు మంజూరు చేయకుండా ఏర్పాట్లు ఎలా చేయాలని అధికారులు ప్రశ్నిస్తున్నారు.
డిసెంబరు 1 వరకు పుష్కరాలు
తుంగభద్ర పుష్కరాలు ఈనెల 20వ తేదీ మధ్యాహ్నం 1.23 నిమిషాలకు ప్రారంభమై డిసెంబర్ 1వ తేదీ వరకు కొనసాగనున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఈ పుష్కరాలు జరిగే ఏకైక ప్రాంతం మహబూబ్‌నగర్ జిల్లా. కర్నూలు జిల్లా మీదుగా వచ్చే తుంగభద్ర నది మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్ నియోజకవర్గం రాజోళ్లి వద్ద ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి సుమారు 70 కిలోమీటర్లు ప్రవహించి అలంపూర్ జోగుళాంబ ఆలయం దాటిన తరువాత కృష్ణా నదిలో కలుస్తుంది. గత ప్రభుత్వాలు జిల్లాలో సుమారు 8 చోట్ల పుష్కర ఘాట్లను ఏర్పాటు చేసి భారీగా నిధులను కేటాయించాయి. పుష్కరాలకు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో యాత్రికులు వస్తుంటారు. నదీస్నానాలు ఆచరించి ఐదో శక్తి పీఠంగా విరాజిల్లుతున్న అలంపూర్ జోగుళాంబ అమ్మవారిని దర్శించుకుంటారు.
ఏర్పాట్లపై క్లారిటీ కరువు
పుష్కరాలకు ఇంకా 12 రోజులు మాత్రమే వుండగా ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఏర్పాట్లకు సంబంధించి స్పష్టత లేదు. భక్తుల కోసం స్నానపు గదుల ఏర్పాటు, చలువ పందిళ్ళు, బట్టలు మార్చుకునేందుకు కావాల్సిన ఏర్పాట్లు, మరుగుదొడ్ల వంటి ఏర్పాట్లు ఏవీ కూడా ఇంతవరకు చేయలేదు. పుష్కరాల సందర్భంగా అలంపూర్ జోగుళాంబ అమ్మవారికి భక్తులు పోటెత్తే అవకాశాలు ఉన్నాయి. అక్కడ కనీసం క్యూలైన్ల ఏర్పాటు చేయడంలో కూడా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
మంత్రుల సమీక్షతో ఒరిగిందేమిటీ?
రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో పాటు మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌లతో కలిసి అలంపూర్ వద్ద పుష్కర ఏర్పాట్లకు సంబంధించి శనివారం అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. నిరాడంబరంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నిధుల విషయమై కనీసం ప్రస్తావించకుండానే వెళ్లిపోయారు. దీంతో అసలు నిధులు లేకుండా పనులు ఎలా చేయించాలనే విషయంలో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ముఖ్యంగా భారీగా వచ్చే భక్తులను అదుపు చేసేందుకు కొవిడ్ నిబంధనలను ఏ విధంగా అమలు చేయాలి? అనే విషయంలో కూడా అధికారులకు అర్థం కావడం లేదు. మొత్తం మీద ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తప్పేలా లేవు.