TTD ఆకృతిలో బాలాపూర్ గణేశ్ మండపం.. ఈసారి వేలం పాటకు ఒకే..!
దిశ, జల్పల్లి : వేలం పాటలో బాలాపూర్ గణేష్ లడ్డు తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్న విషయం తెలిసిందే. మొట్టమొదటి సారిగా గణనాథున్ని బాలాపూర్ గ్రామస్థులు 1980లో గ్రామ పంచాయితీ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేశారు. 1994లో బాలాపూర్‌లో ప్రారంభమైన గణేష్ లడ్డుకు దేశవ్యాప్తంగా విశిష్ఠ గుర్తింపు లభించింది. బాలాపూర్ గణేష్ లడ్డుకు 26ఏళ్ల ఘనచరిత్ర కలిగి ఉంది. 2020లో కరోనా కారణంగా లడ్డు వేలం పాటకు మొట్టమొదటి సారి బ్రేక్ పడింది. తిరిగి ఈ యేడు […]
దిశ, జల్పల్లి : వేలం పాటలో బాలాపూర్ గణేష్ లడ్డు తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్న విషయం తెలిసిందే. మొట్టమొదటి సారిగా గణనాథున్ని బాలాపూర్ గ్రామస్థులు 1980లో గ్రామ పంచాయితీ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేశారు. 1994లో బాలాపూర్‌లో ప్రారంభమైన గణేష్ లడ్డుకు దేశవ్యాప్తంగా విశిష్ఠ గుర్తింపు లభించింది. బాలాపూర్ గణేష్ లడ్డుకు 26ఏళ్ల ఘనచరిత్ర కలిగి ఉంది. 2020లో కరోనా కారణంగా లడ్డు వేలం పాటకు మొట్టమొదటి సారి బ్రేక్ పడింది. తిరిగి ఈ యేడు లడ్డు వేలం పాట నిర్వహించనున్నట్టు ఉత్సవ సమితి అధ్యక్షుడు కళ్లెం నిరంజన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో కదిలే తొలి వినాయకుడు బాలాపూర్ గణపతి. ఈ వినాయకుని చేతిలోని లడ్డూను వేలం పాటలో దక్కించుకున్న వారు అష్టఐశ్వర్యాలతో తులతూగుతారన్న నమ్మకంతో పంటపొలాల్లో.. వ్యాపార కేంద్రాలలో.. ఇళ్లలో చల్లుతారు. వందల్లో ప్రారంభమైన లడ్డు వేలం రూ. వేల నుంచి ప్రస్తుతం లక్షలకు చేరుకుంది. మత సామరస్యానికి ప్రతీకగా ముస్లింలు సైతం ఈ లడ్డు వేలం పాటలో పాల్గొనడం విశేషం. గణేష్ నిమజ్జనం సామూహిక ఊరేగింపు రోజున తెల్లవారు జామున బాలాపూర్ గణేష్ ప్రతిమను గ్రామంలో ఊరేగిస్తారు. ఉదయం 9 గంటలకు బాలాపూర్ బొడ్డురాయి ప్రాంతంలో వేలం పాట అంగరంగ వైభవంగా ప్రారంభం అవుతుంది. 21 కిలోల లడ్డు 1116 రూపాయలతో వేలం పాట ప్రారంభం అవుతుంది. వేలం పాటలో పాల్గొనడానికి నగర శివార్ల నుంచే కాకుండా రాష్ట్ర నలుమూలల నుంచి బాలాపూర్‌కు పెద్ద సంఖ్యలో చేరుకుంటారు. వేలం పాట ద్వారా గడిచిన 26 ఏళ్లలో 13,387,955.14 కోట్ల రూపాయలు బాలాపూర్ గణేష్ అసోసియేషన్ సొంతమయ్యాయి.
రూ.54 లక్షల 68 వేలతో బాలాపూర్‌లో అభివృద్ది పనులు..
వేలం పాట ద్వారా వచ్చిన సొమ్ములో కొంత భాగాన్ని బాలాపూర్ గ్రామ అభివృద్ధికి వినియోగిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. ఈ నేపధ్యంలో బాలాపూర్ గణేష్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాలాపూర్‌లో హనుమాన్ మందిరం, లక్ష్మీగణపతి మందిరం నిర్మాణాలకు 28 లక్షల 55 వేల రూపాయలు, బాలాపూర్ హైస్కూల్‌కు 1.45లక్షలు, వేణుగోపాల్ స్వామి దేవాలయ పునర్నిర్మాణానికి 1.12 లక్షలు, మహబూబ్‌నగర్ వరద బాధితుల కోసం లక్ష రూపాయలు, పోచమ్మ మందిరం నిర్మాణానికి 10,50,000 లక్షలు, గణేష్ చౌక్‌కు 90 వేల రూపాయలు , శివాలయం అభివృద్ది పనుల నిమిత్తం 2,36,000 లక్షలు, మహంకాళి మందిరం నిర్మాణానికి 8,55,000, మల్లన్న మందిరం నిర్మాణానికి లక్ష రూపాయలు, సీసీ కెమెరాల ఏర్పాటు కోసం 25000, మొత్తం 54లక్షల 68 వేల రూపాయలతో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టి పలువురికి బాలాపూర్ గ్రామస్థులు ఆదర్శంగా నిలిచారు.
టీటీడీ దేవస్థానం నమూనాలో గణేష్ మండప నిర్మాణం..
తిరుపతి దేవస్థానం ఆకృతిలో భారీ గణేష్ మండపాన్ని నిర్మిస్తున్నారు. కలకత్తాకు చెందిన 56 మంది కళాకారుల బృందం గత వారం రోజులుగా ఈ మండప ఏర్పాటులో నిమగ్నం అయ్యారు. 21 కిలోల లడ్డు, 15 ఫీట్ల ఎత్తులో గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
వేలం పాటలో గణేష్ లడ్డును సొంతం చేసుకుంది వీరే…
1994లో జరిగిన బాలాపూర్ లడ్డు వేలం పాటలో కొలన్ మోహన్‌రెడ్డి రూ. 450 కైవసం చేసుకున్నారు. 1995లో కొలన్ మోహన్ రెడ్డి రూ. 4500, 1996లో కొలన్ క్రిష్ణారెడ్డి రూ.18000, 1997లో కొలన్ క్రిష్ణా రెడ్డి రూ.28000, 1998లో కొలన్ మోహన్ రెడ్డి రూ.51000, 1999లో కళ్లెం అంజిరెడ్డి రూ. 65000, 2000లో కళ్లెం ప్రతాప్ రెడ్డి రూ. 66000, 2001లో జి.రఘునందన్ చారి రూ. 85000, 2002లో కనడ మాధవరెడ్డి రూ.1,05,000, 2003లో చిగిరింత బాల్‌రెడ్డి రూ.1,55,000, 2004లో కొలన్ మోహన్ రెడ్డి రూ. 2,01,000, 2005లో ఇబ్రం శేఖర్ రూ. 2,08,000, 2006లో చిగిరింత తిరుపతి రెడ్డి రూ. 3,00,000, 2007లో జి.రఘునందన్ చారి రూ. 4,15,000, 2008లో కొలన్ మోహన్ రెడ్డి రూ.5,07,000, 2009లో సరిత రూ. 5,10,000, 2010లో కొడాలి శ్రీధర్ బాబు రూ. 5,35,000, 2011లో కొలన్ బ్రదర్స్ రూ. 5,45,000, 2012లో పన్నాల గోవర్థన్ రెడ్డి రూ. 7,50,000, 2013లో తీగల కృష్ణారెడ్డి రూ.9,26,000, 2014లో సింగిరెడ్డి జైహింద్ రెడ్డి రూ. 9,50,000, 2015లో కళ్లెం మాధవ మోహన్ రెడ్డి రూ. 10,32000, 2016లో స్కైలాబ్ రెడ్డి రూ. 14, 65,000, 2017లో నాగం తిరుపతి రెడ్డి రూ. 15,60,000, 2018లో తేరేటిపల్లి శ్రీనివాస్ గుప్త రూ. 16,60,000, 2019లో కొలన్ రామ్ రెడ్డి రూ.17,60,000 లక్షలకు బాలాపూర్ లడ్డును వేలం పాటలో సొంతం చేసుకున్న వారిలో ఉన్నారు.
ఈయేడు వేలం పాటను నిర్వహిస్తాం..
గత యేడు కొవిడ్ కారణంగా బాలాపూర్ గణేష్ లడ్డు వేలం పాట వేయలేకపోయామని, తిరిగి ఈయేడు వేలం పాటను నిర్వహిస్తామని బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు కళ్లెం నిరంజన్ రెడ్డి స్పష్టంచేశారు. ఈయేడు కొవిడ్ నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటించేలా తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. గణేష్ నవరాత్రుల్లో ప్రతీరోజు 10 వేల మంది బాలాపూర్ గణేషున్ని దర్శించుకుంటారని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ సారి బాలాపూర్ వినాయక విగ్రహానికి కళ్లు, చెవులు కదిలే విధంగా ప్రత్యేకంగా తయారు చేయించినట్టు నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.