ప్రగతి చక్రాలకు వరుస బ్రేకులు.. మళ్లీ నష్టాల ఊబిలోకి ఆర్టీసీ..!

దిశ, కరీంనగర్ సిటీ : మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా మారింది రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పరిస్థితి. అసలే నష్టాల ఊబిలో కూరుకుపోయి విలవిలలాడుతున్న ఆ సంస్థకు, ప్రస్తుత కరోనా ప్రభావం గోరుచుట్టపై రోకటి పోటులా మారింది. దీంతో రోజురోజుకూ కరీంనగర్ రీజియన్ పరిధిలో ఆక్యుపెన్సీ రేషియో తగ్గిపోతుండగా, అధికారులు, సిబ్బందిలో ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లాలో కనీవినీ ఎరుగని రీతిలో కరోనా కరాళనృత్యం చేస్తుండగా, ప్రజలు తమ ప్రయాణాలు కూడా మానుకున్నారు. అత్యవసర పరిస్థితుల్లో […]

Update: 2021-04-23 08:48 GMT

దిశ, కరీంనగర్ సిటీ : మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా మారింది రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పరిస్థితి. అసలే నష్టాల ఊబిలో కూరుకుపోయి విలవిలలాడుతున్న ఆ సంస్థకు, ప్రస్తుత కరోనా ప్రభావం గోరుచుట్టపై రోకటి పోటులా మారింది. దీంతో రోజురోజుకూ కరీంనగర్ రీజియన్ పరిధిలో ఆక్యుపెన్సీ రేషియో తగ్గిపోతుండగా, అధికారులు, సిబ్బందిలో ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లాలో కనీవినీ ఎరుగని రీతిలో కరోనా కరాళనృత్యం చేస్తుండగా, ప్రజలు తమ ప్రయాణాలు కూడా మానుకున్నారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు వెళ్తున్నారు. అది కూడా తక్కువ మంది ఉన్న బస్సుల్లో మాత్రమే ప్రయాణించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. దీనికి తోడు రాత్రి 9 గంటల నుంచి తెల్లవారు 5 గంటల వరకు ప్రభుత్వం కర్ఫ్యూ విధించగా, రాత్రి సర్వీసులన్నీ అధికారులు రద్దు చేశారు. ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే ఓ మోస్తరు జనాలు కనిపిస్తుండగా రాత్రి 7 తర్వాత ప్రయాణికులు లేక బస్ స్టేషన్లు బోసిపోతున్నాయి. రీజియన్ పరిధిలో మొత్తం 10 ఆర్టీసీ డిపోలుండగా, 902 బస్సులు నిత్యం 2,12,330 కిలో మీటర్లు తిరుగుతున్నాయి.

వీటి ద్వారా రోజుకు రూ.50 లక్షల పైచిలుకు ఆదాయం ఆర్టీసీకి సమకూరేది. ఏడాదిన్నర కిందట సంస్థలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా, పూర్తిగా పడిపోయిన ఓఆర్ ఇప్పుడిపుడే పెరుగుతూ, అధికారులు చేపట్టిన చర్యలతో 65 శాతానికి చేరింది. దీనిని మరింత పెంచేందుకు కృషి చేస్తున్న క్రమంలోనే కరోనా సెకండ్ వేవ్ ఉగ్రరూపం దాల్చింది. నిత్యం వందలాది మంది కోవిడ్ బారిన పడుతుండగా, గత మార్చి చివరి వారంలో ప్రభుత్వం విద్యా సంస్థలను మూసివేసింది. ఇక అప్పటినుంచి ఓఆర్ పడిపోవడం ప్రారంభమై అలాగే కొనసాగుతూ, 40 శాతానికి చేరినట్లు అధికారులు పేర్కొంటున్నారు.

ఇందుకు తగ్గట్లు నిర్వహణ వ్యయం తగ్గించుకోవాల్సి ఉండగా, సంస్థలో ఉన్న ఆర్డినరీ, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో అత్యధిక శాతం స్క్రాబ్ దశలో ఉన్నాయి. అద్దె ప్రాతిపదికన కొనసాగుతున్న బస్సులు మాత్రమే ప్రయాణీకులను ఆకర్షించేవిగా ఉండటంతో, తప్పని పరిస్థితుల్లో వాటిని తిప్పుతున్నట్లు పేర్కొంటున్నారు. రీజియన్లో ఆర్టీసీ సంస్థకు 532 బస్సులుండగా, అద్దె బస్సులు 370 ఉన్నాయి. వీటన్నింటికీ నిర్దేశించిన కిలోమీటర్లు విధిగా పూర్తి చేయాల్సి ఉండగా, బస్సులు తిప్పటం అనివార్యమవుతున్నట్లు తెలుస్తుంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే మరింతగా ఆక్యుపెన్సీ రేషియో పడిపోయే అవకాశాలుండగా, సిబ్బందిపై తీవ్ర ప్రభావం పడనుందనే ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News