త్వరలో కొలువుల జాతర.. TSPSC కి కొత్త టీమ్..?

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కొలువుల భర్తీకి అడుగులు పడుతున్నాయి. ప్రస్తుతం ఒకే సభ్యుడితో కొనసాగుతున్న టీఎస్పీఎస్సీకి త్వరలో ఒక చైర్మన్‌తో పాటు మరో ఇద్దరు సభ్యులను నియమించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఆ ముగ్గురి పేర్లను సిఫారసు చేస్తూ గవర్నర్‌కు ఫైల్ పంపించినట్లు సమాచారం. డిసెంబరు నుంచి కేవలం ఇద్దరితో మాత్రమే కొనసాగుతున్న సర్వీస్ కమిషన్‌లో యాక్టింగ్ చైర్మన్‌గా ఉన్న క్రిష్ణారెడ్డి ఈ నెల 18న రిటైర్ అయ్యారు. దీంతో ఒక్క […]

Update: 2021-03-21 12:30 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కొలువుల భర్తీకి అడుగులు పడుతున్నాయి. ప్రస్తుతం ఒకే సభ్యుడితో కొనసాగుతున్న టీఎస్పీఎస్సీకి త్వరలో ఒక చైర్మన్‌తో పాటు మరో ఇద్దరు సభ్యులను నియమించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఆ ముగ్గురి పేర్లను సిఫారసు చేస్తూ గవర్నర్‌కు ఫైల్ పంపించినట్లు సమాచారం. డిసెంబరు నుంచి కేవలం ఇద్దరితో మాత్రమే కొనసాగుతున్న సర్వీస్ కమిషన్‌లో యాక్టింగ్ చైర్మన్‌గా ఉన్న క్రిష్ణారెడ్డి ఈ నెల 18న రిటైర్ అయ్యారు. దీంతో ఒక్క సభ్యుడే మిగిలారు. ఇంతకాలం కమిషన్‌లో ఉన్న చైర్మన్‌ ఘంటా చక్రపాణి, ముగ్గురు సభ్యులు విఠల్‌, చంద్రావతి, మతీనుద్దీన్‌ ఖాద్రీల పదవీకాలం గత డిసెంబరులో ముగిసింది. వివిధ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి సిద్ధమవుతున్న నేపథ్యంలో పూర్తిస్థాయిలో కమిషన్ పాలకమండలి కొలువుదీరేలా సీఎం అడుగులు వేస్తున్నారు.

చైర్మన్ రేసులో రిటైర్డ్ ఐపీఎస్..?

ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీచేసే టీఎస్పీఎస్సీ చైర్మన్ పోస్టును రిటైర్డ్ ఐపీఎస్ అధికారికి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్‌కు సన్నిహితుడు, ఉద్యమకాలం నుంచి వెన్నంటి ఉన్న రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు సమీప బంధువైన రిటైర్డ్ ఐపీఎస్ నవీన్ చంద్‌ను చైర్మన్‌గా నియమించేందుకు రంగం సిద్ధమైనట్లు విశ్వసనీయ సమాచారం. గతంలోనే ఆయనను సర్వీస్ కమిషన్‌కు చైర్మన్‌గా నియమిస్తారనే ప్రచారం జరిగింది. సీఎంకు నిత్యం సమాచారం ఇచ్చే ఇంటిలిజెన్స్ చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. పదవీ విరమణ అనంతరం కూడా ‘ఎక్స్‌టెన్షన్’ పేరుతో ఆయన్ను కొనసాగిస్తారన్న ప్రచారం జరిగింది. కానీ అది జరగలేదు. ఇప్పుడు టీఎస్పీఎస్సీ బాధ్యతలు అప్పగించాలని సీఎం భావిస్తున్నట్లు సమాచారం. అయితే తొందర్లోనే ఆ విషయం స్పష్టం కానుంది.

సభ్యుల నియామకంలో సీఎస్ మార్క్..?

టీఎస్‌పీఎస్సీ యాక్ట్ ప్రకారం చైర్మన్‌తో పాటు గరిష్ఠంగా 10 మంది దాకా సభ్యులు ఉండాలి. ప్రస్తుతానికి ఇద్దరు సభ్యులను కొత్తగా నియమించేందుకు నిర్ణయం జరిగినట్లు సమాచారం. టీఎన్జీఓ మాజీ అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి అందులో ఒకరు. మరో సభ్యుడిగా సీఎస్ సోమేశ్ కుమార్ కు సన్నిహితుడుగా ఉండే లక్ష్మీనారాయణ పేరు వినిపిస్తోంది. వాణిజ్య పన్నుల శాఖలో జాయింట్ డైరెక్టర్ గా పనిచేసి గత నెలలో రిటైర్ అయ్యారు. సీఎస్‌కు లక్ష్మీనారాయణ సన్నిహితులు. జీఎస్టీ ఉనికిలోకి వచ్చినప్పటి నుంచి ఢిల్లీలో జరిగే కౌన్సిల్ సమావేశాలకు దీర్ఘకాలం వీరిద్దరూ కలిసి హాజరయ్యారు. ప్రస్తుతం టీఎస్పీఎస్సీ సభ్యుడిగా నియమించేందుకు సీఎస్ చొరవ తీసుకున్నట్లు తెలిసింది. తొలుత చైర్మన్ తో పాటు ఇద్దరు సభ్యులను నియమించడానికి వీలుగా ఈ ముగ్గురి పేర్లతో కూడిన ఫైలును గవర్నర్ ఆమోదానికి పంపించినట్లు తెలిసింది. గవర్నర్ నుంచి రేపో, మాపో ఆమోదం వస్తుందని సమాచారం.

Tags:    

Similar News