గెస్ట్ లెక్చరర్లకు భారీ షాక్.. సర్కార్ కీలక ఆదేశాలు జారీ
దిశ ప్రతినిధి, కరీంనగర్ : ఎనిమిదేళ్లుగా ఇంటర్ విద్యారంగంలో అతిథులుగా ఉన్న మీరు కాలేజీలవైపు కన్నెత్తి చూడవద్దంటూ ఆదేశాలు రావడం వారిని నిరాశ పరిచింది. గెస్ట్ లెక్చరర్లుగా పని చేయించుకుంటున్న సర్కారు తీరుపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాధారణ లెక్చరర్ల కొరత ఉన్నా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. సర్కారు కళాశాల విద్యారంగంలో కీలక భూమిక పోషిస్తున్న అతిథి అధ్యాపకులపై కన్నెర్ర చేయడం ఏంటో అంతుచిక్కకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా.. […]
దిశ ప్రతినిధి, కరీంనగర్ : ఎనిమిదేళ్లుగా ఇంటర్ విద్యారంగంలో అతిథులుగా ఉన్న మీరు కాలేజీలవైపు కన్నెత్తి చూడవద్దంటూ ఆదేశాలు రావడం వారిని నిరాశ పరిచింది. గెస్ట్ లెక్చరర్లుగా పని చేయించుకుంటున్న సర్కారు తీరుపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాధారణ లెక్చరర్ల కొరత ఉన్నా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. సర్కారు కళాశాల విద్యారంగంలో కీలక భూమిక పోషిస్తున్న అతిథి అధ్యాపకులపై కన్నెర్ర చేయడం ఏంటో అంతుచిక్కకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా..
రాష్ట్రంలో 405 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 6006 అధ్యాపకుల పోస్టులు ఉండగా అందులో 1658 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ లోటును పూడ్చేందుకు 2013 నుండి గెస్ట్ లెక్చరర్ల సేవలను వినియోగించుకున్న ప్రభుత్వం ఉన్నట్టుండి వారికి షాక్ ఇచ్చింది. ఇక నుంచి కళాశాలకు రావద్దంటూ ఇటీవల కాలేజీల రీ ఓపెనింగ్‌కు సంబంధించిన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
విడుదల చేసిన ఆదేశాలపై వారు మండి పడుతున్నారు. సాధారణ లెక్చరర్లతో సమానంగా విధులు నిర్వర్తించిన తమపై తీసుకున్న నిర్ణయం సరైంది కాదని అంటున్నారు. ‘‘ప్రైవేటు వద్దు సర్కారే ముద్దు’’ అంటూ ఏటా అకాడమిక్ ప్రారంభంలో ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ కాలేజీల్లో విద్యార్థులను చేర్పించడంలోనూ తమ పాత్ర ఉందని వారు వివరించారు.
పేరుకు గెస్ట్ లెక్చరర్లమే అయినా రెగ్యూలర్ లెక్చరర్లతో సమానంగా పని చేశామని.. అయినా కళాశాలల విద్యాధికారులు తీసుకున్న నిర్ణయం తమ పాలిట శాపంగా మారిందని గెస్ట్ లెక్చరర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 16 నెలలుగా వేతనాలు లేకున్నా సేవలు అందిస్తున్నామని వారు తెలిపారు.
గణాంకాలు చెప్తున్న వాస్తవాలు..
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంటర్ కాలేజీల్లో గెస్ట్ లెక్చరర్ల పాత్ర ఎంత మేర ఉందో గణాంకాలను పరిశీలిస్తే అర్థం అవుతుంది. కాలేజీల్లో విద్యాబోధన చేస్తున్న వారిలో నాలుగో వంతు గెస్ట్ లెక్చరర్లే పని చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ కాలేజీలో 15 లెక్చరర్ పోస్టుల్లో 11 మంది గెస్ట్ లెక్చరర్లు పని చేస్తున్నారంటే రాష్ట్ర వ్యాప్తంగా వీరి అవసరం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు.
నెలకు 72 పీరియడ్స్ చెప్పేందుకు వీరికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. గతంలో పీరియడ్‌కు రూ.150 చెల్లించగా ఇప్పుడు రూ. 300 చెల్లిస్తున్నారు. ఏటా విద్యా సంవత్సరం ప్రారంభం కాగానే గెస్ట్ ఫ్యాకల్టీగా రెన్యూవల్ చేస్తుంటారు. అయితే 16 నెలలుగా వీరికి ఎలాంటి రెన్యూవల్ లేదు. అయితే, జనవరి నుంచి కాలేజీల్లో ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చారు. కానీ వీరికి కనీసం ఆ మూడు నెలల జీతాలు కూడా ఇవ్వడం లేదు.
ఇంటర్ విద్యార్థులపై తీవ్ర ప్రభావం..
కరోనా పాండమిక్ కారణంగా చాలా మంది తల్లిదండ్రులు ప్రభుత్వ కాలేజీల్లో తమ పిల్లలను చేర్పించేందుకు మొగ్గు చూపుతున్నారు. ప్రైవేటు కాలేజీల్లో ఇబ్బడిముబ్బడిగా ఫీజులు చెల్లించడం, కరోనా కారణంగా ఇళ్లకే పరిమితమై ఆన్‌లైన్ చదువులతోనే సరిపెడుతుండటంతో ఫీజుల రూపంలో చెల్లిస్తున్న డబ్బులు వృథా అనే అన్న భావనతో ఉన్నారు.
అంతేకాకుండా కరోనా ఎప్పుడు విజృంభిస్తుందో అర్థంకాని పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అల్లంత దూరాన ఉన్న ప్రైవేటు కాలేజీల్లో చేర్పించి నిరంతరం ఆందోళనల నడుమ బ్రతకడం కంటే కళ్ల ముందే తమ బిడ్డలు కదులాడుతుంటారన్న ఆలోచనతో కొంతమంది పేరెంట్స్ ఉన్నారు. ఈ నేపథ్యంలో స్థానికంగా అందుబాటులో ఉన్న ప్రభుత్వ కాలేజీల్లో చేర్పించేందుకు తల్లిదండ్రులు ముందుకు వస్తున్నారు.
ఈ క్రమంలో వెక్కిరిస్తున్న ఖాళీల కొరతతో విద్యార్థులకు చదువులు చెప్పే వారు ఎవరుంటారన్న ప్రశ్న తలెత్తుతోంది. గెస్ట్ లెక్చరర్లను ఇంటికి వెళ్లగొడితే సర్కారు చదువుల వైపు చూస్తున్న ఇంటర్ విద్యార్థులు సరస్వతి పుత్రులుగా మారేందుకు ఎటువైపు చూస్తారో ఉన్నతాధికారులకే తెలియాలంటున్న వారూ లేక పోలేదు.
కీలకమైన సమయం..
ప్రతీ విద్యార్థి యవ్వనంలోకి అడుగుపెట్టి భవిష్యత్తుకు బాటలు వేసుకోవడంలో అత్యంత కీలకమైనది ఇంటర్ విద్య అనే చెప్పాలి. 16 ఏళ్ల ప్రాయంలో ఉండే యువతకు ఎంచుకున్న మార్గమే వారిని ప్యూచర్ వైపు నడిపిస్తుంది. అత్యంత కీలకమైన ఈ సమయంలోనే ఇంటర్‌లోకి అడుగుపెట్టే నవయువకులకు సరైన విద్యనందించే వాతావరణం ఉండాలి.
వారికి అవసరమైన చదువులను చెప్పేందుకు చాలినంతమంది లెక్చరర్లు కూడా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. రెగ్యూలర్ లెక్చరర్లతో పోలిస్తే గెస్ట్ లెక్చరర్ల వల్ల సర్కారుపై ఆర్థిక భారం కూడా తగ్గనుంది. ఎన్నో రకాల ఫలితాలను ప్రాక్టికల్‌గా పొందే అవకాశం ఉన్నందున గెస్ట్ లెక్చరర్ల వ్యవస్థను యథావిధిగా కొనసాగించాల్సిన అవసరం ఉందని అంటున్నారు.
ఎక్స్‌టెన్షన్ చేయండి : మానస
ఎనిమిది ఏళ్లుగా గెస్ట్ ఫ్యాకల్టీగా ఇంటర్ విద్యార్థులకు బోధన చేస్తున్నాం. ఏనాటికైనా ప్రభుత్వం గుర్తించి రెగ్యులర్ చెస్తారని కలలు కన్నాం. కానీ ఈ ఏడాది రెన్యూవల్ చేయకుండా నిలువరించారు. ప్రభుత్వం, ఇంటర్ కాలేజ్ ఉన్నతాధికారులు చెప్పినట్టు నడుచుకున్నాం. ప్రభుత్వ కాలేజీల్లో విద్యార్థులను చేర్పించేందుకు కూడా కృషి చేశాం. మేం అందించిన సేవలు గుర్తించి గెస్ట్ లెక్చరర్లుగా కొనసాగే విధంగా నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాం.
వేతనాలు ఇప్పించండి : చిన్నయ్య
మూడు నెలల పాటు ఆన్‌లైన్‌లో క్లాస్‌లు నిర్వహించాం. కరోనా పాండమిక్ పరిస్థితుల్లో కూడా కాలేజీలకు వెళ్ళి స్టూడెంట్స్‌కు పాఠాలు చెప్పాం. మూడు నెలలు పని చేసిన జీతంతో పాటు మమ్మల్ని యథావిధిగా కొనసాగించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాం.