ఇతర రాష్ట్రాల పేషెంట్లను ఏం చేద్దాం?

దిశ, తెలంగాణ బ్యూరో : ఇతర రాష్ట్రాల నుంచి చికిత్స కోసం తెలంగాణకు వచ్చే పేషెంట్ల విషయంలో ఎలాంటి వైఖరి అవలంబించాలన్నది రాష్ట్ర ప్రభుత్వానికి సవాలుగా మారింది. దీన్ని ఎదుర్కోడానికి రాష్ట్ర ప్రజారోగ్య శాఖ నడుం బిగించింది. ఇతర రాష్ట్రాలతో సరిహద్దు కలిగిన జిల్లాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వైద్యారోగ్యం, రవాణా, పోలీసు శాఖలతో కూడిన ఈ బృందాలు సరిహద్దు జిల్లాల్లో రెండు రాష్ట్రాలు కలిసే చోట చెక్‌పోస్టులు పెట్టి ఇతర రాష్ట్రాల నుంచి […]

Update: 2021-05-13 11:37 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : ఇతర రాష్ట్రాల నుంచి చికిత్స కోసం తెలంగాణకు వచ్చే పేషెంట్ల విషయంలో ఎలాంటి వైఖరి అవలంబించాలన్నది రాష్ట్ర ప్రభుత్వానికి సవాలుగా మారింది. దీన్ని ఎదుర్కోడానికి రాష్ట్ర ప్రజారోగ్య శాఖ నడుం బిగించింది. ఇతర రాష్ట్రాలతో సరిహద్దు కలిగిన జిల్లాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వైద్యారోగ్యం, రవాణా, పోలీసు శాఖలతో కూడిన ఈ బృందాలు సరిహద్దు జిల్లాల్లో రెండు రాష్ట్రాలు కలిసే చోట చెక్‌పోస్టులు పెట్టి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పేషెంట్ల వివరాలను సేకరిస్తాయి. ఆ పేషెంట్ల చికిత్సకు సంబంధించి ఆ రాష్ట్ర కంట్రోల్ రూమ్ ఇచ్చే అనుమతులు, డాక్టర్ల ప్రిస్క్రిప్షన్‌లు, తెలంగాణలో ఏ ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ తీసుకోవాలనుకుంటున్నారు తదితర వివరాలన్నీ తెలుసుకున్న తర్వాత అనుమతి ఇవ్వడమో లేక తిప్పి పంపడమో చేస్తాయి.

రాష్ట్రంలో మొత్తం 16 చోట్ల చెక్‌పోస్టులు ఏర్పాటవుతున్నాయి. ఇక్కడ వైద్యారోగ్య శాఖ తరఫున స్టాఫ్ నర్సులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, పారా మెడికల్ సిబ్బంది ఉంటారు. పేషెంట్ల వివరాలను పరిశీలించిన తర్వాత అనుమతి ఇచ్చే విషయంలో జిల్లా వైద్యాధికారి నుంచి వివరణ తీసుకుంటారు. ఈ బృందాల్లో రవాణా, పోలీసు శాఖలకు చెందిన సిబ్బంది కూడా ఉంటారు. నిర్దిష్టంగా ఏ చికిత్స కోసం వస్తున్నారు, అందుకు సంబంధించి ఆ రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్ రూమ్ ద్వారా ఎలాంటి అనుమతి లేదా సిఫారసు చేసింది, చికిత్స అందించిన డాక్టర్ ఎలాంటి మెరుగైన వైద్యం అవసరమని సూచనలు చేశారు తదితరాలన్నింటినీ ఈ బృందాలు పరిశీలిస్తాయి.

ఇప్పటికే రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులన్నీ కొవిడ్ పేషెంట్లతో నిండిపోయినందున ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి బెడ్‌లను కేటాయించడం, చికిత్స అందించడం రాష్ట్ర వైద్యారోగ్య శాఖకు భారంగా మారింది. తీవ్రమైన వత్తిడి పడుతోందని మంత్రి హరీశ్‌రావు ఇప్పటికే కేంద్ర వైద్యా రోగ్య మంత్రికి వీడియో కాన్ఫరెన్సులో స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో ప్రజారోగ్య శాఖకు సైతం పని భారం పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆపదన సమయంలో వచ్చే పేషెంట్లను వెనక్కి పంపలేక, ఇక్కడ ఆస్పత్రుల్లో బెడ్‌లను సమకూర్చలేక ముందు నుయ్యి వెనక గొయ్యి లాగా మారింది. ఇంకోవైపు హైకోర్టు సైతం ఇతర రాష్ట్రాల పేషెంట్లకు ఆంక్షలు విధించవద్దని, ఆంబులెన్సులను తిప్పి పంపవద్దని స్పష్టం చేసింది. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ హైకోర్టు ఇటీవల వెలువరించిన ఉత్తర్వులకు ఉల్లంఘన కలగని తీరులో ఈ బృందాలు పనిచేయనున్నాయి.

టై-అప్ ఉంటేనే అడ్మిషన్లు..

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో బెడ్‌లు ఫుల్ కావడంతో ఇతర రాష్ట్రాల పేషెంట్లకు చికిత్స అందించలేమని భావించిన రాష్ట్ర ప్రభుత్వం ‘టై-అప్‘ ఉన్నట్లయితేనే తెలంగాణలోకి రావడానికి అనుమతి ఇస్తామని ప్రధాన కార్యదర్శి స్పష్టం చేశారు. కరోనా పేషెంట్లకు మాత్రమే ఇది వర్తిస్తుందని పేర్కన్నారు. ఇందుకోసం ఇతర రాష్ట్రాల పేషెంట్లు వచ్చినట్లయితే తెలంగాణలోని ఆస్పత్రులు ముందుగా కంట్రోల్ రూమ్‌కు ఆ పేషెంటు పేరు, వయసు, ఏ రాష్ట్రానికి చెందినవారు, వారి వెంట వస్తున్న అటెండెంట్ పేరు, మొబైల్ నెంబరు, ఆస్పత్రిలో ఏ వార్డులో చికిత్స ఇవ్వనున్నారో ఆ వివరాలను తెలియజేయాలని సీఎస్ ఆ సర్క్యులర్‌లో స్పష్టం చేశారు. తెలంగాణలోని ఆస్పత్రుల నుంచి ఈ తరహా వివరణ ఉంటేనే ఇతర రాష్ట్రాల పేషెంట్లను చికిత్స కోసం అనుమతిస్తామని స్పష్టం చేశారు. ఇందుకోసం కంట్రోల్ రూమ్ నెంబర్ (040-24651119), వాట్సాప్ నెంబర్ (09494438251), మెయిల్ ఐడీని అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. చికిత్సను నిరాకరించే ఉద్దేశం లేనప్పటికీ బెడ్‌లకు ఏర్పడిన కొరత దృష్ట్యా, వైరస్ వ్యాప్తిని నివారించే ఉద్దేశంతో ఈ మెకానిజంను ఏర్పాటు చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు.

Tags:    

Similar News