మరో ఇరవై ఏళ్లు టీఆర్ఎస్‌దే అధికారం : సీఎం కేసీఆర్

దిశ, తెలంగాణ బ్యూరో : మరో ఇరవై ఏళ్లు టీఆర్ఎస్‌దే అధికారమని, పార్టీ కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, గ్రామ, మండల, జిల్లా, మరియు రాష్ట్ర శాఖల పునర్నిర్మాణంపై సుధీర్ఘంగా చర్చించారు. దళితబంధు అమలు విషయంలో పార్టీ శ్రేణులు అనుసరించాల్సిన వ్యూహం, తీసుకోవాల్సిన చర్యలపై వివరించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ […]

Update: 2021-08-24 09:19 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : మరో ఇరవై ఏళ్లు టీఆర్ఎస్‌దే అధికారమని, పార్టీ కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, గ్రామ, మండల, జిల్లా, మరియు రాష్ట్ర శాఖల పునర్నిర్మాణంపై సుధీర్ఘంగా చర్చించారు. దళితబంధు అమలు విషయంలో పార్టీ శ్రేణులు అనుసరించాల్సిన వ్యూహం, తీసుకోవాల్సిన చర్యలపై వివరించారు.

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ కృషిచేస్తుందన్నారు. తెలంగాణ సమగ్రాభివృద్ధి, నీళ్లు, నిధులు, ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా టీఆర్ఎస్ ఆవిర్భవించిందన్నారు. ఆ లక్ష్యాల సాధనే ధ్యేయంగా ముందుకు సాగుతుందని వెల్లడించారు. దళితుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన దళిత బంధు మాదిరిగా అన్ని వర్గాల్లోని పేదల సంక్షేమం కోసం బీసీ, ఈబీసీ, మైనార్టీ బంధు పథకాలను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అర్హులందరికీ అందేలా కృషి చేయాలన్నారు.

హుజూరాబాద్ ఎన్నికల కోసమే దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పి కొట్టాలని పార్టీ కమిటీకి పిలుపు నిచ్చారు. సమాజంలో అట్టడుగు స్థాయిలో ఉన్నది దళితులేనని, వారి సంక్షేమం, ఆర్థిక బలోపేతానికి ప్రభుత్వం పథకం ప్రవేశపెట్టిందని పార్టీ శ్రేణులు విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. ప్రతి పక్షాలు దళితబంధుపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ఆ బాధ్యత రాష్ట్ర కమిటీదేనన్నారు. పార్టీలోకి నాయకులు వస్తుంటారు.. పోతుంటారని, పార్టీ ఎక్కడికిపోదని పార్టీని బలోపేతం చేసేందుకు శ్రమించాలని సూచించారు. పార్టీకోసం పనిచేసేవారికి గుర్తింపు లభిస్తుందన్నారు. సెప్టెంబర్ చివరి నాటికి గ్రామ, మండల, పట్టణ, జిల్లా స్థాయి కమిటీలను పూర్తి చేయాలని, ఆ తర్వాత సరికొత్త రాష్ట్ర కమిటీ నియామకం జరుగుతుందన్నారు.

సమావేశంలో టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్, సెక్రటరీ జనరల్ కేశవరావు, జనరల్ సెక్రటరీలు శ్రీనివాస్ రెడ్డి, బస్వారాజు సారయ్య, మంత్రి సత్యవతి రాథోడ్, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, ఎమ్మెల్సీలు ఫరీదుద్దీన్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, గంగాధర్ గౌడ్, నారదాసు లక్ష్మణ్ రావు, ఎంపీ సంతోష్ కుమార్, ఎంపీ రాములు, గ్యాదరి బాలమల్లు, వెంకటేశ్వర్లు, సోమ భరత్ కుమార్ గుప్తా, జి.నాగేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News