కారుకు టీఆర్ఎస్ సీనియర్ల బ్రేకులు
దిశ, తెలంగాణ బ్యూరో : గులాబీ పార్టీలో అసంతృప్తి నివురుగప్పిన నిప్పులా ఉంది. పార్టీ సేవలను గుర్తించి పదవులు ఇవ్వకపోయినా అంటిపెట్టుకొని ఉన్నారు. ఏళ్ల తరబడి వేచిచూసినా గుర్తించకపోవడంతో సీనియర్ నేతలు పార్టీకి రాజీనామాల పర్వానికి తెరలేపారు. టీఆర్ఎస్ లో అధినేత కేసీఆర్ ఆహ్వానం మేరకు చేరిన సందర్భంలో ఎమ్మెల్సీ, నామినేటెడ్ పదవులు ఇస్తామని చెప్పి మొండిచెయ్యి చూపడంతో నిరాశ,నిస్పృహలకు లోనవుతున్నారు. ఇక తమకు పార్టీలో గుర్తింపు ఉండదేమోనని భావించిన కీలక నేతలు ఇద్దరు ఒకే రోజూ […]
దిశ, తెలంగాణ బ్యూరో : గులాబీ పార్టీలో అసంతృప్తి నివురుగప్పిన నిప్పులా ఉంది. పార్టీ సేవలను గుర్తించి పదవులు ఇవ్వకపోయినా అంటిపెట్టుకొని ఉన్నారు. ఏళ్ల తరబడి వేచిచూసినా గుర్తించకపోవడంతో సీనియర్ నేతలు పార్టీకి రాజీనామాల పర్వానికి తెరలేపారు. టీఆర్ఎస్ లో అధినేత కేసీఆర్ ఆహ్వానం మేరకు చేరిన సందర్భంలో ఎమ్మెల్సీ, నామినేటెడ్ పదవులు ఇస్తామని చెప్పి మొండిచెయ్యి చూపడంతో నిరాశ,నిస్పృహలకు లోనవుతున్నారు. ఇక తమకు పార్టీలో గుర్తింపు ఉండదేమోనని భావించిన కీలక నేతలు ఇద్దరు ఒకే రోజూ రాజీనామా చేయడంతో పార్టీలో ఏం జరుగుతుందని ఉత్కంఠ నెలకొంది.
నేతలు పార్టీని వీడుతుండటంతో గులాబీ పార్టీలో కలవరం మొదలైంది. ప్రత్యేక రాష్ట్రం సాధించిన పార్టీ టీఆర్ఎస్. ఉద్యమసమయంలో కేసీఆర్ పిలుపునందుకొని ఇతర పార్టీల్లో పనిచేసిన నేతలంతా గులాబీ గూటికీ చేరారు. పార్టీ రాష్ట్రంలో అధికారం చేపట్టి ఏడున్నరేళ్లు అవుతుంది. ఇప్పటి వరకు టీఆర్ఎస్ కు రాజీనామా చేసిన వారు చాలా అరుదు. ఉద్యమ సమయంలో పనిచేసిన కొంతమందికి తగిన గుర్తింపు దక్కకపోవడంతో పార్టీకి రాజీనామాలు చేశారు. కొంతమందిని పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని అధిష్టానం సస్పెండ్ చేసింది.
అయితే గత కొంతకాలంగా పార్టీలో చేరడమే కానీ,వీడిన వారు లేరు. కానీ గురువారం ఒక్కసారిగా రాష్ట్ర జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్న గట్టు రామచంద్రారావు, కరీంనగర్ జిల్లాలో కీలకనేతగా ఉన్న మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ రాజీనామా చేశారు. ఒకే రోజూ ఇద్దరు సీనియర్లు రాజీనామా చేయడంతో పార్టీలో అసంతృప్తి బయటపడింది. టీఆర్ఎస్‌కు ఇక గడ్డుకాలమే ఏర్పడనుందనే సంకేతాలు ఇచ్చినట్లయింది.
గట్టు రాజీనామా…
కేసీఆర్ స్వయంగా 2015లో టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో సమూచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆరేళ్లుగా పార్టీని నమ్ముకొని పనిచేశారు. పార్టీ కార్యవర్గంలో అవకాశం కల్పించారు. కానీ ఎలాంటి నామినేటెడ్ గానీ మరే ఇతర పదవి అయినా ఇవ్వక పోవడంతో మనస్తాపానికి గురై పార్టీకి రాజీనామా చేశారు టీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ గట్టు రామచంద్రారావు. పార్టీ కార్యాలయానికి వెళ్లి గురువారం తెలంగాణ భవన్ సెక్రటరీకి రాజీనామా లేఖను అందజేశారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్‌లకు సైతం వాట్సప్‌లో రాజీనామా లేఖను పంపారు. ‘నేను మీ అభిమానం పొందడంలో, గుర్తింపు తెచ్చుకోవడంలో విఫలమయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీలో కొనసాగడం కరెక్టు కాదని భావించాను. అందుకే పార్టీకి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను.. ఆమోదిస్తారని ఆశిస్తున్నాను’ అని రాజీనామా లేఖలో గట్టు రామచంద్రారావు పేర్కొన్నారు.
ఆయన రాజకీయ అనుభవాన్ని గుర్తించిన కేసీఆర్.. రాష్ట్ర కమిటీలో పార్టీ జనరల్ సెక్రటరీగా నియమించారు. ప్రస్తుతం సెక్రటరీగా కొనసాగుతున్నారు. సీపీఎం, కాంగ్రెస్, వైఎస్సార్ సీపీలో పనిచేశారు. అయితే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అవకాశం కల్పిస్తారని భావించినప్పటికీ అధిష్టానం అవకాశం ఇవ్వక పోవడంతో మనస్తాపంతో పార్టీకి రాజీనామా చేసినట్లు గట్టు పేర్కొన్నారు. ఏ పార్టీలో చేరాలనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. పార్టీలో గుర్తింపు లేకనే రాజీనామా చేసినట్లు తెలిపారు.
మాజీ మేయర్ రవీందర్ సింగ్ రాజీనామా
ప్రత్యేక రాష్ట్ర ఉద్యమసమయంలో2009 ముందుకు కేసీఆర్ పిలుపు మేరకు బీజేపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్‌లో చేరారు మాజీ మేయర్ రవీందర్ సింగ్. కరీంనగర్ జిల్లాలో కీలక నేతగా ఉన్నారు. ఉద్యమంలో కేసీఆర్ వెన్నంటి నడిచారు. సింగ్ సేవలను గుర్తించి ప్రజాప్రతినిధుల సమక్షంలోనే ఎమ్మెల్సీ ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు. కానీ ఏళ్లు గడిచినా ఇవ్వకపోవడంతో మనోవేధనకు గురయ్యారు. 25 ఏళ్ల సుధీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నా గుర్తించకపోవడం, జిల్లాకు చెందిన కొందరు నాయకుల వ్యవహారశైలీ నచ్చకపోవడం, పార్టీలో కొందరు ఉద్యమ ద్రోహుల చేతుల్లో బందీ అయిందని భావించిన రవీందర్ సింగ్ రాజీనామా లేఖను కేసీఆర్‌కు పంపారు.
జిల్లాల్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలను అక్కున చేర్చుకొని.. ఉద్యమకారులను విస్మరిస్తున్నారని.. ఎలాంటి అవకాశాలు ఇవ్వడం లేదని ఆయన పేర్కొన్నారు. పార్టీలో కొత్తగా చేరినవారిని అందలం ఎక్కిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక పార్టీలో ఉద్యమకారులకు, నిజమైన కార్యకర్తలకు స్థానం లేదని రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
ఇప్పటికే పార్టీని వీడిన వారిలో కొందరు..
ఇప్పటికే ఉద్యమ సమయంలో పనిచేసిన డాక్టర్ చెరుకు సుధాకర్, జిట్టా బాలకృష్ణారెడ్డి, విజయశాంతి, ఈటల రాజేందర్, తూంకుంట నర్సారెడ్డి, రాములు నాయక్, భూపతిరెడ్డి, జనార్దన్‌గౌడ్, అలుగుబెల్లి అమరేందర్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, జితేందర్ రెడ్డి ఇలా చాలా మంది నేతలు పార్టీ వీడారు. కొందరు పార్టీలో గుర్తింపు లభించడం లేదని రాజీనామా చేయగా, కొందరు పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని సస్పెండ్ చేసింది. ఏదీ ఏమైనప్పటికీ టీఆర్ఎస్ పార్టీలో రాజీనామాలు ప్రారంభం కావడంతో పార్టీకి ఇక గడ్డుకాలమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.