ట్రబులిస్తున్న కారు.. MLC ఎన్నికల్లో మైలేజిచ్చేనా..?
దిశ ప్రతినిధి, హైదరాబాద్ : అధికార పార్టీ అపసోపాలు పడుతున్నది. విజయం కోసం చెమటోడుస్తున్నది. పట్టభద్రులను ప్రసన్నం చేసుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నది. ఎప్పుడూ విజయం తమదేననే ధీమాతో ఉండే గులాబీ శ్రేణుల్లో గెలుపుపై టెన్షన్ మొదలైంది. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో సత్తా చాటేందుకు కారు ఇబ్బంది పడుతున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా పార్టీ గడ్డు పరిస్థితి నెలకొంది. ఓ వైపు నిరుద్యోగులు, మరోవైపు ఉద్యోగులు పార్టీపై గుర్రుగా ఉన్నారు. నూతన […]
దిశ ప్రతినిధి, హైదరాబాద్ : అధికార పార్టీ అపసోపాలు పడుతున్నది. విజయం కోసం చెమటోడుస్తున్నది. పట్టభద్రులను ప్రసన్నం చేసుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నది. ఎప్పుడూ విజయం తమదేననే ధీమాతో ఉండే గులాబీ శ్రేణుల్లో గెలుపుపై టెన్షన్ మొదలైంది. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో సత్తా చాటేందుకు కారు ఇబ్బంది పడుతున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా పార్టీ గడ్డు పరిస్థితి నెలకొంది. ఓ వైపు నిరుద్యోగులు, మరోవైపు ఉద్యోగులు పార్టీపై గుర్రుగా ఉన్నారు. నూతన నియామకాలు లేక యువత, సమస్యలు పరిష్కారం కాక ఉద్యోగులు టీఆర్ఎస్‌ని దూరంగా పెడుతున్నారు. సాధారణ ఎన్నికలకు, పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికలకు చాలా తేడా ఉంది. గ్రామాల్లో నిరక్షరాస్యులను పోలింగ్ బూత్ వరకు తీసుకెళ్లడం చాలా సులువు. కానీ పట్టభద్రుల నుంచి ఓటు పొందడం అంత సులువు కాదు. వారు విజ్ఞతతో ఆలోచించి ఓటు వేస్తారు. ఇది అధికార పార్టీని దెబ్బతిసేలా ఉంది. దుబ్బాక ఉప ఎన్నికల్లో పార్టీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అకాల మరణంతో వచ్చిన సానుభూతి కూడా పార్టీని గట్టెక్కించలేకపోయింది. అనూహ్యంగా అక్కడ బీజేపీ పాగా వేసింది. అనంతరం జరిగిన జీహెచ్ ఎంసీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ విజయం ముంగిట బొక్కబోర్ల పడింది. దీంతో చివరి నిమిషం వరకు మేయర్ పదవి ఎవరిని వరిస్తుందనేది తెలియకుండా పోయింది. ఈనేపథ్యంలో వచ్చిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు అధికార పార్టీలో వణుకుపుట్టిస్తోంది.
కీలకంగా మారనున్న ఓట్లు..
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగుల ఓట్లు కీలకంగా మారనున్నాయి. గడువు దాటి ఏండ్లు గడుస్తున్నా పీఆర్సీ ప్రకటన లేకపోవడం, ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంచకపోవడం, నూతన నియామకాలు ఆశించిన మేర లేకపోవడం వంటివే కాకుండా అనేక సమస్యలు ఉద్యోగులను వేధిస్తున్నాయి. ఇదే సమయంలో ఉపాధ్యాయులు వేరు, ఉద్యోగులు వేరంటూ సీఎం ప్రకటన చేయడమే కాకుండా వారికి బదిలీలు, పదోన్నతులు కల్పించలేదు. దీంతో వారు ప్రభుత్వానికి అనుకూలంగా ఓట్లు ఎంతమేరకు వేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. వీరే కాకుండా నిరుద్యోగ పట్టభద్రుల ఓట్లు కూడా ఎన్నికల్లో గెలుపు, ఓటములను శాసించేలా ఉండడంతో టీఆర్ఎస్‌కు ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. ఇవే జరిగితే టీఆర్ఎస్ పార్టీకి మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలు మరో ఓటమిని తన ఖాతాలో వేసుకోనున్నది.
అందని ద్రాక్షగా..
మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల స్థానాన్ని మరోసారి తానే కైవసం చేసుకుంటానన్న ధీమాతో ఎమ్మెల్సీ రామచందర్ రావు ఉన్నారు. అయితే, ఇది అధికార టీఆర్ఎస్‌కు మింగుడుపడడం లేదు. గతంలో ఈ స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఉద్యోగ సంఘాల నేత దేవీ ప్రసాద్ ఓటమి చెందిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం ఎన్నో విజయాలు నమోదు చేసుకున్న టీఆర్ఎస్ మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల స్థానాన్ని మాత్రం ఇంతవరకూ గెలుచుకోలేకపోయింది. తాజా ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, టీడీపీలతో పాటు మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ తో కలిపి మొత్తం 93 మంది ఎన్నికల బరిలో ఉన్నారు. మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్ 2007, 2009 ఎన్నికల్లో గెలిచిన ఆయన 2014 వరకు ఎమ్మెల్సీగా వ్యవహరించారు. 2014 లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ కైవసం చేసుకుంది. దీంతో ఈ నియోజకవర్గంలో గెలుపు అంత సులువు కాకపోగా టీఆర్ఎస్ కు అందని ద్రాక్షగా మారిందనే అభిప్రాయాలు అంతటా విన్పిస్తున్నాయి.