అటు కేసీఆర్.. ఇటు కేటీఆర్.. చింతా హామీ నెరవేరేనా..?
దిశ ప్రతినిధి, సంగారెడ్డి : టీఆర్‌ఎస్ అధిష్టానం వైఖరిపై సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తీవ్ర ఆవేదన చెందుతున్నారు. తనకు కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తున్నట్లు హామీ ఇచ్చి మూడేళ్లు గడుస్తున్నా ఆ ఊసే ఎత్తకపోవడంపై బాధపడుతున్నారు. పార్టీలో పద్మశాలి సామాజిక వర్గంలో ఎవరు లేరని.. నీకు గౌరవం ఇస్తామని అందరి సమక్షంలో స్వయంగా ప్రకటన చేసిన ముఖ్యమంత్రి తన హామీని నిలబెట్టుకోకపోవడాన్ని తప్పుబడుతున్నారు. అయితే.. 2018లో రెండోసారి ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత రాష్ట్ర […]
దిశ ప్రతినిధి, సంగారెడ్డి : టీఆర్‌ఎస్ అధిష్టానం వైఖరిపై సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తీవ్ర ఆవేదన చెందుతున్నారు. తనకు కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తున్నట్లు హామీ ఇచ్చి మూడేళ్లు గడుస్తున్నా ఆ ఊసే ఎత్తకపోవడంపై బాధపడుతున్నారు. పార్టీలో పద్మశాలి సామాజిక వర్గంలో ఎవరు లేరని.. నీకు గౌరవం ఇస్తామని అందరి సమక్షంలో స్వయంగా ప్రకటన చేసిన ముఖ్యమంత్రి తన హామీని నిలబెట్టుకోకపోవడాన్ని తప్పుబడుతున్నారు.
అయితే.. 2018లో రెండోసారి ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. ఎంపీ, ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో స్వల్ప ఓట్లతో ఓటమి చెందిన వారు బాధపడవద్దని వారికి ఇతర పదవులు ఇస్తానని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగానే చింతా ప్రభాకర్‌కు చేనేత, జౌళి అభివృద్ది సంస్థ(టిస్కో) చైర్మన్ పదవి ఇస్తామని సమావేశంలో ప్రకటించారు. మరుసటి రోజు అధికారికంగా ప్రకటిస్తామన్నారు. ‘చింతా’ కార్పొరేషన్ చైర్మన్అయినట్లు మీడియాలో వార్తలు కూడా వచ్చాయి. అలా ప్రకటన వచ్చి మూడేళ్లు అవుతున్నా అమలుకు మాత్రం నోచుకోలేదు. ఏం జరిగిందో తెలియదు కానీ.. ప్రభాకర్‌కు కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వలేదు. అప్పటి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తూర్పు జయప్రకాశ్‌రెడ్డి(జగ్గారెడ్డి)పై ప్రభాకర్ స్వల్ప ఓట్లతో ఓటమి చెందిన విషయం తెలిసిందే.
గత మూడేళ్లుగా చింతా ప్రభాకర్ స్థానికంగా సదాశివపేటలోనే పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేస్తూ కేడర్‌కు నేను ఉన్నాను అని భరోసా ఇస్తూ వస్తున్నారు. మంత్రి హరీష్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ద్వారా అభివృద్దికి నిధులు మంజూరు చేయించుకుంటున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సంగారెడ్డిలో టీఆర్‌ఎస్‌కు పెద్ద దిక్కుగా మారాడని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా ఇటీవలే పలువురికి కార్పొరేషన్ చైర్మన్పదవులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ జాబితాలో తన పేరు లేకపోవడంతో మనోవేదన చెందుతున్నారు. పార్టీ కోసం ఇంత చేస్తున్నా గుర్తింపు లేకుండా పోతున్నదని తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పదవులు పొందిన వారితో తనకు సంబంధం లేదని, ఆయనకు ఎందుకు పదవి ఇవ్వడంలేదని ఆందోళన చెందుతున్నారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి సన్నిహితులను కూడా టీఆర్‌ఎస్‌లో చేర్పించి కాంగ్రెస్‌కు కేడర్లేకుండా చేశామని.. నిత్యం జనంలోనే ఉంటున్నా.. కేసీఆరే అన్నీ అనుకుని ఉంటే తనను పట్టించుకునే
వారే లేరని ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు.
హరీష్‌తో సన్నిహితంగా ఉండటంతోనే..
జిల్లా మంత్రి హరీష్‌రావుతో తాను సన్నిహితంగా ఉండటంతోనే కార్పొరేషన్ పదవి రాలేదని చింతా ప్రభాకర్ భావిసున్నారు. అయితే జిల్లాలో ఉన్నదే హరీష్‌రావు.. ఆయనతో ఉండకపోతే ఇంకా ఎవరితో ఉంటామని ప్రశ్నిస్తున్నారు. మంత్రితో సన్నిహితంగా ఉండడం తప్పా అంటున్నారు. మంత్రి హరీష్‌రావు, ఎంపీ ప్రభాకర్‌రెడ్డితోనే ఉంటూ అభివృద్ధికి నిధులు తీసుకువస్తున్నా.. జనంలో కార్యకర్తలకు అందుబాటులో ఉండి వారి సాదకబాధలు పంచుకుంటూ అభివృద్ధికి నిధులు వచ్చేలా కృషి చేయడం కూడా తప్పే అవుతుందా..? అని సన్నిహితుల వద్ద వాపోతున్నారు. పార్టీలో ఎవరు అందలం ఎక్కుతున్నారో, ఏ ప్రాతిపదికన పదవులు ఇస్తున్నారో అర్థం కావడం లేదు. తనకు పదవి ఇవ్వాలని ఎవరిని అడగాలో కూడా తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హామీ ఇచ్చినప్పడు పదవి ఇవ్వాలి కదా అని పార్టీ అధిష్టానాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నట్టు సమాచారం.
మేము పనిచేస్తుంటే జగ్గారెడ్డిని ప్రశంసిస్తారా..?
నియోజకవర్గంలో తాము అందుబాటులో ఉండి పనిచేస్తున్నాం. అలాంటి మమ్మల్ని కాదని ప్రతిపక్ష ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్కేటీఆర్ ప్రశంసించడాన్ని చింతా ప్రభాకర్‌తో పాటు ఆయన సన్నిహితులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. సంగారెడ్డి పర్యటనలో భాగంగా కేటీఆర్.. జగ్గారెడ్డి సన్నిహితంగా మెదిలారు. వారిద్దరూ పలు సందర్భాల్లో వేదికపై గుసగులాడుకున్నారు. జగ్గన్నా మా ఎంపీ, ఎమ్మెల్యేను బాగా చూసుకోవే అంటూ భుజం తట్టి చెప్పారు కేటీఆర్. అధికారంలో ఉన్నది మనం.. కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మన వాళ్లను చూసుకునేది ఏమిటని ప్రభాకర్‌తో పాటు పార్టీ శ్రేణులు కేటీఆర్‌ను ప్రశిస్తున్నారు. సంగారెడ్డికి మెడికల్ కళాశాల మంజూరు చేయాలని పలు మార్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తాను స్వయంగా వినతి పత్రాలు ఇచ్చానని ప్రభాకర్ గుర్తు చేశారు.
సంగారెడ్డిలో జరిగిన సభలో జగ్గారెడ్డి.. అసెంబ్లీలో మెడికల్ కళాశాల కావాలని అడిగారని, అందుకే మంజూరు చేశామని కేటీఆర్ ప్రకటించడాన్ని తీవ్రంగా ఆయన తప్పుపడుతున్నారు. సంగారెడ్డిలో కేటీఆర్ పర్యటన తన పరువు తీసుకోడానికే పెట్టినట్టుగా అయ్యిందని ప్రభాకర్ తీవ్ర ఆవేదన చెందుతున్నారు. పార్టీ శ్రేణుల సమక్షంలో ప్రతిపక్ష ఎమ్మెల్యే, అందులో నిత్యం మంత్రి హరీష్‌రావుతో పాటు టీఆర్‌ఎస్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసే జగ్గారెడ్డిని పొగడటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు తీవ్రంగా బాధపడుతున్నట్టు పేర్కొన్నారు. పార్టీకి ఏం చేసినా లాభం లేదని, ఇంకా ఏం చేయాలో మీరే చెప్పాలంటూ కార్యకర్తల అభిప్రాయాలు తీసుకుంటున్నట్లు సమాచారం. మొత్తంగా సంగారెడ్డిలో కేటీఆర్ పర్యటన రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించిందని చెప్పుకోవచ్చు.