తలుపులు కొడుతుంటే నాకు అదే గుర్తొస్తోంది: ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి
దిశ, హుజురాబాద్ రూరల్: స్వీయ దాడులు చేయించుకుని సానుభూతి పొందేందుకు బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కుట్ర పన్నుతున్నారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉప్పల్ లో బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ మిత్రుడి కారు యాక్సిడెంట్ చేయగా ప్రభుత్వ విప్ బాల్క సుమన్ వాహనమే యాక్సిడెంట్ చేసిందని, సిరిసేడులో కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేసి టీఆర్ఎస్ కార్యకర్తలను రెచ్చగొట్టి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై దాడి […]
దిశ, హుజురాబాద్ రూరల్: స్వీయ దాడులు చేయించుకుని సానుభూతి పొందేందుకు బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కుట్ర పన్నుతున్నారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉప్పల్ లో బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ మిత్రుడి కారు యాక్సిడెంట్ చేయగా ప్రభుత్వ విప్ బాల్క సుమన్ వాహనమే యాక్సిడెంట్ చేసిందని, సిరిసేడులో కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేసి టీఆర్ఎస్ కార్యకర్తలను రెచ్చగొట్టి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై దాడి చేసినట్లు చిత్రీకరించారన్నారు. హైదరాబాద్ నుంచి వచ్చిన కొందరు పోతిరెడ్డిపేటలో మంత్రి హరీశ్ రావు వాహనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించడం బీజేపీ కుట్రలో భాగమేనన్నారు. హుజురాబాద్, జమ్మికుంట లాడ్జీలలో ఉన్న తమ కార్యకర్తలను భయాందోళనలకు గురి చేసేందుకు తలుపులు కొట్టడం చూస్తుంటే దుబ్బాక సంఘటన గుర్తుకు వస్తోందని అన్నారు. లేని దెబ్బలతో కట్లు కట్టుకొని దుబ్బాకలో రఘునందన్ రావు లబ్ధిపొందిన తరహాలో ఈటల ప్రయత్నిస్తున్నారని అన్నారు.
ఈనె 27న ఈటల గానీ.. ఆయన సతీమణి జమున గానీ.. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు సొమ్మసిల్లి పడిపోయి ఆసుపత్రిలో చేరి సానుభూతి డ్రామా ఆడేందుకు కుటిల యత్నాలు చేస్తున్నారని విమర్శించారు. దుబ్బాక డ్రామాలు హుజురాబాద్ లో సాగవని హెచ్చరించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ రెడ్డి కార్పొరేషన్ వచ్చే మార్చిలో ఏర్పాటు చేస్తామని మంత్రి హరీష్ రావు స్పష్టమైన హామీ ఇచ్చినప్పటికీ కావాలనే కొందరు గొడవలు సృష్టించడానికి పోతిరెడ్డిపేట వద్ద ఆయన వాహనాన్ని అడ్డుకున్నారని అన్నారు. చిల్లర మల్లర రాజకీయాలు తగవని హితవు పలికారు. ఉప ఎన్నికల్లో గెలిస్తే ఏం చేస్తారో ఈటల గానీ, ప్రచారంలో పాల్గొన్న కేంద్ర మంత్రి గానీ ఏమైనా చెప్పారా అని ప్రశ్నించారు. కవ్వింపు చర్యలకు పాల్పడి కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.