రియల్ ఎమ్మెల్యేలు.. ఉత్త జేబులు..
దిశ, న్యూస్‌బ్యూరో.. ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ రాజకీయశక్తిగా ఎదిగే కొద్దీ కేసీఆర్ తన వ్యక్తిగత ఇమేజ్ మీదే ఎక్కువ కాన్ఫిడెన్స్ పెంచుకుటున్నారా.. మంత్రులకు, ఎమ్మెల్యేలకు, పార్టీ కిందిస్థాయి నేతలకు పెద్దగా విలువివ్వట్లేదా… అంటే అవుననే తెలుస్తోంది, ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణమాలను గమనిస్తే. సాక్షాత్తూ ఎమ్మెల్యేలే ఇటీవల తమకు నియోజకవర్గాల్లో తిరగాలంటే ఇబ్బందవుతోందని అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి స్కీం(సీడీపీ) కింద నిధులివ్వాలని మంత్రుల వద్ద గోడు వెల్లబోసుకుంటున్నారు. ఇక కేసీఆర్ కుమారుడు కేటీఆర్ లాంటి మంత్రులు […]
దిశ, న్యూస్‌బ్యూరో..
ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ రాజకీయశక్తిగా ఎదిగే కొద్దీ కేసీఆర్ తన వ్యక్తిగత ఇమేజ్ మీదే ఎక్కువ కాన్ఫిడెన్స్ పెంచుకుటున్నారా.. మంత్రులకు, ఎమ్మెల్యేలకు, పార్టీ కిందిస్థాయి నేతలకు పెద్దగా విలువివ్వట్లేదా… అంటే అవుననే తెలుస్తోంది, ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణమాలను గమనిస్తే. సాక్షాత్తూ ఎమ్మెల్యేలే ఇటీవల తమకు నియోజకవర్గాల్లో తిరగాలంటే ఇబ్బందవుతోందని అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి స్కీం(సీడీపీ) కింద నిధులివ్వాలని మంత్రుల వద్ద గోడు వెల్లబోసుకుంటున్నారు. ఇక కేసీఆర్ కుమారుడు కేటీఆర్ లాంటి మంత్రులు కాకుండా కొందరు ఇతర మంత్రులు కూడా తమకూ డబ్బుల్లేవని వేదికల మీదే చెప్పుకుంటున్నారంటే కేసీఆర్ కుటుంబ సభ్యులది తప్ప టీఆర్ఎస్ ప్రభుత్వంలో, పార్టీలో మిగతా వాళ్ల పరిస్థితి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
వేదికమీదే కేటీఆర్ ను బతిమిలాడిన ఎమ్మెల్యే..
పట్టణ ప్రగతి ప్రోగ్రాంలో భాగంగా మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఉమ్మడి నల్గొండ జిల్లా దేవరకొండలో ఇటీవలే నిర్వహించిన పట్టణ ప్రగతి ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఈ ప్రోగ్రామ్‌లో వేదిక మీద మాట్లాడుతుండగానే పక్కనే ఉన్న అక్కడి ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ ఒక కాగితం కేటీఆర్‌కు అందించారు. ఏముంది ఇందులో అని కేటీఆర్ రవీంద్రకుమార్‌ను అడుగుతూనే దానిలోని మ్యాటర్ చదివారు. ‘ఇగో మీ ఎమ్మెల్యేకు 25 కోట్లు కావాల్నట.. ఇది కోట్లు గుమ్మరించి వరాలిచ్చేందుకు ఏర్పాటు చేసిన ప్రోగ్రాం కాదు’ అని అన్నారు. ఇలా అంటూనే రవీంద్రకుమార్‌ను ఏ ఇగ నువ్ కూసో తర్వాత మాట్లాడదాం అని కూర్చోబెట్టారు. అయినా రవీంద్రకుమార్ కేటీఆర్ గడ్డం పట్టుకొని బతిమిలాడుతూనే కుర్చీ మీద కూర్చున్నారు. ఈ సన్నివేశం ఒక్కటి చాలు…తెలంగాణలో గవర్నెన్స్ ఎలా ఉందో, పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేల పరిస్థితి ఎలా ఉందో చెప్పడానికి. అంతా ప్రగతిభవన్, కేసీఆర్, కేటీఆర్ అన్నట్లు సాగుతోందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పోనీ ఎమ్మెల్యేలు పరిస్థితి చెప్పుకుందామని ప్రగతిభవన్ వెళితే సీఎం కేసీఆర్ అపాయింట్ మెంట్ దొరకదనే విషయం అందరికీ తెలిసిందే.
మాకంటే సర్పంచులే బెటరన్న మంత్రి జగదీశ్..
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఒక ఊళ్లో జరిగిన ఓ కార్యక్రమంలో స్టేజి మీద మరో మంత్రి జగదీశ్‌రెడ్డి స్వయంగా తన గోడు వెళ్లబోసుకున్నారు. ఆ ప్రోగ్రాంలో పాల్గొనడానికి వచ్చిన సర్పంచులనుద్దేశించి మాట్లాడుతూ… ‘మీ పరిస్థితి మా కంటే బాగుంది. మా దగ్గర డెవలప్‌మెంట్‌కు డబ్బుల్లేవు. మీకు మాత్రం పల్లెప్రగతిలో ఫుల్ గా నిధులొస్తున్నాయి’ అన్నారు.
రెండోసారి అధికారంలోకి వచ్చాకే మారిన పరిస్థితులు..
సీఎం అయిన మొదటి టర్మ్‌లో ఎమ్మెల్యేలకు భారీగానే నిధులిచ్చారు సీఎం కేసీఆర్. తెలంగాణ ఏర్పడ్డ 2014-15 నుంచి మొన్నటి ముందస్తు అసెంబ్లీ ఎన్నికలొచ్చే 2018-19దాకా అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి (సీడీపీ) స్కీం కింద ఎమ్మెల్యేలకు ఒక ఏడాదిని మించి మరో ఏడాది పెంచుకుంటూ నిధులు కేటాయించడమే కాకుండా అంతే మొత్తంలో వాటిని విడుదల చేశారు. అయితే టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. రెండో టర్మ్‌లో తొలి ఆర్థిక సంవత్సరమైన ప్రస్తుతం నడుస్తున్న 2019-20లో మాత్రం సీడీపీ కింద ఎమ్మెల్యేలకు కేవలం 160 కోట్లు కేటాయించి అందులో 2020 జనవరి 31 తేదీ దాకా అంటే ఆర్థిక సంవత్సరం ఇక రెండు నెలల్లో ముగుస్తుందనే సమయానికి 40 కోట్లు మాత్రమే విడుదల చేశారని ప్లానింగ్ శాఖ గణాంకాలే చెబుతున్నాయి. దీనర్థం ఈ ఏడాది ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో మొహం చూపించకుండా దాక్కున్నారనే చెప్పాలి. నియోజకవర్గ పర్యటనలకు వెళ్లినపుడు వివిధ రకాల అర్జీలతో వస్తున్న క్యాడర్, ప్రజలకు ఏం చెప్పాలో తెలియని పరిస్థితిని వారెదుర్కొంటున్నారనేది అక్షర సత్యం.
తెలంగాణ ఏర్పడ్డప్పటి నుంచి సీడీపీ కింద ప్రభుత్వం కేటాయించి విడుదల చేసిన నిధులు సంవత్సరాల వారిగా ఇలా ఉన్నాయి…
దీనికీ మాంద్యం సాకే..
ఇటీవలి కాలంలో తీవ్ర మాంద్యం వల్ల వృద్ధి రేటు పడిపోయి ప్రభత్వ ఖజానాలో డబ్బుల్లేవని సీఎం కేసీఆర్ పదే పదే చెబుతున్న విషయం తెలిసిందే. ఇంకేముంది సీడీపీ కింద ఎమ్మెల్యేలకివ్వాల్సిన నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఎగ్గొట్టడానికీ అదే కారణంగా చూపి ప్రభుత్వం ఈజీగా తప్పించుకుంటుందని పలువురు విశ్లేషిస్తున్నారు.
ఆర్థిక మంత్రి హరీష్‌కు అర్జీలు..
తాజా ఆర్థిక సంవత్సరం మరో నెలలో ముగుస్తూ కొత్త ఆర్థిక సంవత్సరం రానుండడంతో మార్చిలో ప్రభుత్వం 2020-2021 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ బడ్జెట్ పై హైదరాబాద్‌లోని తన ఆఫీస్ ఉన్న ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ హెడ్‌క్వార్టర్స్ అయిన అరణ్యభవన్‌లో రాష్ట్ర ఆర్థిక మంత్రి, సీఎం కేసీఆర్ మేనల్లుడు హరీష్‌రావు అధికారులతో కసరత్తు చేస్తున్నారు. ఈయన ఆఫీసుకు క్యూ కడుతున్న ఎమ్మెల్యేలు నిధుల్లేక తమ పరిస్థితి నియోజకవర్గాల్లో దారుణంగా తయారైందని వాపోతున్నారని సమాచారం. కనీసం వచ్చే ఏడాదైనా మాంద్యం సాకు చూపకుండా నిధులిస్తే నియోజకవర్గాల్లో పర్యటించే వీలు కలుగుతుందని వారు హరీష్ రావుతో విన్నవించుకుంటున్నట్లు తెలుస్తోంది.