రెండు తరాలు తిన్నా నా ఆస్తి కరగదు.. సంచలనం రేపిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే
దిశ, కోదాడ: 15 ఏళ్లుగా కోదాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పనిచేసి, అవినీతికి పాల్పడ్డ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి.. నీతి గురించి మాట్లాడే హక్కు లేదని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఎద్దేవా చేశారు. మంగళవారం కోదాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. మద్యం సిండికేట్‌లో ప్రతి క్వార్టర్ సీసా పై తనకు కమీషన్ వస్తుందని ఉత్తమ్ చేసిన ఆరోపణలు బొల్లం కొట్టిపారేశారు. ఉత్తమ్, ఆయన భార్య ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లో కూడా ఎమ్మార్పీ ధర […]
దిశ, కోదాడ: 15 ఏళ్లుగా కోదాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పనిచేసి, అవినీతికి పాల్పడ్డ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి.. నీతి గురించి మాట్లాడే హక్కు లేదని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఎద్దేవా చేశారు. మంగళవారం కోదాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. మద్యం సిండికేట్‌లో ప్రతి క్వార్టర్ సీసా పై తనకు కమీషన్ వస్తుందని ఉత్తమ్ చేసిన ఆరోపణలు బొల్లం కొట్టిపారేశారు. ఉత్తమ్, ఆయన భార్య ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లో కూడా ఎమ్మార్పీ ధర కంటే ఎక్కువగా మద్యాన్ని అమ్మారని.. ప్రస్తుతం తన పాలనలో కూడా కాంగ్రెస్ నాయకులే మద్యం వ్యాపారం చేస్తున్నారన్నారు. అవినీతి చేయాల్సిన అవసరం తనకు లేదని.. భూములు అమ్ముకుని రాజకీయాల్లోకి వచ్చానని.. తనకున్న ఆస్తి ఇంకా రెండు తరాలు తిన్నా తరగదన్నారు.
మునగాలలో కాంగ్రెస్ నాయకుడు చెరువు భూమిని ఆక్రమించిన నేపథ్యంలోనే అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకున్నారని.. తాను కక్ష సాధింపుతో అక్రమ కేసులు పెట్టానని అనడం సరికాదన్నారు. తప్పు చేసిన వారికి శిక్షలు తప్పవని హెచ్చరించారు. ప్రజల కోసం పని చేసే వారిని ప్రజలే గుర్తిస్తారన్నారు. రాజకీయంగా ఎదుగుతున్న తనపై ఈర్ష్యతో ఆరోపణలు చేస్తున్నారని.. అనవసర ఆరోపణలు చేస్తే తగిన సమయంలో సమాధానం చెబుతామని హెచ్చరించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా 50 వేల మెజార్టీతో గెలుస్తామన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి.. కనీసం డిపాజిట్లు దక్కించుకోవాలని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ప్రతి సవాల్ విసిరారు. ఈ సమావేశంలో నాయకులు అజయ్ కుమార్, పట్టణ అధ్యక్షుడు చందు నాగేశ్వర రావు, మండల పార్టీ అధ్యక్షుడు కాసాని వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.