అధికార పార్టీ నిర్వాకం.. పోలింగ్ కేంద్రాల్లోనే పంపిణీ
దిశ ప్రతినిధి, ఖమ్మం/భువనగిరి: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ ప్రలోభాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. డైరెక్టుగా పోలింగ్ కేంద్రాల్లోపల, బూత్‌ల వద్దే ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు డబ్బులు పంచారు. ఖమ్మం-వరంగల్-నల్లగొండ స్థానానికి పోటీ చేస్తున్న టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి గెలుపు తప్పనిసరి అంటూ అధిష్ఠానం నుంచి ఆదేశాలు అందాయి. దీంతో టీఆర్ఎస్ నాయకులు విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేశారు. జిల్లాలోని గట్టాయిగూడెం, బూర్గంపాడులో పోలింగ్ బూత్‌ల వద్దే ఓటుకు రూ.వెయ్యి చొప్పున, […]
దిశ ప్రతినిధి, ఖమ్మం/భువనగిరి: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ ప్రలోభాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. డైరెక్టుగా పోలింగ్ కేంద్రాల్లోపల, బూత్‌ల వద్దే ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు డబ్బులు పంచారు. ఖమ్మం-వరంగల్-నల్లగొండ స్థానానికి పోటీ చేస్తున్న టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి గెలుపు తప్పనిసరి అంటూ అధిష్ఠానం నుంచి ఆదేశాలు అందాయి. దీంతో టీఆర్ఎస్ నాయకులు విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేశారు. జిల్లాలోని గట్టాయిగూడెం, బూర్గంపాడులో పోలింగ్ బూత్‌ల వద్దే ఓటుకు రూ.వెయ్యి చొప్పున, బిర్యానీ ప్యాకెట్లు పంచారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పలుచోట్ల యువతకు భారీగా మద్యం పంపిణీ చేసి విందులు ఏర్పాటు చేశారు.
రెండ్రోజుల క్రితం వైరాలో జరిగిన ఓ సమావేశంలో ఎమ్మెల్యే రాములు నాయక్ ‘‘ఆఫ్ ద రికార్డ్ చెబుతున్నా.. డబ్బులు కూడా ఇస్తాం.. ఖర్చులకు పనికొస్తాయి.. భయమేమీ లేద’’ని బహిరంగంగానే చెప్పడం సోషల్ మీడియాలో సంచలనం రేపింది. తాజాగా ఆదివారం భువనగిరిలో మున్సిపల్ చైర్మన్ ఆంజనేయులు ఓటర్లకు డబ్బులు పంచుతుండగా తీసిన వీడియో వైరల్ అయ్యింది. జేబులో డబ్బులు దండిగా పెట్టుకున్న ఓ టీఆర్ఎస్ నేత ఓటర్లకు డబ్బులు ఇస్తుండగా మరో వ్యక్తి(భువనగిరి మున్సి పల్ చైర్మన్ ఆంజనేయులు) మాట్లాడిన సంభాషణ బయటకు వచ్చింది. అధికార పార్టీ నేతల ఆగడాలపై విపక్షాలు, విద్యార్థి సంఘాలతోపాటు సామాన్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఫైటింగ్: టీఆర్ఎస్ vs బీజేపీ, సీపీఐ
దిశ, మహబూబాబాద్: మహబూబాబాద్‌లో వామపక్ష అభ్యర్థి జయసారధిరెడ్డికి, టీఆర్‌ఎస్ శ్రేణులకు మధ్య ఘర్షణ జరిగింది. టీఆర్ఎస్ నాయకులు డబ్బులు పంచుతున్నారని సీపీఐ నాయకులు ఆందోళన చేశారు. నెల్లికుదురులో టీఆర్‌ఎస్ నాయకులు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి, గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు హుస్సేన్ నాయక్‌లు అడ్డుకున్నారు. దీంతో వారిపై టీఆర్‌ఎస్ శ్రేణులు ఎదురు దాడికి దిగారు. పరస్పరం దూషించుకున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు నెల్లికుదురు- తొర్రూర్ రహదారిపై రాస్తోరోకో నిర్వహించారు. ఎస్పీ కోటిరెడ్డి విచ్చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.