గులాబీ శ్రేణుల్లో టెన్ష‌న్ టెన్ష‌న్‌.. అధ్య‌క్ష పీఠంపై తీవ్ర ఉత్కంఠ‌

దిశ‌, అబ్దుల్లాపూర్‌మెట్‌: ఇబ్ర‌హీంప‌ట్నం నియోజ‌క‌వ‌ర్గంలో తెలంగాణ రాష్ట్ర స‌మితి పార్టీ సంస్థాగత నిర్మాణం ప్రక్రియ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. పల్లె నుంచి పట్టణం వరకు టీఆర్‌ఎస్‌ పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే గ్రామ, వార్డు కమిటీల ఎన్నిక ప్రక్రియ ముగిసింది. మున్సిప‌ల్‌, మండల కమిటీలపై అధిష్ఠానం దృష్టి సారిస్తుండగా శ్రేణుల్లో కదనోత్సాహం కనిపిస్తున్నది. టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ఫ్రెసిడెంట్ కేటీఆర్ మార్గదర్శకత్వంలో సంస్థాగత ఎన్నికల ప్రక్రియ సాఫీగా సాగుతోంద‌ని నేత‌లు అంటున్నారు. అక్క‌డ‌క్క‌డ కొంత‌మంది అసంతృప్తులు […]

Update: 2021-09-19 07:06 GMT

దిశ‌, అబ్దుల్లాపూర్‌మెట్‌: ఇబ్ర‌హీంప‌ట్నం నియోజ‌క‌వ‌ర్గంలో తెలంగాణ రాష్ట్ర స‌మితి పార్టీ సంస్థాగత నిర్మాణం ప్రక్రియ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. పల్లె నుంచి పట్టణం వరకు టీఆర్‌ఎస్‌ పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే గ్రామ, వార్డు కమిటీల ఎన్నిక ప్రక్రియ ముగిసింది. మున్సిప‌ల్‌, మండల కమిటీలపై అధిష్ఠానం దృష్టి సారిస్తుండగా శ్రేణుల్లో కదనోత్సాహం కనిపిస్తున్నది. టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ఫ్రెసిడెంట్ కేటీఆర్ మార్గదర్శకత్వంలో సంస్థాగత ఎన్నికల ప్రక్రియ సాఫీగా సాగుతోంద‌ని నేత‌లు అంటున్నారు. అక్క‌డ‌క్క‌డ కొంత‌మంది అసంతృప్తులు బ‌య‌ట‌కొచ్చి విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నా.. వాటిని ఏమాత్రం ప‌ట్టించుకోకుండా ఎమ్మెల్యే కిష‌న్‌రెడ్డి, ఆయ‌న త‌న‌యుడు ప్ర‌శాంత్‌రెడ్డి ఎంతో చాక‌చ‌క్యంతో ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ను ముగింపు ద‌శ‌కు చేర్చారు. అయితే గ్రామ‌, వార్డు క‌మిటీల ఎన్నిక సాఫీగానే సాగినా.. మున్సిప‌ల్‌, మండ‌ల క‌మిటీల ఎన్నిక‌ల్లో క్యాస్ట్ ఈక్వేష‌న్స్ పాటించాల్సి వ‌స్తుండ‌టంతో దీన్ని స‌మ‌తూకం చేసేందుకు ఎమ్మెల్యే కిష‌న్‌రెడ్డి ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకుంటున్న‌ట్టు తెలుస్తోంది. మ‌రోవైపు ఎమ్మెల్యే త‌న‌యుడు ప్ర‌శాంత్‌రెడ్డి యువ నాయ‌క‌త్వాన్ని ప్రోత్స‌హించాల‌న్న ఆలోచ‌న‌తో యువ‌త‌కే పెద్ద‌పీట వేయాల‌న్న‌దోర‌ణి అవలంబిస్తున్నారు.

ఇబ్ర‌హీంప‌ట్నం మండ‌ల అధ్య‌క్ష ప‌ద‌వి రేసులో ప్ర‌శాంత్‌రెడ్డికి ఆత్యంత ఆప్తుడైన నిట్టు జ‌గ‌దీశ్ ముందంజ‌లో ఉన్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే కిష‌న్‌రెడ్డితోనూ మంచి సంబంధాలు ఉండ‌టం, విద్యార్థి నాయ‌కుడు, బీసీ కోటాలో ప‌ద‌వి త‌ప్ప‌కుండా వ‌రిస్తుంద‌న్న ఆశ‌తో జ‌గ‌దీశ్ ఉన్నార‌ని చ‌ర్చించుకుంటున్నారు. అలాగే ఉప్ప‌రిగూడ స‌ర్పంచ్ బూడిద రాంరెడ్డి, క‌ప్పాడు-తుర్క‌గూడ ఎంపీటీసీ ఏనుగు భ‌ర‌త్‌రెడ్డి, తులేక‌లాన్ మాజీ స‌ర్పంచ్ చిలుక బుగ్గ రాములు ఎస్సీ సామాజిక‌వ‌ర్గం నుంచి పోటీలో ఉన్నార‌న్న చ‌ర్చ‌లు సాగుతున్నాయి. అలాగే ఇబ్ర‌హీంప‌ట్నం మున్సిపాలిటీ అధ్య‌క్ష ప‌ద‌వి రేసులో వైస్ చైర్మ‌న్ ఆకుల యాద‌గిరి, మ‌డుపు వేణుగోపాల్, వెంక‌ట‌రెడ్డి త‌దిత‌రులు పోటీ ప‌డుతున్నారు. ఆదిభ‌ట్ల మున్సిపాలిటీలో ప్ర‌స్తుత అధ్య‌క్షుడు గోప‌గ‌ళ్ల బాబు, కోరె జంగ‌య్య, శ్రీ‌నివాస్‌ మ‌ధ్య పోటీ నెల‌కొంది.

అబ్దుల్లాపూర్‌మెట్ మండ‌ల తెలంగాణ రాష్ట్ర స‌మితి అధ్య‌క్ష ప‌ద‌వి మ‌రోసారి పూజారి చ‌క్ర‌వ‌ర్తిగౌడ్‌కు లాంఛ‌న‌మే. పెద్ద అంబ‌ర్‌పేట మున్సిపాలిటీ అధ్య‌క్ష ప‌ద‌విని ఈద‌మ్మ‌ల బ‌ల‌రాం వ‌దులుకుంటున్న‌ట్టు తెలుస్తోంది. మున్సిప‌ల్ చైర్ ప‌ర్స‌న్, టీఆర్ఎస్ అధ్య‌క్ష ప‌ద‌వి ఎస్సీ సామాజిక‌వ‌ర్గానికే ఉండ‌టంతో ఇత‌ర కులాల‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని కిష‌న్‌రెడ్డి భావిస్తున్న‌ట్లు చెప్పుకుంటున్నారు. ఇక్క‌డ అధ్య‌క్ష ప‌ద‌విని బ‌ల‌రాం త్య‌జిస్తే… దేవిడి భాస్క‌ర్‌రెడ్డికి మార్గం సుగ‌మం అవుతుంద‌న్న వ్యాఖ్య‌లు విన‌బ‌డుతున్నాయి.

ఇక తుర్క‌యంజాల్ మున్సిపాలిటీ ప‌రిధిలో టీఆర్ఎస్ అధ్య‌క్ష ప‌ద‌వి కోసం ఎక్క‌డాలేని పోటీ నెల‌కొంది. ఏకంగా న‌లుగురు ఆశావ‌హులు ఈ ప‌ద‌వి కోసం తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుత అధ్య‌క్షుడు కందాళ బ‌ల‌దేవ‌రెడ్డి త‌న‌కే ప‌ద‌వి వ‌రిస్తుంద‌న్న ఆశ‌తో ఉన్నారు. అలాగే వేముల అమ‌రేంద‌ర్‌రెడ్డి, దాస‌రి సుధాక‌ర్‌రెడ్డి, ఎస్సీ సామాజిక‌వ‌ర్గం నుంచి చెక్క బాల‌న‌ర్సింహ పోటీ ప‌డుతున్నారు. అయితే టీఆర్ఎస్ అధిష్ఠానం యువ‌కుడు, ఉత్సాహ‌వంతుడైన అమ‌రేంద‌ర్‌రెడ్డి ప‌ట్ల కొంత సానుకూలంగా ఉన్న‌ట్టు వినికిడి.

యాచారం మండ‌ల టీఆర్ఎస్ అధ్య‌క్ష ప‌ద‌వి కోసం బీసీ సామాజిక‌వ‌ర్గం నుంచి మాజీ జెడ్పీటీసీ ర‌మేష్‌గౌడ్‌, మేడిప‌ల్లి మాజీ స‌ర్పంచ్ పాశ్చ భాషా, ఎస్సీ సామాజిక‌వ‌ర్గం నుంచి త‌క్క‌ళ్ల‌ప‌ల్లికి చెందిన త‌లారి మ‌ల్లేశ్ ఆశావ‌హుల లిస్టులో ఉన్నారు. మంచాల మండ‌లంలో ప్ర‌స్తుత అధ్య‌క్షుడు చీరాల ర‌మేష్ వైపే అధిష్ఠానం మొగ్గుచూపుతోంద‌ని, చిందం ర‌ఘుప‌తి కూడా మ‌రోసారి రేసులో ఉన్న‌ట్టు చెప్పుకుంటున్నారు.

వ‌చ్చే ఏడాది ఎన్నిక‌ల‌ను దృష్టిలో ఉంచుకొని యువ‌కుల‌ను ప్రోత్స‌హించే దిశగా పార్టీ అధిష్ఠానం ఆలోచిస్తోంద‌న్న చ‌ర్చ‌లు నేప‌థ్యంలో యువ‌త‌కే పెద్ద ఎత్తున ప‌ద‌వులు ద‌క్కొచ్చని చెప్పొచ్చు. మ‌రోవైపు ఎమ్మెల్యే త‌న‌యుడు బంటి త‌న అనుయాయుల‌కు ప‌ద‌వులు ఇప్పించి మ‌రింత ఉత్సాహంగా ప‌నిచేయించాల‌న్న కృత‌నిశ్చ‌యంతో ఉన్న‌ట్లు చెప్పుకుంటున్నారు.

రేపు విస్తృత స్థాయి స‌మావేశం..

రేపు (సోమ‌వారం) బొంగ్లూరు స‌మీపంలో పార్టీ విస్తృత స్థాయి స‌మావేశంలో గ్రామ‌, వార్డు, మున్సిప‌ల్‌, మండ‌ల క‌మిటీల‌ను ఒకేసారి ప్ర‌క‌టించ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మాన్ని పండ‌గ వాతావ‌ర‌ణంలో నిర్వ‌హించాల‌ని ఎమ్మెల్యే కిష‌న్‌రెడ్డి భావిస్తున్నారు. మంత్రి స‌బితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, సుర‌భి వాణిదేవి, ప‌ల్లా రాజేశ్వ‌ర‌రెడ్డి, రాష్ట్ర నాయ‌కులు క్యామ మ‌ల్లేశ్‌ను ఈ కార్య‌క్ర‌మానికి ఆహ్వానించారు. స‌భ ఏర్పాట్లు, బాధ్య‌త‌ల‌ను ఇబ్ర‌హీంప‌ట్నం మార్కెట్ క‌మిటీ మాజీ చైర్మ‌న్ స‌త్తు వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డికి అప్ప‌గించ‌డంతో ఆయ‌న అన్ని ప‌నుల‌ను ద‌గ్గ‌రుండి చూసుకుంటున్నారు.

 

Tags:    

Similar News