ఓటర్ నాడీ ఎటువైపు.. ఎగ్జిక్యూటివ్ మీటింగ్‌లో కేటీఆర్ తేల్చేనా..?
దిశ, తెలంగాణ బ్యూరో : టీఆర్ఎస్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ నేడు తెలంగాణ భవన్‌లో జరుగనుంది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం ఉండనుంది. ఇందులో ప్రధానంగా ప్రస్తుత రాజకీయ పరిణామాలపై విశ్లేషించనున్నారు. అందులో కీలకంగా హుజూరాబాద్ ఉప ఎన్నికపై చర్చించనున్నట్లు సమాచారం. టీఆర్ఎస్ పార్టీకి అక్కడి ప్రజలు ఓటు వేస్తారా? లేదా? ఎవరి వైపు మొగ్గుచూపుతున్నారనే దానిపై ప్రతి రోజూ అప్ టు డేటా సేకరిస్తుంది. ఆ అంశంతో పాటు నియోజకవర్గంలో ఉన్న […]
దిశ, తెలంగాణ బ్యూరో : టీఆర్ఎస్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ నేడు తెలంగాణ భవన్‌లో జరుగనుంది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం ఉండనుంది. ఇందులో ప్రధానంగా ప్రస్తుత రాజకీయ పరిణామాలపై విశ్లేషించనున్నారు. అందులో కీలకంగా హుజూరాబాద్ ఉప ఎన్నికపై చర్చించనున్నట్లు సమాచారం. టీఆర్ఎస్ పార్టీకి అక్కడి ప్రజలు ఓటు వేస్తారా? లేదా? ఎవరి వైపు మొగ్గుచూపుతున్నారనే దానిపై ప్రతి రోజూ అప్ టు డేటా సేకరిస్తుంది. ఆ అంశంతో పాటు నియోజకవర్గంలో ఉన్న వీణవంక, జమ్మికుంట, హుజూరాబాద్, కమలాపూర్, ఇల్లందుకుంట మండలాలకు ఎవరిని ఇన్‌చార్జిగా నియమిస్తే బాగుంటుందనే విషయంపై చర్చించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. గ్రామానికి పార్టీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ను నియమించాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. హుజూరాబాద్ ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఆర్ఎస్ అధిష్టానం ఎలాగైనా విజయం సాధించాలనే లక్ష్యంతో ఉంది. ఇప్పటికే సర్వశక్తులు ఒడ్డుతుంది. మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు విస్తృతంగా పర్యటిస్తున్నారు. అభివృద్ధి పనులతో పాటు ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు. వాటిపై కూడా సమావేశంలో చర్చించనున్నారు. అదే విధంగా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్రలతో టీఆర్ఎస్‌కు ఏమైన నష్టం జరుగుతుందా..? లేక కలిసి వస్తుందా? అనే దానితో పాటు పలు అంశాలపై ఉదయం నుంచి సాయంత్రం వరకు సుధీర్ఘంగా చర్చించనున్నట్లు సమాచారం.
సభ్యత్వాల డిజిటలైజేషన్ పై..
ఈ ఏడాది ఫిబ్రవరి 7న సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్‌లో మంత్రులు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీలు, మున్సిపల్, కార్పొరేషన్‌తో పాటు ప్రజాప్రతినిధుల సమావేశం నిర్వహించారు. 2021-23 సంవత్సరానికి ఫిబ్రవరి 12నుంచి పార్టీ సభ్యత్వాలు చేయాలని, ప్రతి నియోజకవర్గానికి 50వేలకు తగ్గకుండా చూడాలని ఆదేశించారు. గతేడాది 60 లక్షల సభ్యత్వాలు చేశామని, ఈ ఏడాది ఎక్కువగా చేయాలని సూచించారు. ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందని తెలిపారు. అదే విధంగా జిల్లా, మండల, గ్రామాల వారీగా కమిటీలను ఎన్నుకోవడం జరుగుతుందన్నారు. అనంతరం సాగర్ ఉపఎన్నికలు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు కరోనా ఉధృతితో సంస్థాగత నిర్మాణం జరుగలేదు. పార్టీ సభ్యత్వ నమోదు డిజిటలైజేషన్‌లో కొంత జాప్యం జరిగింది. దీంతో పాటు 2019 జూలై టీఆర్ఎస్ పార్టీ భవన నిర్మాణాలు పూర్తిచేయాలని డబ్బులు కూడా అందజేయగా కేసీఆర్ కేవలం సిద్దిపేటలో మాత్రమే పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఇప్పటివరకు 22 పూర్తికాగా, మిగతావి పురోగతిలో ఉండగా వాటిపై కూడా చర్చించనున్నట్లు సమాచారం.
కార్యదర్శులంతా హాజరు కావాలి..
టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక కమిటీ సమావేశం నేడు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ అధ్యక్షతన జరుగుతుందని పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్‌లో పార్టీ ప్రధాన కార్యదర్శులతో సమావేశం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.ఈ సమావేశంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలపై విశ్లేషణ, పార్టీ సభ్యత్వ నమోదు, డిజిటలైజేషన్ ప్రక్రియ, టీఆర్ఎస్ పార్టీ సభ్యుల జీవిత బీమా, పార్టీ జిల్లా కార్యాలయాల నిర్మాణ పనుల పురోగతిపై, పార్టీ ఇతర వ్యవహారాలతో పాటు పలు అంశాలను చర్చించనున్నట్లు తెలిపారు. సమావేశానికి పార్టీ ప్రధాన కార్యదర్శులంతా విధిగా పాల్గొనాలని కోరారు. సభ్యత్వం, డిజిటలైజేషన్, ఇతర అంశాలపై కార్యదర్శులు పూర్తి సమావేశంతో హాజరు కావాలని కోరారు.