కార్యదర్శుల మెడకు సర్వే ఉచ్చు

నిజామాబాద్ జిల్లాలో ఓ గ్రామంలో పంచాయతీ కార్యదర్శిపై ప్రజలు దాడికి దిగారు. ఆస్తుల నమోదు ప్రక్రియ సందర్భంగా ఇంటి స్థలం విషయంలో రెండు వర్గాల మధ్య భిన్నాభిప్రాయం చివరకు పంచాయతీ కార్యదర్శిపై దాడికి దారి తీసింది. మొదట ఒక ఇంటికి వెళ్లి ఇంటిని, ఇంటి ఆవరణ స్థలం వివరాలను సిబ్బంది నమోదు చేశారు. ఆ తర్వాత దాని వెనకనే ఉన్న ఇంటికి వెళ్లి నమోదు చేస్తుండగా ఇద్దరూ ఇంటి ఆవరణ స్థలాన్ని తమదేనంటూ వాదించుకున్నారు. అప్పటికే నమోదు […]

Update: 2020-10-07 00:00 GMT

నిజామాబాద్ జిల్లాలో ఓ గ్రామంలో పంచాయతీ కార్యదర్శిపై ప్రజలు దాడికి దిగారు. ఆస్తుల నమోదు ప్రక్రియ సందర్భంగా ఇంటి స్థలం విషయంలో రెండు వర్గాల మధ్య భిన్నాభిప్రాయం చివరకు పంచాయతీ కార్యదర్శిపై దాడికి దారి తీసింది. మొదట ఒక ఇంటికి వెళ్లి ఇంటిని, ఇంటి ఆవరణ స్థలం వివరాలను సిబ్బంది నమోదు చేశారు. ఆ తర్వాత దాని వెనకనే ఉన్న ఇంటికి వెళ్లి నమోదు చేస్తుండగా ఇద్దరూ ఇంటి ఆవరణ స్థలాన్ని తమదేనంటూ వాదించుకున్నారు. అప్పటికే నమోదు చేసినట్లు సమాధానం రావడంతో ఆ రెండు కుటుంబాలు కార్యదర్శిపై దాడికి దిగాయి.

నిర్మల్ జిల్లాలో ఒక ఇంటి పెద్ద చనిపోవడంతో వారసుడ్ని నేనంటే నేను అని ఘర్షణ పడ్డారు. తొలుత సర్వే సిబ్బంది ఒకరి పేరును నమోదు చేశారు. కానీ, ఆ తర్వాత ఇంకో వారసుడు అని చెప్పుకుంటున్న వ్యక్తి పంచాయతీ కార్యదర్శితో వాగ్వాదానికి దిగాడు. చివరకు ఇద్దరు వారసుల పోరు పోలీసు కేసు వరకు వెళ్లింది’’.. ఇవీ వ్యవసాయేతర ఆస్తుల నమోదు సందర్భంగా గ్రామాల్లోని పంచాయతీరాజ్ శాఖ సిబ్బందికి ఎదురవుతున్న చిక్కులు.

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రామీణ ప్రాంతాల్లో ఆస్తుల నమోదు ప్రక్రియ కొత్త పంచాయితీకి తెర లేపింది. ఇప్పటి వరకు లేని చిక్కులు తెరపైకి వస్తున్నాయి. ఇది రెండు వర్గాలకు ఇబ్బందిగా మారుతోంది. అటు గ్రామాల ప్రజలకు, ఇటు పంచాయతీ కార్యదర్శులకు చిక్కులు తెచ్చిపెడుతోంది. ఉన్నతాధికారులు విధించిన టార్గెట్లు కిందిస్థాయి సిబ్బంది ప్రాణాలమీదకు వచ్చింది. ఇలాంటి ఒత్తిడుల నడుమ మంగళవారం ఓ పంచాయతీ కార్యదర్శి గుండెపోటుకు గురై చనిపోయాడు. స్థిరాస్తుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసే ప్రక్రియకు క్షేత్రస్థాయిలో తలెత్తుతున్న సమస్యలు అడ్డంకిగా మారుతున్నాయి. దసరా నాటికి ధరణి వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తేవాలని ఉద్దేశంతో వ్యవసాయేతర కేటగిరీలో ఉన్న ఇళ్లు, ఇతర నిర్మాణాలను డిజిటలైజేషన్‌ చేస్తూ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేస్తోంది. దీనిలో సవాలక్ష సమస్యలు ఎదురవుతున్నాయి. వీటిని అధిగమించి వివరాలను నమోదు చేయడం తలనొప్పిగా మారింది. ఈ క్రమంలో ఆస్తుల నమోదు ప్రక్రియ నిర్దేశించిన గడువులోగా సాధ్యమయ్యే అవకాశాలు కనిపించడం లేదు.

క్షేత్రస్థాయిలో ఇబ్బందులు..

గ్రామాల్లో ఆస్తుల నమోదుకు సంబంధించి 40 అంశాలను రూపొందించారు. ఇందులో 27 అంశాలు యాప్‌లో కచ్చితంగా నమోదు కావాల్సిందే. ఈ నెల 10లోగా సర్వే, 15 లోగా అభ్యంతరాల స్వీకరణ పూర్తి చేయాలన్నది సర్కారు లక్ష్యం. రాష్ట్రంలోని 12,761 గ్రామ పంచాయతీలు, 13 కార్పొరేషన్‌లు, 129 మున్సిపాలిటీల్లో వ్యవసాయేతర ఆస్తుల సర్వే ప్రారంభమైంది. సంబంధిత ఆస్తి (ఇల్లు/స్థలం) యజమానిని ఆ ఆస్తి ముందు నిల్చోబెట్టి లైవ్ ఫొటో తీసి దానిని అప్‌‌లోడ్‌‌ చేయాలి. ప్రతి ఆస్తికి పన్ను అసెస్‌‌మెంట్‌‌ నంబర్‌‌, ఇంటి నంబర్‌‌, యజమాని ఆధార్‌‌, భార్య, భర్త వివరాలు, వారసుల పేర్లు, వారి ఆధార్ నెంబర్లు, మొబైల్‌‌ నంబర్, సర్వే నంబర్‌‌, ఆస్తి రకం, స్థలం, భవనం విస్తీర్ణం, ఉమ్మడి ఆస్తయితే.. ఉమ్మడి ఆస్తి యజమాని పేరు, రేషన్‌‌ కార్డు, ఉపాధి హామీ జాబ్‌‌ కార్డ్‌‌, జన్‌‌ధన్‌‌ అకౌంట్‌‌, ఆస్తిని అసెస్‌‌ చేసిన సంవత్సరం, ఎలక్షన్‌‌ వార్డు నంబర్‌‌, కుటుంబ సభ్యుల వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలి. యజమాని లైవ్‌ ఫొటో సహా వివరాలన్నీ నమోదు కావాలి. ఇవన్నీ తీసుకోవడంతోపాటు యాప్‌లో సక్రమంగా నమోదు చేయడానికి ఒక్కో ఇంటి దగ్గర దాదాపు 20 నిమిషాల సమయం పడుతోంది. సమాచారం ఏ మాత్రం లోపించినా నమోదు ప్రక్రియ మధ్యలోనే ఆగిపోతోంది. కొన్ని ప్రాంతాల్లో సాంకేతిక ఇబ్బందులతో కూడా ఆలస్యమవుతోంది.

వారసుల చిచ్చు..

ఆస్తుల నమోదు గ్రామాల్లో చాలా చిక్కులు తెచ్చి పెడుతోంది. ఏండ్ల నుంచి ఉన్న ఆస్తుల లొల్లికి మరింత ఆజ్యం పోస్తోంది. చాలా గ్రామాల్లో కొన్ని ఏండ్ల కిందట పంచాయతీ రికార్డుల్లో నమోదైన వివరాలే ఉన్నాయి. వాటిలో చాలా మంది యజమానులు మృతిచెందారు. వారి వివరాలను ఇప్పుడు రికార్డుకెక్కించడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఒకే ఇంటిలో ఇద్దరు, ముగ్గురు వారసులు ఉంటే వారి వివరాలను రికార్డు చేయడంలో సమస్యలు వస్తున్నాయి. ఇంటిలో స్థానికంగా ఉండేవారు సరైన వివరాలు ఇవ్వకపోవడం ఒక కారణం. అదే కుటుంబానికి చెందినవారు ఇతర ప్రాంతాల్లో ఉన్నట్లయితే వారుసులుగా నమోదు కావడం లేదు. ఫలితంగా ఇది కుటుంబ సభ్యుల మధ్య గొడవలకు దారితీస్తోంది. మరోవైపు ఇంటి స్థలాల విస్తీర్ణం విషయంలో కూడా గొడవలు జరుగుతున్నాయి. హద్దు పంచాయతీలు వస్తున్నాయి. ఇంటి ఆవరణను కొలిచే సమయంలో ఇరు వర్గాలు దాడికి దిగుతున్నాయి. పోలీస్ స్టేషన్ల దాకా వెళ్తున్నాయి. అయినప్పటికీ ఇవి పరిష్కారం కావడం లేదు.

ఎన్‌‌పీబీ యాప్‌‌ సతాయింపు..

టీఎస్‌‌-ఎన్‌‌పీబీ మొబైల్‌‌ యాప్‌‌లో వ్యవసాయేత ఆస్తులన్నింటి వివరాలు నమోదు చేయాల్సి ఉండగా ఉద్యోగులకు కనీసం ఒక్కరోజు కూడా శిక్షణ ఇవ్వలేదు. కొన్ని చోట్ల వివరాలు ఎలా నమోదు చేయాలో తెలియక సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. ఒకేసారి చాలామంది డివైజ్‌ను వాడుతుండటంతో మధ్యలోనే ఆగిపోతోంది. మరికొన్ని ప్రాంతాల్లో సిగ్నల్ సమస్యలు తలెత్తుతున్నాయి. ఇంటర్నెట్ రాకపోవడంతో హ్యాంగ్ అవుతూ యాప్ బఫరింగ్ సమస్య వస్తోంది. ఒక్కోసారి వివరాలను నమోదు చేసే సమయంలో మొబైల్ సిగ్నల్ బ్రేక్ కావడంతో ఆ ప్రక్రియ అర్ధాంతరంగా ఆగిపోతోంది. మళ్లీ ఓపెన్ కావడానికి సమయం పడుతోంది. అప్పటివరకూ ఫీడ్ చేసిన డాటా కోల్పోవాల్సి వస్తోంది. ఇక సర్వే చేసే సిబ్బందికి కనీసం ట్యాబ్ వంటివి కూడా అధికారులు సమకూర్చలేదు. ఉద్యోగుల మొబైల్ ఫోన్లలోనే నమోదవుతున్నాయి.

23 లక్షల మంది పరిస్థితి ఏంది..?

రాష్ట్రం నుంచి ఉపాధి కోసం వలస వెళ్లిన వారి అంశంలో ప్రభుత్వం క్లారిటీ ఇవ్వకపోవడం కొత్త సమస్యలకు దారితీసింది. ఆస్తితోపాటు యజమాని లైవ్‌ ఫొటో తప్పనిసరి అంటూ రూల్ పెట్టడం ఇబ్బందికరంగా మారింది. సొంతూళ్ల నుంచి గల్ఫ్ సహా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినవాళ్లు రాష్ట్రంలో 23 లక్షల మందికిపైగా ఉంటారని అంచనా. వీళ్లందరికీ వాళ్ల సొంతూళ్లలో పాత ఇండ్లు ఉండగా, ఉమ్మడి కుటుంబాలు కూడా ఉన్నాయి. అయితే, వీరి వివరాలు కొన్ని చోట్ల చెప్పడం లేదని పంచాయతీ కార్యదర్శులు చెప్పుతున్నారు. ఇలాంటివి తర్వాత చాలా ఇబ్బందులు తెచ్చి పెడుతాయని, ఉద్యోగాలకే ప్రమాదంగా మారుతాయని భయంలో ఉన్నారు.

సర్వర్‌తో సమస్యలు..

చాలాచోట్ల లైవ్‌ ఎంట్రీకి సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. వివరాలను అప్‌లోడ్‌ చేసే సమయంలో సర్వర్‌ కనెక్ట్‌ కాకపోవడంతో వివరాల నమోదు తీవ్ర జాప్యమవుతోంది. యజమాని వారసుల పేర్లతోపాటు వారి ఆధార్‌ వివరాలు కూడా ఎంట్రీ చేయాలి. అయితే ,కుటుంబ సమస్యలు, ఇతరత్రా కలహాలతో వారసుల పేర్లు, ఆధార్‌ వివరాలు సేకరించడం కష్టమవుతోంది. గ్రామాల్లో చాలాచోట్ల శిథిలావస్థకు చేరిన ఆస్తులు పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. యజమానులు వలస వెళ్లడంతో వారి వివరాలు తెలువడం లేదు. భూముల్లో ఇళ్లు ఉండగా..యాప్‌లో అటవీ భూముల ఆప్షన్‌ లేదు. దీంతో ప్రభుత్వ భూమిలో నిర్మాణమున్నట్లు నమోదు చేస్తున్నారు.

Tags:    

Similar News