Trending: అధికారుల నిర్లక్ష్యం.. చెల్లని కల్యాణ లక్ష్మి చెక్కుతో దంపతులకు ఇక్కట్లు

రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పడి ఏడు నెలలు గడుస్తున్నా లబ్ధిదారుల విషయంలో అధికారులు మొద్దు నిద్ర వీడటం లేదు.

Update: 2024-07-04 07:12 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పడి ఏడు నెలలు గడుస్తున్నా లబ్ధిదారుల విషయంలో అధికారులు మొద్దు నిద్ర వీడటం లేదు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువు అవ్వడంతో వారు ఆడిందే ఆట.. పాడిందే పాటగా తంతు కొనసాగుతోంది. ఈ క్రమంలోనే మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల పరిధిలోని ఎదుల్లబంధం గ్రామానికి చెంది జైనేని సరిత దంపతులకు వింత అనుభవం ఎదురైంది. 2023 ఫిబ్రవరి 23న సరిత-శ్రీనివాస్ దంపతులు తమ కుమార్తె వివాహం చేశారు. అయితే, వారు దారిద్ర్య రేఖకు దిగువన ఉండటంతో కల్యాణ‌లక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకోగా సరిత పేరు మీద 3 ఏప్రిల్ 2024న ప్రభుత్వం నుంచి రూ.1,00,116 చెక్కు విడుదలైంది. కాగా, అప్పట్లో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండటంతో అధికారులు ఆ చెక్కును లబ్ధిదారులకు పంపిణీ చేయలేకపోయారు.

అయితే, జూన్ 6న దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ ముగిసినప్పటికీ అధికారులు మాత్రం మొద్దు నిద్రను వీడలేదు. ఎలాంటి ఆంక్షలు లేనప్పటికీ చెక్కులు పంపిణీ చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించారు. ఈ క్రమంలో చెక్కు చెల్లుబాటు అయ్యేందుకు చివరి తేది బుధవారం (2024 జూలై 3) కావడంతో సాయంత్రం లబ్ధిదారులకు అధికారులు హడావిడిగా ఫోన్ చేసి చెక్కులను అందజేశారు. అప్పటికి బ్యాంక్ పనివేళలు ముగియడంతో చెక్కును మార్చుకునేందుకు సరిత దంపతులు ఇవాళ ఉదయం బ్యాంకుకు వెళ్లగా చెక్కు గడువు ముగిసిందంటూ వారు తిప్పి పంపారు. ఈ క్రమంలో అధికారుల తీరుపై సరిత దంపతులు మండిపడ్డారు. కల్యాణ లక్ష్మి చెక్కు వచ్చి మూడు నెలలు గడుస్తున్నా.. అధికారులు కనీస సమాచారం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుపేదలైన తమకు వచ్చే నగదుతో చాలా అవసరాలు ఉన్నాయని తమకు వెంటనే న్యాయం చేసేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలంటూ వారు విజ్ఞప్తి చేస్తున్నారు. 


Similar News