కార్పేట్‌పై తారు రోడ్డు (వీడియో)

రోడ్డు నిర్మిస్తున్నారంటే.. పకడ్భందీగా పదేండ్లైనా గుంతలు ఏర్పడకుండా ఉండే విధంగా నిర్మించాలి.

Update: 2023-06-01 08:31 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : రోడ్డు నిర్మిస్తున్నారంటే.. పకడ్భందీగా పదేండ్లైనా గుంతలు ఏర్పడకుండా ఉండే విధంగా నిర్మించాలి. కానీ, ఇటీవలి కాలంలో కాంట్రాక్టర్లు నిర్మించే రోడ్లను అట్టముక్కల్లా పీకితే వచ్చే విధంగా వేస్తున్నారు. ఈ తరహా ఘటనలు ఉత్తర భారతదేశంలో చాలానే వెలుగుచూశాయి. తాజాగా, అటువంటిదే మరో ఆసక్తికర ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ కాంట్రాక్టర్ నాలుగు రోజుల క్రితం నిర్మించిన తారు రోడ్డును గ్రామస్థులు ఉత్తచేతులతో కార్పెట్‌లా అమాంతంగా లేపేసి, రోడ్డు నాణ్యత ఏపాటిదో కళ్లకు కట్టినట్టు అందరికీ చూపించారు.

మహారాష్ట్రలోని జల్నా జిల్లా అంబాద్ తాలూకాలోని కర్జాత్-హస్త్ పోఖరీలో ఈ రోడ్డును నిర్మించారు. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన (పీఎం రూరల్ రోడ్ స్కీమ్)లో భాగంగా ఈ రోడ్డును నిర్మించారు. కొత్తగా వేసిన రోడ్డు.. అట్టముక్కలా పైకి రావటం విచిత్రంగా ఉంది. తారురోడ్డు కింద కార్పెట్ వేసి..దానిపైన కాంట్రాక్టర్ తారు పోసుకుంటూ వెళ్లాడు. దీంతో రోడ్డును చేతులతో తీస్తే..అట్టముక్కలా వచ్చేస్తుంది. దాని కింద ఓ మందపాటి కార్పెట్ ఉండటం విశేషం. ఈ విషయాన్ని గ్రామస్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో సంచలనంగా మారింది. ఈ విషయంపై కాంట్రాక్టర్ రాణాఠాకూర్ స్పందించారు. ‘ఇది జర్మన్ టెక్నాలజీ. రోడ్డుపై కార్పెట్ వేసి, దానిపై తారు రోడ్డు నిర్మాణం చేశాం’అని చెబుతున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది.

Tags:    

Similar News