అక్కడ మూత్రం పోయాలంటే రూ.1000 ఉండాల్సిందే.. VIP toiletపై తీవ్ర విమర్శలు

సాధారణంగా పబ్లిక్ ప్లేస్‌లతోపాటు షాపింగ్ మాల్స్, రహదారులపై టాయిలెట్స్ ఉంటాయి.

Update: 2024-09-19 14:12 GMT

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా పబ్లిక్ ప్లేస్‌లతోపాటు షాపింగ్ మాల్స్, రహదారులపై టాయిలెట్స్ ఉంటాయి. ప్రభుత్వ నిర్వహణలో ఉన్నవి అయితే ఉచితంగా వినియోగించుకున్నా.. ప్రైవేట్ సెక్టార్‌లో ఉన్న వాటికి కొంత రుసుం వసూలు చేస్తుంటారు. టాయిలెట్ వినియోగానికి రూ.2 నుంచి రూ.10 వరకు వసూలు చేస్తుంటారు. కానీ ఓ షాపింగ్ మాల్‌లో ఏకంగా రూ.1000 ఖర్చు చేసిన వినియోగదారులకే టాయిలెట్ సౌకర్యం అంటూ బోర్డు పెట్టడం వివాదస్పదం అయింది. బెంగళూరులో వెలుగులోకి వచ్చిన ఈ VIP టాయిలెట్‌పై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. షాపింగ్ మాల్ యజమాన్యాన్ని తిట్టిపోస్తున్నారు.

బెంగళూరులోని వైట్‌ఫీల్డ్‌లోని ఓ షాపింగ్ మాల్‌లో ఎదురైన అనుభవాన్ని ఓ వ్యక్తి Deskkey9633 అకౌంట్ నుంచి Redditలో పంచుకున్నారు. వారాంతంలో చర్చి స్ట్రీట్‌లో ఉన్న ఫార్ వైట్‌ఫీల్డ్‌లోని ఓ షాపింగ్ మాల్‌కు వెళ్లానని, అక్కడికి వెళ్లాక ముందు రెస్ట్ రూంకి వెళ్లి ఆ తర్వాత షాపింగ్ చేద్దామని అనుకున్నానని తెలిపాడు. పార్కింగ్‌లో ఉన్న సెక్యూరిటీని అడిగి రెస్ట్ రూం దగ్గరకు వెళ్తే అక్కడ రూ.1000 పైబడి షాపింగ్ చేసిన బిల్లు చూపిస్తేనే లోపలికి ఎంట్రీ అని అక్కడి సెక్యూరిటీ చెప్పాడని వాపోయాడు. తాను ఇంకా షాపింగ్ చేయలేదని, ఇప్పుడు వెళ్తున్నానని చెబితే పైన ఉన్నవాటిని ఉపయోగించుకోవాలని ఉచిత సలహ ఇచ్చినట్టు పేర్కొన్నాడు.

అయితే అప్పుడే అక్కడికి వచ్చిన మరో కస్టమర్ ఇది వీఐపీ టాయిలెట్ అని.. ఇక్కడ వేల రూపాయలు షాపింగ్ చేసిన వారికే దాంట్లోకి వెళ్లే అర్హత ఉంటుందని చెప్పారు. దీంతో పైఫ్లోర్‌కి వెళ్లిన కస్టమర్‌కు అక్కడ అధ్వాన స్థితిలో, దుర్గంధం వెదజల్లే టాయిలెట్లు కనిపించాయట. షాపింగ్ మాల్ నిర్వహకులపై అసహానం వ్యక్తం చేస్తూ అతడు Redditలో తన ఆవేదనను రాసుకొచ్చాడు. దీనిపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కస్టమర్లను అతిథిగా చూసుకోవాల్సిన నిర్వహకులు ఇలా బిల్లులను బట్టి టాయిలెట్లను కేటాయించడం మూర్ఖత్వం అంటూ మండిపడుతున్నారు. ఇలాంటి వ్యత్యాసాలను చూపే వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.  


Similar News