కథల పుస్తకాల నుంచి కార్టూనిస్ట్ దాకా..
దిశ, కరీంనగర్ : ‘చందమామ కథలో చదివా రెక్కల గుర్రాలుంటాయని నమ్మడానికి ఎంత బావుందో… బాలమిత్ర కథలో చదివా పగడపు దీవులు ఉంటాయని నమ్మడానికి ఎంత బావుందో.. అన్నాడో సినీ కవి.’ అయితే అవన్నీ నిజనీవితంలో సాక్షాత్కరించకున్నా.. ఓ విభిన్నమైన వ్యక్తిని మాత్రం సమాజానికి పరిచయం చేసింది ఆ పుస్తకాలే. చిన్న పిల్లల కథల పుస్తకాల్లో అంత గొప్ప అంశాలేముంటాయి అనుకుంటే పొరపాటే. ఆ పుస్తకాలను క్షుణ్ణంగా పరిశీలించే అలవాటే వైవిధ్యమైన కళ తనకు అబ్బేందుకు కారణమైంది. […]
దిశ, కరీంనగర్ : ‘చందమామ కథలో చదివా రెక్కల గుర్రాలుంటాయని నమ్మడానికి ఎంత బావుందో… బాలమిత్ర కథలో చదివా పగడపు దీవులు ఉంటాయని నమ్మడానికి ఎంత బావుందో.. అన్నాడో సినీ కవి.’ అయితే అవన్నీ నిజనీవితంలో సాక్షాత్కరించకున్నా.. ఓ విభిన్నమైన వ్యక్తిని మాత్రం సమాజానికి పరిచయం చేసింది ఆ పుస్తకాలే. చిన్న పిల్లల కథల పుస్తకాల్లో అంత గొప్ప అంశాలేముంటాయి అనుకుంటే పొరపాటే. ఆ పుస్తకాలను క్షుణ్ణంగా పరిశీలించే అలవాటే వైవిధ్యమైన కళ తనకు అబ్బేందుకు కారణమైంది. ఆయనే పెద్దపల్లి జిల్లా, జూలపల్లి మండలం, తేలుకుంట గ్రామానికి చెందిన కార్టూనిస్ట్ వేముల రాజమౌళి.
అందరూ చందమామ, బాలమిత్ర పుస్తకాల్లోని కథలను చదివితే, ఈయన మాత్రం ఆ కథలకు అచ్చు వేసిన బొమ్మలను పరిశీలించేవారు. 1971 ప్రాంతంలో ప్రాథమిక విద్యను అభ్యసించే సమయంలోనే ఆయన నీతి కథల పుస్తకాల్లోని బొమ్మలను గమనించేవారు. 6వ తరగతికి వచ్చేసరికి క్రమంగా కార్టూన్లు వేయడం ఆరంభించారు. అలా.. డిగ్రీ వరకు కూడా తన ఆలోచనలతోనే కార్టూన్లు వేస్తుండేవాడు. కరీంనగర్‌లో డిగ్రీ చదివేప్పుడు అప్పటికే ఆంధ్రభూమిలో కార్టూన్స్ వేస్తున్న తన క్లాస్‌మేట్ జాకీర్ హుస్సేన్ సాయంతో తన ప్రతిభకు మెరుగులు దిద్దుకున్నాడు. ఆ తర్వాత 1984 నవంబర్‌లో ఓ పొలిటికల్ వీక్లీలో తన ఫస్ట్ కార్టూన్ ప్రచురితమైంది.
పావలాతో మ్యాజిక్..
ఓ సారి రాజమౌళి.. వెయింగ్ మిషన్‌లో బరువు చూసుకుంటే.. మిషన్‌లో నుంచి బయటకొచ్చిన కార్డు వెనక మీరు త్వరలో గర్భం దాల్చబోతున్నారని వచ్చిందట. అయితే ఆయన దాన్ని చూసి నవ్వుకున్నా.. ఆ తర్వాత దానిపైనే వ్యంగ్యంగా కార్టూన్ గీసి చిత్రాలను వేసి శభాష్ అనిపించుకున్నారు. క్రమంగా ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, వనితా జ్యోతి, వెన్నెల తదితర వీక్లీ, మంత్లీ మ్యాగజైన్లలో రాజమౌళి వేసిన కార్టూన్లు ప్రచురితం అయ్యాయి. ఆ తరువాత రాజకీయాల వైపు వెళ్లిన రాజమౌళి.. కొంత కాలం కార్టూన్లు వేయలేదు. తిరిగి 2001లో ఆంధ్రభూమి సెంటర్ స్ప్రెడ్‌లో లాఫీ టీవీ పేరిట కార్టూన్లు ప్రచురితం కావడం గమనించి.. తిరిగి మళ్లీ కార్టూన్లు వేయడం ఆరంభించారు. అప్పటి నుంచి అంతర్జాతీయ వెబ్‌సైట్లకు కార్టూన్లు వేస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనా వ్యాధిపైనా తన కుంచెతో వ్యంగ్య చిత్రాలను వేస్తున్నారు వేముల. ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన పలు ప్రదర్శనల్లోనూ రాజమౌళి కార్టూన్లకు స్థానం దక్కింది. ఆచార్య జయశంకర్ సార్ వంటి ప్రముఖుల మెప్పు పొందిన రాజమౌళి… ఐదు పదుల వయసు దాటినా అదే స్ఫూర్తితో ముందుకు సాగుతున్నారు.
చిన్నాన్న వల్లే : వేముల రాజమౌళి
మా చిన్నాయన వేముల మల్లేశం ఎస్సైగా పనిచేసే వారు. అప్పుడు మా తాత కోసం చందమామ, బాలమిత్ర పుస్తకాలు తెచ్చేవారు. వాటిని నేను కూడా చదివే వాడిని. అయితే అందులోని కథలకన్నా.. బొమ్మలనే ఎక్కువగా గమనించేవాడిని. వాటికి భిన్నంగా బొమ్మలు వేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన కలగడానికి కారణం చందమామ, బాలమిత్రలే. నటీనటులు నవ్వితే ఎలా ఉంటుంది? ఇలా విభిన్నంగా ఆలోచిస్తూ వాటిని చిత్రీకరించడం మొదలు పెట్టి వేలాది కార్టూన్లు వేశాను. చివరకు డిగ్రీ క్లాస్‌మేట్ జాకీర్ హుస్సేన్‌తో ప్రపంచానికి పరిచయమై.. వ్యంగ్య చిత్రాలు వేస్తూ ఇలా కాలం గడిపేస్తున్నా. నాలోని కళను ప్రపంచానికి తెలియజేయాలన్నదే నా తపన తప్ప.. డబ్బు కోసం కాదంటున్నాడు వేముల రాజమౌళి.
Tags : Chandamama, Balamitra, Cartoons, Weekly Magazines