‘చెత్త’ పడేసి పోయి..తిరిగొచ్చి తొలగించారు..
దిశ, వెబ్‌డెస్క్: ‘చెత్త’ పనులు చేయడంలో చాలా మంది ముందుంటారు. చేస్తున్నది చెత్త పని అని తెలిసినా..ఎవరూ ఒప్పుకోరు. మేము మాత్రమే చేస్తున్నామా..ఇంకెవరు చేయడం లేదా? అంటూ వితండ వాదన చేస్తుంటారు కూడా. రోడ్డు మీద, బస్టాండ్, రైల్వే స్టేషన్లో డస్ట్‌బిన్స్ అందుబాటులో ఉంటాయి. కానీ, అందులో చెత్త వేయకుండా నాదేం పోయింది. వాళ్లే క్లీన్ చేస్తారులే అనే నిర్లక్ష్యంతో.. ఉన్నచోటే చెత్త పడేస్తారు. రోడ్ల మీద చెత్త వేసే అలవాటు ఉండటంతో ఓ ఇద్దరు యువకులు […]
దిశ, వెబ్‌డెస్క్: ‘చెత్త’ పనులు చేయడంలో చాలా మంది ముందుంటారు. చేస్తున్నది చెత్త పని అని తెలిసినా..ఎవరూ ఒప్పుకోరు. మేము మాత్రమే చేస్తున్నామా..ఇంకెవరు చేయడం లేదా? అంటూ వితండ వాదన చేస్తుంటారు కూడా. రోడ్డు మీద, బస్టాండ్, రైల్వే స్టేషన్లో డస్ట్‌బిన్స్ అందుబాటులో ఉంటాయి. కానీ, అందులో చెత్త వేయకుండా నాదేం పోయింది. వాళ్లే క్లీన్ చేస్తారులే అనే నిర్లక్ష్యంతో.. ఉన్నచోటే చెత్త పడేస్తారు. రోడ్ల మీద చెత్త వేసే అలవాటు ఉండటంతో ఓ ఇద్దరు యువకులు కారులో వెళ్తూ రోడ్డు మీదనే చెత్త పడేశారు. అయితే, ఆ యువకులు అక్కడ్నుంచి 80 కిలోమీటర్లు వెళ్లినా..మళ్లీ వారే వచ్చి ఆ చెత్తను తీశారు. అలా వారితోనే ఎవరు తీయించారు. అది ఎలా జరిగింది? అందుకోసం ఏం చేశారు? తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..
కర్నాటకలోని కూర్గ్ ప్రాంతం. ఓ ఇద్దరు యువకులు కారులో వెళుతున్నారు. జర్నీ చేస్తూ హ్యాపీగా పిజ్జా తినేశారు. దానికి సంబంధించిన ప్యాకెట్లను కారు నుంచి కడగడాలు అనే గ్రామం వద్ద రోడ్డు మీద పడేశారు. ఆ గ్రామస్తులు ప్రాంతాన్ని ఎంతో నీట్‌గా ఉంచుకుంటారు. అక్కడ చిన్న చిత్తు కాగితం కూడా రోడ్డు మీద కనిపించదు. గ్రామ పంచాయతీ అధికారికి పిజ్జా బాక్సులు రోడ్డ మీద కనిపించాయి. దాంతో ఆయనకు కోపం వచ్చింది. ఆ పడేసిన పిజ్జా బాక్సుల్లో దానికి సంబంధించిన బిల్లు దొరికింది. దానిపై ఓ ఫోన్ నెంబర్ ఉంది. వెంటనే ఆ ఫోన్ నెంబరుకు కాల్ చేసి విషయం చెప్పాడు. వచ్చి చెత్తను తొలగించాలని సూచించాడు. కానీ, ఆ యువకులు అందుకు ఒప్పుకోలేదు. దాంతో విషయం కాస్త పోలీసుల వరకు వెళ్లింది. ఆ యువకులు అప్పటికీ మేము చాలా దూరం వెళ్లామని చెప్పారు. ప్రస్తుతం మడికేరి వరకు వెళ్లామని రావడం కుదరదని తేల్చి చెప్పారు. పోలీసుల వల్ల కూడా పని కాలేదు. దీంతో ఈ సారి సోషల్ మీడియాతో క్యాంపెయిన్ మొదలుపెట్టాడు. ‘మీరు వచ్చి చెత్త తీసి పోవాలని. మీ తప్పును మీరు సరిచేసుకోవాలని’ సోషల్ మీడియా వేదికగా ఆ యువకుల ఫోన్ నెంబర్లను షేర్ చేశాడు. దాంతో యువకులకు ఇబ్బడి ముబ్బడిగా కాల్ చేశారు. ఫోన్ చేసిన వారందరూ.. ‘వెంటనే వెనక్కి వెళ్లి చెత్తను తీయండి’ అంటూ హెచ్చరించడం మొదలెట్టారు. ఇక ఆ యువకులు చేసేదేంలేక మడికేరి నుంచి మళ్లీ 80 కిలోమీటర్లు వెనక్కి ప్రయాణించి వచ్చి కడగడాలు ప్రాంతంలో రోడ్డుపై పడేసిన పిజ్జా బాక్సులను తొలగించారు. మళ్లీ ఇలా చెత్తను రోడ్లపై వేయబోమని క్షమాపణ చెప్పి వెళ్లిపోయారు.