Warangal Market: వరంగల్ మార్కెట్‌లో దోపిడీ.. రైతు కంట్లో కారం
దిశ ప్రతినిధి, వరంగల్: మిర్చి రైతుల కంట్లో వ్యాపారులు కారం కొడుతున్నారు. అవసరాలు తీర్చుకోవడానికి.. అప్పులు కట్టుకోవడానికి చాలా కాలం తర్వాత సోమవారం ప్రారంభమైన మార్కెట్‌కు మిర్చి పంటను తీసుకువచ్చిన రైతులను ఖరీద్దారులు నిండా ముంచేస్తున్నారు. లాక్‌డౌన్‌కు ముందు మార్కెట్‌లో నాణ్యమైన క్వింటా మిర్చి ధర రూ.15000ల నుంచి 17000ల వరకు పలికింది. మెజార్టీ రైతులకు కనీస రూ.14000ల ధరైనా దక్కేది. సోమవారం ఒక్కరోజే లక్షకు పైగా మిర్చి బస్తాలు మార్కెట్‌కు చేరడంతో వ్యాపారులు ధరను అమాతంగా […]
దిశ ప్రతినిధి, వరంగల్: మిర్చి రైతుల కంట్లో వ్యాపారులు కారం కొడుతున్నారు. అవసరాలు తీర్చుకోవడానికి.. అప్పులు కట్టుకోవడానికి చాలా కాలం తర్వాత సోమవారం ప్రారంభమైన మార్కెట్‌కు మిర్చి పంటను తీసుకువచ్చిన రైతులను ఖరీద్దారులు నిండా ముంచేస్తున్నారు. లాక్‌డౌన్‌కు ముందు మార్కెట్‌లో నాణ్యమైన క్వింటా మిర్చి ధర రూ.15000ల నుంచి 17000ల వరకు పలికింది. మెజార్టీ రైతులకు కనీస రూ.14000ల ధరైనా దక్కేది. సోమవారం ఒక్కరోజే లక్షకు పైగా మిర్చి బస్తాలు మార్కెట్‌కు చేరడంతో వ్యాపారులు ధరను అమాతంగా తగ్గించేశారు. మేలు రకం మిర్చి ధర అతి కొద్దిమంది రైతులకు రూ.11000వేలు పెట్టి ఎక్కువమంది రైతులకు రూ.9000లలోపే నిర్ణయించారు. కొంతమంది రైతులకైతే రూ.6000, రూ.5000, రూ.4500 ధర నిర్ణయించి నిలువు దోపిడీ చేయడం గమనార్హం.
రైతులు ఎంతమాత్రం కూడా ఊహించని ధరను ఖరీద్దారులు పెడుతుండటం రైతులు కంట్లో కన్నీరొలుకుతోంది. కేవలం నెల రోజుల తేడాలో ధరను దాదాపు 10వేలను తగ్గించేయడం వ్యాపారుల దోపిడీకి నిదర్శనం. మార్కెట్‌కు తీసుకొచ్చిన సరుకును ఇంటికి తీసుకెళ్లే పరిస్థితి లేకపోవడంతో మోసపోతున్నామని తెలిసి కూడా రక్తపు చుక్కలను చెమట చుక్కలుగా మార్చి పండించిన మిర్చి పంటను తెగనమ్ముకుంటున్నారు. కొద్దిమంది రైతులు కోల్డ్‌స్టోరేజీల్లో పెట్టుకుందామని అధికారులను అడుగుతున్నా.. వారి వద్ద నుంచి ఫుల్లుగా నిండి ఉన్నాయనే సమాధానం వస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి పేరుతో సుదీర్ఘకాలం మార్కెట్లో విక్రయాలు నిర్వహించకుండా చేసి… ఇప్పుడు రైతులంతా ఒకే సారి సరుకును మార్కెట్‌కు తరలించేలా వ్యూహాత్మకంగా కొనుగోళ్లు చేపడుతున్నారని కొంతమంది రైతులు ఆరోపిస్తున్నారు.
సుదీర్ఘకాలం తర్వాత మార్కెట్ సోమవారం ప్రారంభంకావడంతో ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల వేలాది మంది రైతులు మిర్చి బస్తాలను మార్కెట్‌కు తరలించారు. దాదాపు ఉదయం 10గంటల వరకు మార్కెట్లోకి లక్షకు పైగా బస్తాలు ఉన్నట్లు మార్కెట్ వర్గాలు అంచనావేస్తున్నాయి. మార్కెట్‌లోని మిర్చి, పత్తి యార్డులన్నీ ఫుల్ కాగా.. ఇంకా వేలాది బస్తాలు యార్డుల ఆవరణల్లో నెట్టుకొట్టారు. అకాల వర్షమొస్తే రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారే అవకాశం ఉంది. అన్ని కష్టాలకు, నష్టాలకు ఓర్చుకుని కనీసం ధర అయినా బాగా పడితే చాలు చేతుల కష్టమైనా గిట్టుబాటు అవుతుందనుకుంటే.. ఇక్కడ అది కూడా సాధ్యం కాదని తేలిపోయింది సారూ అంటూ వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండ మండలానికి చెందిన ధస్రు అనే లంబాడీ రైతు దిశ ప్రతినిధి చెబుతూ కన్నీరు పెట్టుకున్నాడు.