రేవంత్ సీక్రెట్ సర్వే.. ఆ నాలుగు అసెంబ్లీ స్థానాలపై స్పెషల్ ఫోకస్
దిశ, నాగర్‌కర్నూల్ : టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి రాకతో జోరు పెంచిన కాంగ్రెస్ కందనూలులో కొత్త నాయకుడు ఎవరిని దింపాలన్న కసరత్తు మొదలుపెట్టినట్టు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన రేవంత్ రెడ్డి తన సొంత జిల్లా అయిన నాగర్ కర్నూల్ జిల్లాలోని అసెంబ్లీ స్థానాలను ఎలాగైనా కైవసం చేసుకునేందుకు ఇప్పటికే పలువురు నేతలతో మంతనాలు జరిపినట్లు చర్చ నడుస్తోంది. కందనూలు నియోజకవర్గంలో పట్టువదలని విక్రమార్కుడిలా కూచుకుళ్ల దామోదర్ రెడ్డి అప్పట్లో కాంగ్రెస్ పార్టీ […]
దిశ, నాగర్‌కర్నూల్ : టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి రాకతో జోరు పెంచిన కాంగ్రెస్ కందనూలులో కొత్త నాయకుడు ఎవరిని దింపాలన్న కసరత్తు మొదలుపెట్టినట్టు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన రేవంత్ రెడ్డి తన సొంత జిల్లా అయిన నాగర్ కర్నూల్ జిల్లాలోని అసెంబ్లీ స్థానాలను ఎలాగైనా కైవసం చేసుకునేందుకు ఇప్పటికే పలువురు నేతలతో మంతనాలు జరిపినట్లు చర్చ నడుస్తోంది. కందనూలు నియోజకవర్గంలో పట్టువదలని విక్రమార్కుడిలా కూచుకుళ్ల దామోదర్ రెడ్డి అప్పట్లో కాంగ్రెస్ పార్టీ కోసం పోరాడుతూ నాలుగు పర్యాయాలు స్వల్ప ఓట్ల తేడాతో పరాజయం పాలై పార్టీ కేడర్‌ను, ఓటు బ్యాంకును కాపాడుతూ వచ్చారు.
దీంతో వారికి అప్పట్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా పరిషత్ చైర్మన్, ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టి రుణం తీర్చుకుంది. ఆ తర్వాత ఆయన చిరకాల ప్రత్యర్థి అయిన నాగం జనార్దన్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం పార్టీలో చేర్చుకోవడంతో దామోదర్ రెడ్డి పార్టీపై అలకపూనారు. దీంతో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీతో జత కట్టి ప్రత్యర్థిని ఓడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఉన్న సాన్నిహిత్యం కారణంగా టీఆర్ఎస్‌లో ఎమ్మెల్సీగా కొనసాగుతూ వస్తున్నారు. వచ్చే సంవత్సరం జనవరిలో ఎమ్మెల్సీ పదవి కాలం ముగియనుండటంతో భారత ఎన్నికల సంఘం ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసింది. కాగా మరోసారి ఎమ్మెల్సీ పదవిని తన కుమారుడికి ఇవ్వాలని ముందస్తుగా ఒప్పందం కుదుర్చుకున్నారు. కానీ పోటీదారుల సంఖ్య బాగా పెరిగింది.
ఈ నేపథ్యంలో మరోసారి ఎమ్మెల్సీ పదవి వరిస్తుందా.? లేదా అనే చర్చ నడుస్తోంది. స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డితో కూచుకుళ్లకు పొసగడం లేదు. దామోదర్ రెడ్డి వర్గంపై అనవసరమైన కేసులు పెట్టి జైలుపాలు చేసి నిందించడంతో దామోదర్ రెడ్డి బహిరంగంగానే ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిని విమర్శించారు. మరోసారి ఎమ్మెల్సీ రాకుండా స్థానిక ఎమ్మెల్యే అడ్డు తగులుతున్నారన్న ఆరోపణలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. అయితే నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలన్న లక్ష్యంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. దామోదర్ రెడ్డిని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేరదీసే ప్రయత్నాలు మొదలుపెట్టారనే చర్చ జోరందుకుంది. ఇందులో భాగంగానే దామోదర్ రెడ్డి కుమారుడు రాజేష్ రెడ్డితో రేవంత్ టచ్‌లో ఉన్నట్లు నియోజకవర్గంలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న నాగం జనార్దన్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అవినీతి, అక్రమాలను ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ ప్రభుత్వానికి చెమటలు పట్టిస్తున్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి తన సొంత జిల్లా అయిన నాగర్ కర్నూల్‌లోని నాలుగు అసెంబ్లీ స్థానాల్లో సీక్రెట్‌గా సర్వే నిర్వహించినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్, నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయని.. ఇక్కడ యువకులను రంగంలోకి దింపితే నాగర్ కర్నూల్‌తో సహా నాలుగు స్థానాల్లో గెలిచి స్వీప్ చేయనున్నట్లు సర్వే రిపోర్ట్ నిర్ధారించినట్లు తెలిసింది.
ఈ నాలుగు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీనే అన్న భావన ఓటర్లలో ఉన్నదని దీంతో టీఆర్ఎస్‌పై ఉన్న వ్యతిరేకత కాంగ్రెస్‌కు కలిసి వస్తుందన్న ధీమాలో ఉన్నారు. అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్, నియోజక వర్గాల్లో టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా బలహీనపడిందని నాగర్ కర్నూల్‌లో మాత్రం కొత్త నాయకుడిని రంగంలోకి దింపితే కాంగ్రెస్ ఖాతాలోకి నాలుగు స్థానాలు చేరతాయని రేవంత్ రెడ్డి తన సన్నిహితులతో చర్చించినట్లు తెలిసింది. ఇక రంగంలోకి ఎవరిని దింపి కాంగ్రెస్ జెండా ఎగురవేస్తుందో వేచిచూడాల్సిందే.