పసుపు బోర్డుపై పార్లమెంట్‌లో ఉత్తమ్ సూటి ప్రశ్న

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో పసుపు బోర్డును కేంద్ర ప్రభుత్వం ఎందుకు నెలకొల్పడం లేదని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి మంగళవారం లోక్‌సభలో ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం భూసేకరణ చేసినా ఎందుకు విముఖత చూపుతోందని ప్రశ్నించారు. పసుపు బోర్డు ఏర్పాటుపై ఎంపీలు ఎన్ని రకాలుగా ప్రభుత్వాన్ని ప్రశ్నించినా స్పష్టమైన సమాధానం రావడం లేదన్నారు. గతంలో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, ప్రకాష్ జవదేకర్ లాంటివారు స్పష్టమైన హామీ ఇచ్చినా వాటిని నిలుపుకోవడంపై కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. […]

Update: 2021-03-16 12:56 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో పసుపు బోర్డును కేంద్ర ప్రభుత్వం ఎందుకు నెలకొల్పడం లేదని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి మంగళవారం లోక్‌సభలో ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం భూసేకరణ చేసినా ఎందుకు విముఖత చూపుతోందని ప్రశ్నించారు. పసుపు బోర్డు ఏర్పాటుపై ఎంపీలు ఎన్ని రకాలుగా ప్రభుత్వాన్ని ప్రశ్నించినా స్పష్టమైన సమాధానం రావడం లేదన్నారు. గతంలో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, ప్రకాష్ జవదేకర్ లాంటివారు స్పష్టమైన హామీ ఇచ్చినా వాటిని నిలుపుకోవడంపై కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు.

ప్రశ్నోత్తరాల సమయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ప్రపంచంలోని మొత్తం పసుపు ఉత్పత్తిలో భారత్ వాటా దాదాపు 80 శాతం ఉందని, ఒక్క నిజామాబాద్ జిల్లా నుంచే 50శాతం ఉందని వివరించారు. పసుపు బోర్డును పెట్టాలన్న ప్రతిపాదన లేదంటూ ఒకరోజు, స్పైస్ బోర్డులో భాగంగా ఉంటుందని మరోరోజు చెబుతున్న కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన సమాధానాన్ని మాత్రం ఇవ్వడంలేదన్నారు. తాను అడిగిన ప్రశ్నకు సైతం మంత్రి నుంచి సరైన సమాధానం రాలేదన్నారు. స్పైస్ బోర్డులో భాగంగానే పసుపు కూడా ఉంటుందని, రీజినల్ ఆఫీసు పెట్టామని, ఎక్స్‌టెన్షన్ కేంద్రాన్నిపెట్టామని.. ఇలాంటి సమాధానాలు వస్తున్నాయే తప్ప పసుపు బోర్డు పెట్టే ఉద్దేశం ఉందో లేదో మాత్రం చెప్పడంలేదని కేంద్రమంత్రిని నిలదీశారు. పసుపు పంటకు మద్ధతు ధర నిర్ణయించడంతో పాటు మార్కెట్ ఇంటర్‌వెన్షన్ స్కీమ్‌ను కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా పసుపు రైతులు ఒక్కో ఎకరానికి సుమారు లక్షన్నర రూపాయలు ఖర్చు చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తెచ్చారు.

నిజామాబాద్ ఎంపీ రాజీనామా చేయాలి

పసుపు బోర్డు సాధిచకుంటే రాజీనామా చేస్తానని స్టాంపు పేపర్ మీద హామీ ఇచ్చిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇప్పటికీ తన హామీని నిలబెట్టుకోలేకపోయారని, అందువల్ల ఆయన తన పదవికి రాజీనామా చేసి రైతుల పక్షాన పోరాటం చేయాలని తెలంగాణ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి సాగర్ డిమాండ్ చేశారు. పార్లమెంట్ సభ్యుడిగా గెలిచి రెండేళ్లు పూర్తయిందని, తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటుచేసే ఆలోచన లేదని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా స్పష్టంగా ప్రకటించినందున ఆయన పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 1.40 లక్షల ఎకరాల్లో పసుపు సాగు అవుతోందని, ఎగుమతి చేయగలిగే నాణ్యమైన పంటను పండిస్తున్నారని గుర్తుచేశారు. మద్దతు ధర లభించక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పసుపు బోర్డు ద్వారా రైతులకు మద్దతు ధర గ్యారంటీ ఉంటుందని పేర్కొన్నారు.

Tags:    

Similar News