హస్తానికి చికిత్స దిశగా అధిష్ఠానం
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ మార్పులకు శ్రీకారం చుట్టనున్నారు. టీపీసీసీ చీఫ్ మార్పు ఒక్కటే ఉంటుందని ఇప్పటి వరకు భావించినా, అధిష్టానం మాత్రం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే నూతన అధ్యక్షుడి ప్రకటన రానుంది. పలు కమిటీలకు కూడా కొత్త నాయకత్వాన్ని ప్రకటించనున్నారు. యువతకు ప్రాధాన్యం ఇవ్వనున్నారని తెలుస్తోంది. సీనియార్జీ, మాజీ ప్రజాప్రతినిధులు అనే అంశాలను పక్కన పెట్టి పార్టీని మళ్లీ క్షేత్రస్థాయికి మళ్లీ తీసుకువెళ్లే నేతలకు పగ్గాలు అప్పగించనున్నారు. […]
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ మార్పులకు శ్రీకారం చుట్టనున్నారు. టీపీసీసీ చీఫ్ మార్పు ఒక్కటే ఉంటుందని ఇప్పటి వరకు భావించినా, అధిష్టానం మాత్రం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే నూతన అధ్యక్షుడి ప్రకటన రానుంది. పలు కమిటీలకు కూడా కొత్త నాయకత్వాన్ని ప్రకటించనున్నారు. యువతకు ప్రాధాన్యం ఇవ్వనున్నారని తెలుస్తోంది. సీనియార్జీ, మాజీ ప్రజాప్రతినిధులు అనే అంశాలను పక్కన పెట్టి పార్టీని మళ్లీ క్షేత్రస్థాయికి మళ్లీ తీసుకువెళ్లే నేతలకు పగ్గాలు అప్పగించనున్నారు. టీపీసీసీ పీఠం ఇప్పటికే రేవంత్‌రెడ్డికి ఖాయమైందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇతర నేతలను సముదాయిస్తున్నారని కూడా చెబుతున్నారు. పార్టీకి అవసరమని భావించే నేతలను బుజ్జిగించాలని, వారికి కమిటీలలో అవకాశం కల్పించాలని అధిష్టానం సూచించిందని సమాచారం.
అప్పుడే ఆరా..
టీపీసీసీ చీఫ్ విషయంలో అభిప్రాయాలు సేకరించిన కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్కం ఠాగూర్ పలు ఇతర అంశాలపై కూడా ఆరా తీశారని పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. కొంతమంది నేతలు, ప్రజాప్రతినిధులతో కీలక అంశాలను చర్చించారనీ తెలుస్తోంది. టీపీసీసీ చివరి రేసులో రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీధర్‌బాబు ఉన్న విషయం విదితమే. రేవంత్‌రెడ్డికి వద్దంటూ సీనియర్ల పేరిట లేఖ పంపారు. ఢిల్లీ వెళ్లిన కోమటిరెడ్డి అధిష్టానాన్ని కలిసే ప్రయత్నం చేసినా ఫలించలేదు. రేవంత్‌రెడ్డికి టీపీసీసీ చీఫ్ ఇస్తే కోమటిరెడ్డి సోదరులు పార్టీని వీడుతారనే ప్రచారం జరుగుతోంది. మరికొందరు కూడా బీజేపీలో చేరుతారని కూడా అంటున్నారు. అధిష్టానం దీనిమీద కూడా దృష్టి పెట్టింది. సీనియర్లమని చెప్పుకునేవారు కాకుండా, ఇప్పుడున్న పరిస్థితులలో పార్టీ కోసం ఎవరు పనికి వస్తారనే కోణంలో నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్కపై కూడా పార్టీ నేతలు చాలా ఆరోపణలు చేసినట్లు సమాచారం. దీంతో ఆయనను మార్చే అవకాశాలు ఉన్నాయని పార్టీలో చర్చ జరుగుతోంది. టీపీసీసీ చీఫ్ గా రేవంత్‌రెడ్డి వస్తే వెంకట్‌రెడ్డికి ఏఐసీసీలో పదవి ఇస్తారని, రాజగోపాల్‌రెడ్డికి సీఎల్పీ బాధ్యతలను అప్పగిస్తారని అంటున్నారు. మల్లు రవికి కాంగ్రెస్ పార్టీ జాతీయ ఎస్సీసెల్ బాధ్యతలను ఇస్తారని, సీనియర్ల స్థానాలలో యువతకు ప్రాధాన్యం ఇస్తారని చెబుతున్నారు.
పాదయాత్రగా సాగేలా
తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిన పార్టీగా కాంగ్రెస్‌కు పేరుందని, దాన్ని అందిపుచ్చుకోవడంలో రాష్ట్ర నాయకత్వం విఫలమవుతోందనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ అధ్యక్ష బాధ్యతలను ఎవరికి ఇచ్చినా పాదయాత్రతో మరోసారి ప్రజలలోకి వెళ్లాలని అధిష్టానం సూచించినట్లు సమాచారం. రాష్ట్రంలో పాదయాత్ర చేసేందుకు రేవంత్‌రెడ్డి గతంలోనే సిద్ధమయ్యారు. పలు కారణాలతో వాయిదా వేసుకున్నారు. ఇటీవల పరిణామాల అనంతరం కూడా పాదయాత్రకు సిద్ధమవుతున్నానంటూ చెప్పుకొస్తున్నారు. 2023 ఎన్నికల వరకు పార్టీ నేతలు పూర్తిగా ప్రజల్లో ఉండాలని, పాదయాత్రతో ఇది సాధ్యమవుతుందనే భావన ఉంది. 2023 ఎన్నికలే లక్ష్యంగా పని చేయాలని కొత్త నాయకత్వంపై బాధ్యతలు పెడుతున్నారు. పార్టీ కేడర్ మొత్తం ఏకతాటిపైకి వచ్చి పాదయాత్రతో సాగితే ప్రజలలో పట్టు పెరుగుతుందని యోచిస్తున్నారు. ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ఉందనే నమ్మకం కల్పించేలా పని చేయాలని పార్టీ నేతలకు అధిష్ఠానం దిశానిర్దేశం చేయనుంది.