ఇంకెన్నాళ్లు.. హుజురాబాద్‌పై మౌనం వీడరా..?

దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్‌కు హుజురాబాద్​ టెన్షన్ పట్టుకుంది. ఇక్కడ గెలుపు కంటే 2018లో వచ్చిన 61 వేల ఓట్లను తిరిగి రాబట్టుకోవడమే టీపీసీసీకి ముందున్న సవాల్. ఇప్పటికే హుజురాబాద్‌లో అధికార పార్టీ పాగా వేసింది. అటు ఈటల కూడా పోటాపోటీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. కానీ, రేవంత్‌కు టీపీసీసీ చీఫ్​ పగ్గాలు అప్పగించినప్పుడు చూపించిన జోష్.. హుజురాబాద్​ అంశంలో మాత్రం కనిపించడం లేదు. జోష్ ​మాత్రమే కాదు.. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సైలెంట్‌గా మారింది. చేతి […]

Update: 2021-08-12 22:04 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్‌కు హుజురాబాద్​ టెన్షన్ పట్టుకుంది. ఇక్కడ గెలుపు కంటే 2018లో వచ్చిన 61 వేల ఓట్లను తిరిగి రాబట్టుకోవడమే టీపీసీసీకి ముందున్న సవాల్. ఇప్పటికే హుజురాబాద్‌లో అధికార పార్టీ పాగా వేసింది. అటు ఈటల కూడా పోటాపోటీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. కానీ, రేవంత్‌కు టీపీసీసీ చీఫ్​ పగ్గాలు అప్పగించినప్పుడు చూపించిన జోష్.. హుజురాబాద్​ అంశంలో మాత్రం కనిపించడం లేదు. జోష్ ​మాత్రమే కాదు.. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సైలెంట్‌గా మారింది. చేతి గుర్తుకు ఓటేయాలని చెప్పే నేత కూడా కనిపించడం లేదు. మరోవైపు ముందుగా ఈ సెగ్మెంట్‌కు ఇంచార్జీలను ప్రకటించినా.. ప్రకటనకే పరిమితమైంది. ఒక్క నేత కూడా ఇప్పటివరకూ అక్కడికి వెళ్లడం లేదు. ఎన్నికల కమిటీ చైర్మన్‌గా ఉన్న దామోదర రాజనర్సింహా ఒక్కసారి వెళ్లి వచ్చారు. ఇక రేవంత్​రెడ్డి నోటి వెంట కూడా హుజురాబాద్​ ప్రస్తావన రావడం లేదు. దీంతో రాష్ట్రమంతా హోరెత్తిస్తున్న హుజురాబాద్.. కాంగ్రెస్‌లో మాత్రం సైలెంట్​ అవుతోంది.

స్టేట్‌లో గ్రాఫ్​.. హుజురాబాద్‌లో ప్లాప్..​

రేవంత్​ రెడ్డికి టీపీసీసీ పగ్గాలు ఇవ్వడంలో స్టేట్‌లో కాంగ్రెస్ ​గ్రాఫ్ ​పెరిగిందనే అంచనాలు వచ్చాయి. ఇటీవల నిర్వహించిన ఇంద్రవెల్లి దళిత, గిరిజన దండోరా కూడా పార్టీలో జోష్​ తెచ్చింది. కానీ, ఈ ఊపు హుజురాబాద్‌లో మాత్రం కానరావడం లేదు. అసలు హుజురాబాద్‌లో కాంగ్రెస్ వ్యూహం ఏమిటో పార్టీ నేతలకు కూడా అంతు చిక్కడం లేదు. కొత్త చీఫ్ ఏమైనా ఎత్తులు వేస్తున్నాడా..?, రాష్ట్రంలో పెరిగిన గ్రాఫ్ హుజురాబాద్‌లో ఎలాంటి ప్రభావం చూపిస్తుందనేది పొలిటికల్‌గా హాట్ టాపిక్‌గా మారింది. ఈ చర్చ సాగుతుండగానే రేవంత్ ​ఆధ్వర్యంలోని కోర్​ కమిటీ హుజురాబాద్ ఉపఎన్నికల బాధ్యతను ఎన్నికల కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహకు అప్పగించింది. అభ్యర్థి ఎంపిక విషయంపై కూడా దామోదర రాజనర్సింహకే పూర్తి అధికారాలు ఇచ్చారు. హుజురాబాద్ ఉపఎన్నిక విషయంలో పీసీసీ చీఫ్​ రేవంత్ సైలెంట్‌గా ఉంటుండటం, ఉప ఎన్నికల బాధ్యతలను రేవంత్ సైడ్ ట్రాక్ చేసినట్లు పార్టీలో హాట్ టాఫిక్‌గా మారింది.

సైలెంట్ వెనక..?

హుజురాబాద్ ఉపఎన్నిక విషయంలో రేవంత్​ రెడ్డితో సహా టీపీసీసీ నేతలంతా సైలెంట్‌గా ఉండటం వెనక అనేక వ్యూహాలు ఉన్నట్లు గాంధీభవన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం హుజురాబాద్‌లో కాంగ్రెస్ పరిస్థితి అంత ఆశాజనకంగా లేదని, ఈ స్థితిలో ఎక్కువ చాన్స్ తీసుకున్నా ఫలితాలు తేడా వస్తే తనకు తానుగానే ఒక వైఫల్యాన్ని మూటగట్టుకున్న భావనలో రేవంత్ ​రెడ్డి ఉంటున్నట్లు చెప్పుకుంటున్నారు. అందుకే హుజురాబాద్ ఉప ఎన్నిక కోసం అభ్యర్థి ఎంపికతో సహా అన్నింటా రేవంత్ సైడ్ అయిపోయారంటున్నారు. ప్రస్తుతం హుజురాబాద్ విషయంలో రేవంత్​ రెడ్డి సైలెంట్‌గా ఉండటంతో అక్కడి కేడర్​లోనూ జోష్​ కనిపించడం లేదు. మరోవైపు కాంగ్రెస్‌కు పెద్దదిక్కుగా ఉన్న నేతలు కాంగ్రెస్‌ను వీడారు. స్వర్గం రవి, సత్యనారాయణరావు వంటి నేతలు టీఆర్‌ఎస్‌లో చేరారు.

ఓటు బ్యాంకు కాపాడుకుంటుందా..?

హుజురాబాద్​ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు కొంత పట్టు ఉన్నా.. ఇక్కడ హస్తం గుర్తుపై ఎవరూ గెలువలేదు. ఇది ఒక విధంగా పార్టీ నేతలను డైలమాలో పడేస్తోంది. మరోవైపు గత ఎన్నికల్లో కౌశిక్​రెడ్డి అభ్యర్థిగా 61 వేలు కాంగ్రెస్​ ఖాతాలో పడ్డాయి. ప్రస్తుతం హుజూరాబాద్ ఉప ఎన్నికలు ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈ సీటును గెలుచుకోవాలని టీఆర్ఎస్, బీజేపీలు గట్టిగా ప్రయత్నిస్తుంటుంటే.. నియోజకవర్గంలో తమ బలం పెంచుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. చాలా ఏళ్లుగా రాష్ట్రంలో అధికార పక్షానికి బలమైన పోటీ ఇవ్వలేకపోతున్న కాంగ్రెస్.. ఈ ఎన్నికల్లో మాత్రం పాత ఓటు బ్యాంకును కచ్చితంగా కాపాడుకోవాల్సిన పరిస్థితుల్లో ఉంది. అంతేకాదు.. పాత ఓటు బ్యాంకును కాపాడుకుంటే రెండు పార్టీల కొట్లాటలో తమకు కూడా గెలుపు అవకాశాలున్నాయంటూ కేడర్​ కొంత ఆశ కూడా పెట్టుకుంది.

అసలు పోటీకి దిగేవారెవ్వరు..?

కౌశిక్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడటంతో ప్రత్యామ్నాయ నేత కోసం కాంగ్రెస్​ వెతుకుతూనే ఉంది. హుజురాబాద్ ఉపఎన్నిక షెడ్యూల్​పై ఇంకా తేలకున్నా.. ఇప్పటికైతే బీజేపీ అభ్యర్థి ఈటల, టీఆర్‌ఎస్ ​అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ ​తరపున సీఎం సహా మంత్రులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. కానీ కాంగ్రెస్​ పార్టీ మాత్రం అభ్యర్థి కోసం అన్వేషణ సాగిస్తూనే ఉంది. దీంతో హస్తం కేడర్ ​పూర్తి స్తబ్దతలోకి వెళ్లిపోయింది. దూకుడుగా వ్యవహరించే టీపీసీసీ చీఫ్ రేవంత్ కూడా ఈ ఉపఎన్నిక విషయంలో మాత్రం స్తబ్దుగా ఉండటం పార్టీ నేతలను ఆయోమయంలో పడేస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ తరుపున హుజురాబాద్‌లో కొండా సురేఖను పోటీలో దింపే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. హుజురాబాద్ అభ్యర్థి ఎంపిక బాధ్యతను దామోదర రాజనర్సింహకు అప్పగించిన నేపథ్యంలో ఇటీవల జరిగిన నియోజకవర్గ సమావేశంలో ఈ మేరకు సంకేతాలు ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. అయితే స్థానిక నేతకే అవకాశం ఇస్తామని, ఈసారి గెలుపుపై కాకుండా బలం పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తామని, వలస నేతలు కాకుండా స్థానిక నేతలకు టికెట్ ​ఇస్తామంటూ దామోదర రాజనర్సింహా ‘దిశ’కు వెల్లడించారు. అయితే, టికెట్​ ప్రచారం మాత్రం పార్టీలో సాగుతూనే ఉంది. కొండా సురేఖతో పాటు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు చెప్పుతుండగా.. పొన్నం కూడా తాను పోటీ చేయనంటూ తిరస్కరించారు. ఒకవేళ దళిత సామాజికవర్గానికి చెందిన నేతకు అవకాశం ఇవ్వాలనుకుంటే వరంగల్‌కు చెందిన సీనియర్ నేత దొమ్మాటి సాంబయ్య, కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణలకు అవకాశం ఇవ్వొచ్చుననే ప్రచారం జరుగుతోంది. వీరితో పాటుగా పెద్దపల్లి డీసీసీ అధ్యక్షుడు ఈర్ల కొమురయ్య, హుజురాబాద్​ ప్రాంతానికి చెందిన ప్యాట రమేష్​ పేర్లు కూడా ఉన్నాయి.

ఒక్కసారైనా కనిపించి పొండి ప్లీజ్..?

ఉపఎన్నిక కోసం ఇన్‌చార్జ్‌లను టీపీసీసీ ప్రకటించినా.. కనీసం అటు వైపు వెళ్లే నేతలు లేకపోవడం పార్టీ కేడర్‌ను బాధిస్తోంది. హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ పీసీసీ ఇన్‌చార్జిగా మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహకు బాధ్యతలు అప్పగించిగా.. ఎన్నికల సమన్వయకర్తలుగా జీవన్‌రెడ్డి, శ్రీధర్​బాబు, పొన్నం ప్రభాకర్‌లను నియమించింది. వీరిలో రాజనర్సింహా ఒక్కసారి వెళ్లగా.. మిగిలిన నేతలు వెళ్లలేదు. అదే విధంగా వీణవంక మండల ఇన్‌చార్జ్‌లుగా ఆది శ్రీనివాస్, సింగీతం శ్రీనివాస్, జమ్మికుంట మండల ఇన్‌చార్జ్‌లుగా విజయరమణారావు, రాజ్ ఠాగూర్, జమ్మికుంట టౌన్ ఇన్‌చార్జ్‌లుగా మాజీ ఎంపీ రాజయ్య, ఈర్ల కొమురయ్య, హుజురాబాద్ మండల ఇన్‌చార్జ్‌లుగా టి. నర్సారెడ్డి, లక్ష్మణ్‌ కుమార్, హుజురాబాద్ టౌన్ ఇన్‌చార్జ్‌లుగా బొమ్మ శ్రీరాం, జువ్వాడి నర్సింగరావు, ఇల్లంతకుంట మండల ఇన్‌చార్జ్‌లుగా నాయిని రాజేందర్ రెడ్డి, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కమలాపూర్ మండల ఇన్‌చార్జ్‌లుగా కొండా సురేఖ, దొమ్మటి సాంబయ్యను నియమించారు. కానీ వీరిలో ఒక్కరు కూడా ఇప్పటి వరకూ హుజురాబాద్‌లో అడుగు పెట్టలేదు.

Tags:    

Similar News