గత పాలకులు పాలమూరుకు మిగిల్చింది కరువు కాటకాలే: మంత్రి హరీష్ రావు
మేము అధికారంలోకి వస్తే పాలమూరుకు అది చేస్తాం ఇది చేస్తామంటూ కల్లబొల్లి మాటలు చెబుతున్న ప్రతిపక్ష పార్టీల నాయకులు 70 సంవత్సరాలు అధికారంలో ఉండి పాలమూరు జిల్లాకు కరువు, కన్నీళ్లు, వలసలు, ఆత్మహత్యలు మిగిల్చారే తప్ప ఒరగబెట్టిందేమీ లేదని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు.
దిశ , జడ్చర్ల: మేము అధికారంలోకి వస్తే పాలమూరుకు అది చేస్తాం ఇది చేస్తామంటూ కల్లబొల్లి మాటలు చెబుతున్న ప్రతిపక్ష పార్టీల నాయకులు 70 సంవత్సరాలు అధికారంలో ఉండి పాలమూరు జిల్లాకు కరువు, కన్నీళ్లు, వలసలు, ఆత్మహత్యలు మిగిల్చారే తప్ప ఒరగబెట్టిందేమీ లేదని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. శనివారం జడ్చర్లలో 30 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి తదితరులతో కలిసి మంత్రి హరీష్ రావు ఆసుపత్రిని ప్రారంభించారు.
అనంతరం జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ సి లక్ష్మారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సభలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక అవసరమైన మెడికల్ కళాశాలలు, ఆస్పత్రులు ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని, రోడ్లు, తాగునీటి సౌకర్యాలు, 24 గంటల విద్యుత్ తదితర అనేక ప్రజా సంక్షేమ పనులు చేశామన్నారు. పాలమూరు జిల్లా ఇప్పుడు పచ్చని పంటలతో కళకళలాడుతోందని రికార్డు స్థాయిలో పంటలు పండుతున్నాయని చెప్పారు. ఇతర రాష్ట్రాల వలస కూలీలు ఇక్కడ పనిచేయడానికి వస్తున్నారని అన్నారు. త్వరలోనే పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి ఇక్కడ భూములను తడుపుతామని మంత్రి స్పష్టం చేశారు.
ఇంతగా అభివృద్ధి, సంక్షేమ పనులు చేయడంతో ప్రజలు ఆనందంగా ఉంటే ఓర్వలేని ప్రతిపక్ష పార్టీల నాయకులు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికలలో మేమే అధికారంలోకి వస్తామని, మళ్లీ ఇందిరమ్మ పాలన తెస్తామని ఇటీవల జడ్చర్లలో జరిగిన సభలో కాంగ్రెస్ నేతలు అంటున్నారని, వారికి 50 చోట్ల అభ్యర్థులే లేరు అటువంటిది ఎలా గెలుస్తారని ఎద్దేవా చేశారు. మీరు గెలిస్తే వచ్చేది మళ్లీ కరువు కాటకాలు, వలసలు అన్న విషయం ప్రజలకు తెలుసు అన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చిన వారినే కాదు, పింఛనుదారులు, రైతు బంధు పొందుతున్న రైతులు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులను అందరిని ఓట్లు తప్పకుండా అడుగుతామని, తప్పకుండా ఉమ్మడి పాలమూరులో 14 అసెంబ్లీ సీట్లు మేమే గెలుస్తామని మంత్రి హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు.
ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే తరిమికొడుతారు: మంత్రి శ్రీనివాస్ గౌడ్
పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తండ్రి వయసు ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ను, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. ఇక ముందు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మాత్రం చూస్తూ ఊరుకోబోమని అవసరమైతే తరిమి కొట్టడానికి మా నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. తెలంగాణ రాకముందు, తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధి ఏంటో కళ్ళముందు కనిపిస్తుందని, ప్రజలు తమ వెంటే ఉన్నారని మళ్లీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో మేమే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.
నీవు బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు, బ్రోకర్ ఇజం చేస్తున్నావ్ కదా: ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
‘ఇటీవల జడ్చర్లలో జరిగిన సభలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇక్కడ ఏ అభివృద్ధి జరగలేదని, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నానని ఆరోపించారని, సరే నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ నా స్థాయి మేరకు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటున్నానని. మరి నీవు బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు, బ్రోకర్ ఇజం చేస్తున్నావ్ కదా’ అని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఘాటుగా సమాధానం ఇచ్చారు. జడ్చర్ల నియోజకవర్గాన్ని ఏ స్థాయిలో అభివృద్ధి చేశానో మా ప్రజలకు తెలుసు అన్నారు.
రోడ్లు, వైద్య సదుపాయాలు, సాగునీటి వనరులు, పార్కులు ఇలా ఎన్నో అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు చేశామన్నారు. ప్రజలు తమ వైపే ఉన్నారని వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారం సొంతం చేసుకుంటామని అన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, రాష్ట్ర కార్పొరేషన్ల చైర్మన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్, వాల్య నాయక్, సంగీత నాటక అకాడమీ మాజీ చైర్మన్ శివకుమార్, మున్సిపల్ చైర్మన్ దోరేపల్లి లక్ష్మీ రవీందర్, వైస్ చైర్మన్ సారిక రామ్మోహన్, మాజీ జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, గోవర్ధన్ రెడ్డి, శ్రీకాంత్, ఇంతియాజ్, సతీష్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.