నకిలీ విద్యా ధృవీకరణ పత్రాలు విక్రయించే రాకెట్ గుట్టురట్టు.. ఏడుగురు అరెస్ట్

చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకునే నిరుపేదలకు నకిలీ విద్యా ధృవీకరణ పత్రాలను విక్రయిస్తున్న ఓ ముఠా గుట్టును సౌత్​ జోన్​ టాస్క్​ఫోర్స్ పోలీసులు చాదర్​ఘాట్​ పోలీసులతో కలిసి రట్టు చేశారు.

Update: 2023-02-28 13:45 GMT

దిశ, చార్మినార్: చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకునే నిరుపేదలకు నకిలీ విద్యా ధృవీకరణ పత్రాలను విక్రయిస్తున్న ఓ ముఠా గుట్టును సౌత్​ జోన్​ టాస్క్​ఫోర్స్ పోలీసులు చాదర్​ఘాట్​ పోలీసులతో కలిసి రట్టు చేశారు. ముఠాలోని ఏడుగురు వ్యక్తులను అరెస్ట్​ చేయగా పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఎస్ఎస్సీ, ఇంటర్మీడియట్​, వివిధ విశ్వ విద్యాలయాల డిగ్రీ సర్టిఫికేట్​లతో పాటు 11 సెల్​ఫోన్​లు, 4ల్యాప్​ టాప్​లు, రూ. 20 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సౌత్​జోన్​ టాస్క్​ఫోర్స్​ కార్యాలయంలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో సౌత్​ జోన్​ టాస్క్​ఫోర్స్​ ఇన్​స్పెక్టర్​ రాఘవేంద్రతో కలిసి టాస్క్​ఫోర్స్​ డీసీపీ గుమ్మి చక్రవర్తి వివరాలు వెల్లడించారు.

బజార్​ఘాట్​ కు చెందిన మొహమ్మద్​ హబీబ్(32), మలక్​పేట్​లో ఫ్లై అబ్రాడ్​ కన్సల్టెన్సీ. మొహమ్మద్​ హబీబ్​ రాయల్​కాలేజ్​ ఆఫ్​ ఇంజనీరింగ్​లో బిటెక్​ చదివాడు. అనంతరం టోలిచౌకిలోని రిలయన్స్​ అకాడమి కన్సల్టెన్సీలో అడ్మినిస్ట్రేటర్​గా చేరాడు. ఆ సమయంలో అతను ఎడ్యుకేషనల్​ మార్కెటింగ్​ కోసం హైదరాబాద్​కు వచ్చిన ఢిల్లీ వాసి సునీల్​ కపూర్​ను కలిశాడు. ఆ పరిచయం కాస్త వారిద్దరి మధ్య స్నేహం చిగురించింది. సులువుగా డబ్బులు సంపాదించేందుకు నకిలీ విద్యా సర్టిఫికేట్​లను విక్రయించాలని పథకం వేశారు. అందులో భాగంగానే చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకునే నిరుపేదలను టార్గెట్​ చేసేవారు. 2015లో మలక్​పేట్​లో ఫ్లై అబ్రాడ్​ కన్సల్టెన్సీ పేరుతో ఎండీ హబీబ్​ కన్సల్టెన్సీని ప్రారంభించారు.

అప్పటి నుంచి సునీల్​ కపూర్​ సహకారంతో సకల విద్యార్హత సర్టిఫికేట్లు అందజేస్తూ భారీగా డబ్బులు వసూలు చేస్తున్నాడు. ఈ విషయమై బహదూర్​పురా, సరూర్​నగర్​ పోలీస్​స్టేషన్​లలో అరెస్ట్​ కూడా అయ్యాడు. జైలు నుంచి విడుదల అయ్యాక తన ప్రవర్తనలో మార్పు కనిపించకపోగా చిలకల్​ గూడకు చెందిన అబ్దుల్​ రవూఫ్​ (36), సంతోష్​నగర్​కు చెందిన మొహమ్మద్​ ఇర్ఫాన్​ (28), ఈదిబజార్​ కు చెందిన షానవాజ్​ ఖాన్​ (29), నాంపల్లికి చెందిన మొహమ్మద్​ జుబేర్​ (34), మల్లేపల్లికి చెందిన సల్మాన్​ ఖాన్​(29), మలక్​పేట్​ కు చెందిన మొహమ్మద్​ అబ్దుల్​ సత్తార్​ (33)ల సహకారంతో పెద్ద ఎత్తున నకిలీ విద్యార్హత సర్టిఫికేట్​లను విక్రయిస్తున్నారు. కాగా అమెరికా, యూకేలో విదేశీ చదువుల పేరుతో వినియోగదారులకు భద్రత కల్పిస్తూ నకిలీ విద్యా సర్టిఫికేట్​లు అందించి భారీ మొత్తంలో వసూలు చేస్తున్నారు.

వచ్చిన సొమ్మును వాటాల పద్దతిలో పంచుకుంటారు. ఇది ఇలా ఉంటే ఎలాంటి పరీక్షలు లేకుండా యూనివర్సిటీలు, కాలేజ్​ ల వెనుక డోర్​ నుంచి నకిలీ విద్యాధృవీకరణ పత్రాలను అందజేస్తామని మభ్యపెట్టే అంతరాష్ట్రాల ఏజెంట్లను నమ్మవద్దని, ఎవరైనా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

నకిలీ విద్యా ధృవపత్రాలు స్వాధీనం..

తెలంగాణ యూనివర్శిటీ, ఆంధ్రాయూనివర్శిటీ, రాయలసీమ విశ్వ విద్యాలయం (ఏపీ), రాజస్థాన్​ నర్సింగ్​ కౌన్సిల్, సింబయాసిస్​ ఇంటర్​నేషనల్​ డీమ్డ్​ యూనివర్శిటీ (ఫూణె), ఛత్రపతి షాహు జీ మహరాజ్​ విశ్వ విద్యాలయం (కాన్పూర్​), నేషనల్ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఓపెన్​ స్కూల్(మహారాష్ట్ర) , సెకండరీ, హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్( పూణే), బెంగళూరు విశ్వవిద్యాలయం, అన్వర్​ ఉలూం కాలేజ్​ (మల్లేపల్లి), తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్​, ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్), కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్( న్యూఢిల్లీ), ఎం. అన్నా యునివర్శిటీ (తమిళనాడు), రాజస్థాన్​ యూనివర్శిటీ ఫర్​ హెల్డ్​ సైన్స్​ లకు చెందిన నకిలీ విద్యాసర్టిఫికేట్​లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.



 


Tags:    

Similar News