'పెట్టుబడి సాయం' వదులుకోని 'ముఖ్య'నేతలు!

దిశ, న్యూస్ బ్యూరో: దేశంలో మరే రాష్ట్రం ఇవ్వని తీరులో రైతులకు పంట పెట్టుబడి సాయంగా ప్రతీ సీజన్‌లో రైతుబంధు పేరుతో నగదు ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా సందర్భాల్లో ఒకింత గర్వంగానే చెప్పుకున్నారు. 2018 ఖరీఫ్ సీజన్ నుంచి అమలుచేస్తున్న ఈ పథకానికి సగటున 45 లక్షల మంది లబ్ధి పొందుతున్నారు. ప్రభుత్వం దీన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ఏటా సుమారు రూ. 12 వేల కోట్ల చొప్పున ఖర్చు చేస్తోంది. పేద, ధనిక తేడా లేకుండా […]

Update: 2020-05-10 22:20 GMT

దిశ, న్యూస్ బ్యూరో: దేశంలో మరే రాష్ట్రం ఇవ్వని తీరులో రైతులకు పంట పెట్టుబడి సాయంగా ప్రతీ సీజన్‌లో రైతుబంధు పేరుతో నగదు ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా సందర్భాల్లో ఒకింత గర్వంగానే చెప్పుకున్నారు. 2018 ఖరీఫ్ సీజన్ నుంచి అమలుచేస్తున్న ఈ పథకానికి సగటున 45 లక్షల మంది లబ్ధి పొందుతున్నారు. ప్రభుత్వం దీన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ఏటా సుమారు రూ. 12 వేల కోట్ల చొప్పున ఖర్చు చేస్తోంది. పేద, ధనిక తేడా లేకుండా ఎన్ని ఎకరాల భూమి కలిగిన రైతులకైనా దీన్ని అమలుచేస్తోంది. పెట్టుబడి సాయం అవసరం లేని సంపన్న రైతులు ‘గివ్ ఇట్ అప్’ పేరుతో స్వచ్ఛందంగా ఈ సాయాన్ని వదులుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. ఆ మేరకు 2018 ఖరీఫ్ సీజన్‌కు రాష్ట్రవ్యాప్తంగా భారీ స్థాయిలోనే స్పందన వచ్చింది. సుమారు రూ. 2.46 కోట్ల మేర ఆదా అయింది. కానీ ఆ తర్వాతి విడత నుంచి అది అటకెక్కింది. ముఖ్యమంత్రి కూడా తిరిగి ఎలాంటి పిలుపూ ఇవ్వలేదు, సంపన్న రైతులు పెద్దగా స్పందించనూ లేదు. త్వరలో ఐదవ విడత (2020 ఖరీఫ్) రైతుబంధు సాయం అందించనున్నట్లు ముఖ్యమంత్రే స్వయంగా చెప్పారు. కరోనా కష్టకాలంలో ఆదాయం లేకున్నా రైతుబంధును యధావిధిగా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో సంపన్న రైతులు ‘గివ్ ఇట్ అప్’ ద్వారా ఎంత మంది స్వచ్ఛందంగా ముందుకొస్తారో, ముఖ్యమంత్రి పేర్కొన్న ఆర్థిక కష్టాలకు ఏ మేరకు చేయూతనిస్తారో అనేది ఆసక్తికరంగా మారింది.

30 జిల్లాల నుంచి ఒక్క జిల్లాదాకా..

ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపుతో తొలి విడత 2018 ఖరీఫ్‌లో మోతుబరి రైతులు భారీ ఎత్తున స్పందించారు. మొత్తం 30 జిల్లాల్లోని 1543 మంది అధికార పార్టీ నేతలు, భూస్వాములు, ఐఏఎస్ అధికారులు ‘గివ్ ఇట్ అప్’ పేరుతో రైతుబంధు సాయాన్ని వదులుకున్నారు. గరిష్టంగా రంగారెడ్డి జిల్లాలో 349 మంది, సంగారెడ్డి జిల్లాలో 175 మంది, ఖమ్మం జిల్లాలో 144 మంది, మేడ్చల్ జిల్లాలో 140 మంది చొప్పున స్వచ్చందంగా రైతుబంధు సాయాన్ని వదులుకున్నారు. కానీ అదే ఏడాది రబీ సీజన్‌కు ఇచ్చిన రైతుబంధు సాయాన్ని మాత్రం రాష్ట్రం మొత్తంమీద కేవలం ఏడు జిల్లాల్లోని 29 మంది మాత్రమే వదులుకున్నారు. తొలి విడతలో రంగారెడ్డి జిల్లా అత్యధిక స్థాయిలో స్పందిస్తే రబీ సీజన్ వచ్చేటప్పటికి ఒక్కరు కూడా వదులుకోలేదు. సంగారెడ్డిలో 17 మంది మాత్రమే మిగిలారు. ఇక ఖమ్మం జిల్లాలో కేవలం ఆరుగురు మాత్రమే వదులుకున్నారు. మేడ్చల్ జిల్లాలో కూడా ఒక్కరే ఈ సాయాన్ని వదులుకున్నారు. కాగా, 2019 ఖరీఫ్ సీజన్లో రాష్ట్రం మొత్తం మీద కేవలం నలుగురు మాత్రమే రైతుబంధు సాయాన్ని వదులుకున్నారు. ఈ నలుగురు సంగారెడ్డి జిల్లాకు చెందినవారే కావడం గమనార్హం. మిగతా అన్ని జిల్లాల్లో ఒక్కరు కూడా ఇందుకు ముందుకు రాలేదు.

‘గివ్ ఇట్ అప్’ చేయని సీఎం కేసీఆర్..

”నేను కూడా రైతునే. పెద కాపునే. రైతుల కష్టాలు నాకు తెలుసు” అంటూ అనేక సందర్భాల్లో రైతుల సమస్యలపై గొంతెత్తిన కేసీఆర్ కూడా తొలి విడతకు మాత్రమే ‘గివ్ ఇట్ అప్’ కింద తనకు వచ్చే రైతుబంధు సాయాన్ని వద్దనుకుని తిరిగి ప్రభుత్వానికి అప్పజెప్పారు. ఆ తర్వాతి నుంచి ‘గివ్ ఇట్ అప్’ అటకెక్కింది. తొలి విడతలో సిద్దిపేట జిల్లాలో మొత్తం 16 మంది రైతులు సుమారు రూ. 3.76 లక్షల మేర ముఖ్యమంత్రి పిలుపు మేరకు రైతుబంధు సాయాన్ని వద్దనుకుని ప్రభుత్వానికే తిరిగి ఇచ్చేశారు. కానీ రెండవ విడత (2018 రబీ), మూడవ విడత(2019 ఖరీఫ్)లలో మాత్రం సిద్దిపేట జిల్లా తరఫున ఒక్కరు కూడా ఈ సాయాన్ని వదులుకోలేదు. అందరూ తీసుకున్నారు. అనగా అందులో ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఉన్నారు. సిద్ధిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవెల్లి గ్రామంలో ఆయనకున్న 37.70 ఎకరాల సాగుభూమి (2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన అఫిడవిట్ ప్రకారం) కి పెట్టుబడి సాయం తీసుకున్నారు. తొలి విడతలో గివిట్ అప్ కు పిలుపునిచ్చి, తను స్వయంగా పాటించి, సంపన్న రైతుల్ని ప్రోత్సహించిన కేసీఆర్ రెండవ, మూడవ విడతలో తను కూడా రైతుబంధు నగదు అందుకున్నారు. అధికార పార్టీకి చెందిన చాలామంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు సైతం సీఎం బాటలోనే నడిచారు.

కష్టకాలంలో మరోసారి పిలుపునిస్తారా?

ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా రాష్ట్రానికి స్వీయ ఆర్థిక వనరులతో పాటు కేంద్రం నుంచి అదనంగా ఎలాంటి సాయం అందకపోయినా రైతుబంధు యధాతథంగా కొనసాగుతుందని కేసీఆర్ స్పష్టం చేశారు. కష్టకాలంలో వీలైనంత ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడం సహజం. ఇప్పుడు ఖరీఫ్ రైతుబంధు సందర్భంగా ముఖ్యమంత్రి మరోసారి ‘గివ్ ఇట్ అప్’ పిలుపును ఇస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఆర్థిక చిక్కుల కారణంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు నెలవారీ వేతనాన్ని వదులుకుని ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ఇచ్చారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ప్రభుత్వ సిబ్బంది సైతం ఒక రోజు వేతనాన్ని ఇచ్చారు. ఇక పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు కూడా వారి వంతు సాయంగా ఇచ్చారు. ఇందులో చాలా మందికి గ్రామాల్లో స్వంత సాగుభూములు ఉన్నాయి. ఇంతటి ఉదాత్త స్వభావాన్ని ప్రదర్శించిన వీరంతా ఇప్పుడు రైతుబంధు సాయాన్ని స్వచ్ఛందంగా వదులుకుంటారా అనేది కీలకంగా మారింది. తొలి విడతలో సుమారు రెండున్నర కోట్ల మేరకు మాత్రమే ప్రభుత్వానికి అందినా ఈసారి పిలుపు ఇస్తే దానికి స్పందన చాలా ఎక్కువగా ఉంటుందనే చర్చలు పార్టీ వర్గాల్లోనే మొదలయ్యాయి.

‘వేడి నీళ్ళకు చన్నీళ్ళు తోడు’ తరహాలో ఎంతో కొంత మేర ‘గివ్ ఇట్ అప్’ ద్వారా ప్రభుత్వానికి సమకూరినా దాన్ని ఇతర అవసరాలకు వినియోగించుకోడానికి దోహదపడుతుంది. ఇలాంటి కష్టకాలంలో సంపన్న రైతులు ఏ మేరకు వారి సామాజిక స్పృహను ప్రదర్శిస్తారో వేచి చూడాల్సిందే. ముఖ్యమంత్రి పిలుపు ఇస్తారా అనేది కూడా మున్ముందు స్పష్టం కానుంది.

Tags:    

Similar News