టైమ్ మ్యాగజైన్‌పై భారతీయ మహిళా రైతులు.. వుమెన్స్ డే కానుకగా ప్రత్యేక కథనం

దిశ, వెబ్ డెస్క్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ సంస్కరణలను రద్దు చేయాలని కోరుతూ సుమారు నాలుగు నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో ఎముకలు కొరికే చలిలో పోరాడుతున్న మహిళా రైతులకు సమున్నత గౌరవం లభించింది. ప్రముఖ ఆంగ్ల మాస పత్రిక టైం మ్యాగజైన్.. మార్చి నెల సంచిక కవర్ పేజీమీద మహిళా రైతుల ఫోటోతో పాటు ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఈ మేరకు శుక్రవారం ట్విట్టర్‌లో ఈ విషయాన్ని ప్రకటించింది. ‘నన్ను బెదిరించలేరు.. నన్ను […]

Update: 2021-03-05 03:31 GMT

దిశ, వెబ్ డెస్క్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ సంస్కరణలను రద్దు చేయాలని కోరుతూ సుమారు నాలుగు నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో ఎముకలు కొరికే చలిలో పోరాడుతున్న మహిళా రైతులకు సమున్నత గౌరవం లభించింది. ప్రముఖ ఆంగ్ల మాస పత్రిక టైం మ్యాగజైన్.. మార్చి నెల సంచిక కవర్ పేజీమీద మహిళా రైతుల ఫోటోతో పాటు ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఈ మేరకు శుక్రవారం ట్విట్టర్‌లో ఈ విషయాన్ని ప్రకటించింది.

‘నన్ను బెదిరించలేరు.. నన్ను కొనలేరు..’ అనే శీర్షికతో సాగే ఈ కథనాన్ని ఈ వారం ప్రత్యేక కథనంగా అందిస్తున్నారు. ఇందుకు గాను కవర్ పేజీ మీద పలు మహిళా రైతుల పోరాటానికి సంఘీభావం తెలుపుతున్న ఫోటోను ప్రచురించారు. ఫోటోలోని మహిళా రైతులలో ఒకరు ఓ చేత్తో చంటిబిడ్డను ఎత్తుకుని మరో చేత్తో ఉద్యమానికి జై కొడుతున్న దృశ్యం ఆకట్టుకుంటున్నది.

కొద్దిరోజులుగా సాగుతున్న రైతు వ్యతిరేక చట్టాల పోరులో పురుషులతో పాటు మహిళా రైతులు కూడా విరివిగా పాల్గొంటున్నారు. ఉద్యమంలోకి మీరు ఎందుకు వచ్చారని గతంలో ఒక విలేకరి ప్రశ్నించగా ఓ మహిళా రైతు స్పందిస్తూ.. ‘మేమెందుకు వెనక్కి వెళ్లాలి. ఇది మగవారి పోరాటం కాదు. మగవారితో సమానంగా మేము కూడా పంట పొలాల్లో పనులు చేస్తున్నాం. మేమెవరం..? రైతులం కాదా..?’ అని దిమ్మతిరిగే సమాధానమిచ్చింది.

ఇది కూడా చదవండి : ప్రతి యేటా మనమెంత ఆహారాన్ని వృథా చేస్తున్నామో తెలుసా..?

పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ నుంచి వందలాదిగా తరలివస్తున్న మహిళలు రైతు ఉద్యమంలో పాల్గొంటున్న విషయం తెలిసిందే. నూతన సాగు చట్టాలే కాకుండా పితృస్వామ్యం, స్త్రీహత్య, లైంగిక హింస, లింగ వివక్ష కు వ్యతిరేకంగా మహిళలు సాగిస్తున్న పోరు గురించి కూడా ఈ (టైం మ్యాగజైన్) కథనంలో పేర్కొంటున్నట్టు టైం తెలిపింది. కాగా ఈ నెల 8 న జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ‘మహిళా కిసాన్ దివాస్’గా జరపాలని రైతు సంఘాలు నిర్ణయించిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News