ఐపీఎల్‌లో ఆందోళన.. ఆ మూడు జట్ల కెప్టెన్లు ఎవరు..?

దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ 2022కి సంబంధించి ప్లేయర్ రిటెన్షన్ గడువు దగ్గర పడుతున్న కొద్దీ అన్ని ఫ్రాంచైజీల్లో ఆందోళన పెరిగింది. మరో రెండు రోజులే గడువు ఉండటంతో ఎవరెవరిని రిటైన్ చేసుకోవాలా అని జట్లన్నీ తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. అయితే గత సీజన్‌లో ఆడిన కొంత మంది కెప్టెన్లు వచ్చే సీజన్‌కు అందుబాటులో లేకుండా పోవడంతో ముఖ్యంగా మూడు జట్లు ఆటగాళ్లతో పాటు కెప్టెన్లను వెతకడంపై పూర్తిగా నిమగ్నమయ్యాయి. ఇప్పటి వరకు చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ […]

Update: 2021-11-27 08:55 GMT

దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ 2022కి సంబంధించి ప్లేయర్ రిటెన్షన్ గడువు దగ్గర పడుతున్న కొద్దీ అన్ని ఫ్రాంచైజీల్లో ఆందోళన పెరిగింది. మరో రెండు రోజులే గడువు ఉండటంతో ఎవరెవరిని రిటైన్ చేసుకోవాలా అని జట్లన్నీ తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. అయితే గత సీజన్‌లో ఆడిన కొంత మంది కెప్టెన్లు వచ్చే సీజన్‌కు అందుబాటులో లేకుండా పోవడంతో ముఖ్యంగా మూడు జట్లు ఆటగాళ్లతో పాటు కెప్టెన్లను వెతకడంపై పూర్తిగా నిమగ్నమయ్యాయి. ఇప్పటి వరకు చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రమే తమ కెప్టెన్లను రిటైన్ చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. పాత ఫ్రాంచైజీల్లో మూడింటికి మాత్రం పలు కారణాల వల్ల కెప్టెన్లు లేకుండా పోయారు. దీంతో ఈ రెండు రోజుల్లో కెప్టెన్లను వెతికే పనిలో ఆ ఫ్రాంచైజీలు పడ్డాయి. ప్రస్తుతం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు కెప్టెన్ల విషయంలో చర్చలు జరుపుతున్నాయి.

పంజాబ్ పరిస్థితి అగమ్యగోచరం..

ఐపీఎల్ 2021లో పేలవ ప్రదర్శన చేసిన పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ పరిస్థితి కీలకమైన మెగా ఆక్షన్ ముందు అగమ్యగోచరంగా తయారయ్యింది. రెండేళ్ల క్రితమే రవిచంద్రన్ అశ్విన్ జట్టు నుంచి వెళ్లిపోవడంతో కేఎల్ రాహుల్‌కు కెప్టెన్సీని కట్టబెట్టింది. 2020, 2021 సీజన్లలో కేఎల్ రాహుల్ జట్టును ప్లే ఆఫ్స్ చేర్చడంలో విఫలమయ్యాడు. కానీ అదే సమయంలో బ్యాటర్‌గా మాత్రం అద్భతంగా రాణించాడు. దీంతో అతడినే ఈ సీజన్‌కు రిటైన్ చేసుకోవాలని భావించింది. అయితే తాను పంజాబ్ జట్టుతో కొనసాగలేనని రాహుల్ స్పష్టం చేయడంతో పంజాబ్‌కు కెప్టెన్ లేకుండా పోయాడు. ఈ సారి పంజాబ్ కింగ్స్ ఎవరినీ రిటైన్ చేసుకోకూడదని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. మొత్తం రూ. 90 కోట్లు ఉపయోగించి కొత్త వాళ్లను కొనుగోలు చేయాలని భావిస్తున్నది. అవసరం అయితే వేలంలో డేవిడ్ వార్నర్, హార్దిక్ పాండ్యా, శిఖర్ ధావన్ వంటి వారిని కొనుగోలు చేస్తే వారిని కెప్టెన్లుగా కూడా కొనసాగించవచ్చని చూస్తున్నది. అయితే వీళ్లను ఏ జట్లు ఫ్రీ పిక్ చేసుకోకపోతేనే పంజాబ్‌కు దొరుకుతారు.

కేకేఆర్‌ది మరో సమస్య..

కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టును కూడా కెప్టెన్ సమస్య వేధిస్తున్నది. ఆ జట్టుకు ప్రస్తుతం ఇయాన్ మోర్గాన్ కెప్టెన్‌గా ఉన్నాడు. గత సీజన్‌లో కేకేఆర్‌ను ఫైనల్ వరకు తీసుకెళ్లగలిగాడు. కానీ ఆఖరి మెట్టుపై చెన్నయ్ సూపర్ కింగ్స్ చేతిలో పరాభవం తప్పలేదు. జట్టును నడిపించడంలో మోర్గాన్ సఫలం అయ్యాడు. కానీ ఒక బ్యాటర్‌గా మాత్రం పూర్తిగా విఫలం అయ్యాడు. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఈ సీజన్‌లో 17 మ్యాచ్‌లు ఆడి కేవలం 133 పరుగులే చేశాడు. అందులో ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు. ఐపీఎల్ 2021 సీజన్‌లో అతడి అత్యధిక స్కోర్ 47 పరుగులు మాత్రమే. దీంతో అతడిని రిటైన్ చేసుకోవడానికి కేకేఆర్ ఆసక్తి చూపించడం లేదు. విదేశీ కోటాలో సునీల్ నరైన్ లేదా ఆండ్రీ రస్సెల్‌ను తీసుకోవాలని భావిస్తున్నది. ఒక వేళ పాట్ కమిన్స్ అందుబాటులో ఉంటానంటే అతడిని రిటైన్ చేసుకొని కెప్టెన్సీ కట్టబెట్టే అవకాశం కూడా ఉన్నది. అయితే వైట్ బాల్ క్రికెట్‌పై కమిన్స్ పెద్దగా ఆసక్తి చూపించడం లేదని సమాచారం.

కోహ్లీ వీడ్కోలుతో..

విరాట్ కోహ్లీ టీమ్ ఇండియా టీ20 కెప్టెన్సీతో పాటే ఆర్సీబీ కెప్టెన్సీని కూడా వదిలేశాడు. దీంతో ఇప్పుడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కోహ్లీని రిటైన్ చేసుకున్నప్పటికీ, మరొక కెప్టెన్ మెటీరియల్ క్రికెటర్‌ను వెతికి పట్టుకోవలసి ఉన్నది. డేవిడ్ వార్నర్, సూర్యకుమార్ యాదవ్‌లలో ఒకరిని తీసుకోవాలని ఆర్సీబీ భావించింది. అయితే సూర్యకుమార్ యాదవ్‌తో కొత్త జట్టు లక్నో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తున్నది. మరోవైపు కోహ్లీతో పాటు మ్యాక్స్‌వెల్, దేవ్‌దత్ పడిక్కల్‌లు రిటెన్షల్ లిస్టులో ఉన్నారు. మ్యాక్సీ కెప్టెన్సీ చేసే ఉద్దేశం లేదని ప్రకటించాడు. దీంతో ఆర్సీబీ జట్టు తప్పని సరిగా ఒక కెప్టెన్‌ను వెదకాల్సి ఉన్నది. వేలంలో వార్నర్‌ను కొంటే అతడికే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించవచ్చని తెలుస్తున్నది.

Tags:    

Similar News