పోలీసుల న్యూ ప్లాన్.. 10 తర్వాత బయటకు వచ్చిన వారిని ఐసోలేషన్‌కు తరలింపు

దిశ, పెద్దపల్లి : కరోనాను కట్టడి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ రోడ్లపై తిరుగుతున్న వారి భరతం పట్టడం మొదలు పెట్టారు రామగుండం కమిషనరేట్ పోలీసులు. ఉదయం 10 గంటల తరువాత రోడ్లపైకి రావద్దంటూ చెప్తున్నా వినకుండా ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతున్న వారి సంఖ్య బాగా పెరిగింది. ఈ క్రమంలో వాహనాలు సీజ్ చేసి కేసులు నమోదు చేస్తున్నా.. చాలా మందిలో మార్పు రావడం లేదు. దీంతో రామగుండం పోలీసులు సరికొత్త పంథా […]

Update: 2021-05-27 02:15 GMT

దిశ, పెద్దపల్లి : కరోనాను కట్టడి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ రోడ్లపై తిరుగుతున్న వారి భరతం పట్టడం మొదలు పెట్టారు రామగుండం కమిషనరేట్ పోలీసులు. ఉదయం 10 గంటల తరువాత రోడ్లపైకి రావద్దంటూ చెప్తున్నా వినకుండా ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతున్న వారి సంఖ్య బాగా పెరిగింది. ఈ క్రమంలో వాహనాలు సీజ్ చేసి కేసులు నమోదు చేస్తున్నా.. చాలా మందిలో మార్పు రావడం లేదు. దీంతో రామగుండం పోలీసులు సరికొత్త పంథా ఎంచుకున్నారు. కరోనా సోకుతుందని చెప్పినా వినిపించుకోకుండా ఇష్టం వచ్చినట్టు రోడ్లపై తిరుగుతున్న వారికి సరైన గుణపాఠం చెప్పాలని నిర్ణయించారు.

గురువారం ఉదయం 10 గంటల తరువాత రోడ్లపైకి వచ్చిన వారిని పట్టుకుని.. కరోనా బాధితులకు కేటాయించిన ఐసోలేషన్ సెంటర్‌కు తరలిస్తున్నారు. అసవసరంగా బయట తిరుగుతున్న వారందరిని నేరుగా ఐసోలేషన్ కేంద్రానికి పంపిస్తున్నారు. వద్దు సార్.. అని వేడుకుంటున్నా వినకుండా పోలీసులు బలవంతంగా ఓ వ్యాన్‌లో ఎక్కించి మరీ ఆకతాయిలను సుల్తానాబాద్‌కు షిప్ట్ చేస్తున్నారు. ఎంత చెప్పినా వినకపోవడంతో విసుగెత్తిన పోలీసు అధికారులు లాక్‌డౌన్ రూల్స్ బ్రేక్ చేస్తున్న వారిని డైరెక్ట్‌గా కరోనా పీడితుల కోసం ఏర్పాటు చేసిన ఐసోలేషన్ సెంటర్‌కు తరలించారు.

రోడ్లపై తిరిగితే వ్యాధి సోకే ప్రమాదం ఉందని హెచ్చరించినా పట్టించుకోని వారికి.. కరోనా సోకినా ఏమీ కాదన్న.. అతి నమ్మకం ఫలితం ఎలా ఉంటుందో రుచి చూపించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. ఇప్పటికైనా లాక్‌డౌన్ నిబంధనలకు విరుద్దంగా.. అనవరంగా రోడ్లపై తిరిగే వారంతా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. పని లేకుండా బయటకు వస్తే.. మీకూ ఇలాంటి పరిస్థితే ఎదురవుతుంది తస్మాత్ జాగ్రత్త అంటున్నారు రామగుండం పోలీసులు. 

Tags:    

Similar News