గ్రేటర్‌లో ప్రైవేటు ఆస్పత్రుల ఇష్టారాజ్యం
గ్రేటర్‌లోని పలు ప్రైవేటు ఆస్పత్రులు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి ఎలాంటి అనుమతి తీసుకుండా పడకలు పెంచుకుంటున్నట్లు తెలుస్తోంది. 40లోపు పడకలకు మాత్రమే అనుమతి తీసుకొని 100 పడకలకుపైగా నిర్వహిస్తున్నట్లు సమాచారం. తనిఖీ చేసి చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చేతివాటం ప్రదర్శిస్తుండడంతో ఆ ఆస్పత్రులు ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారిందనే విమర్శలున్నాయి. దిశ, తెలంగాణ బ్యూరో: గ్రేటర్‌లో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు 1500 పైగా ఉన్నాయి. ఇందులో 350 ప్రైవేటు ఆస్పతులు పడకల పెంపునకు పీసీబీ […]
గ్రేటర్‌లోని పలు ప్రైవేటు ఆస్పత్రులు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి ఎలాంటి అనుమతి తీసుకుండా పడకలు పెంచుకుంటున్నట్లు తెలుస్తోంది. 40లోపు పడకలకు మాత్రమే అనుమతి తీసుకొని 100 పడకలకుపైగా నిర్వహిస్తున్నట్లు సమాచారం. తనిఖీ చేసి చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చేతివాటం ప్రదర్శిస్తుండడంతో ఆ ఆస్పత్రులు ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారిందనే విమర్శలున్నాయి.
దిశ, తెలంగాణ బ్యూరో: గ్రేటర్‌లో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు 1500 పైగా ఉన్నాయి. ఇందులో 350 ప్రైవేటు ఆస్పతులు పడకల పెంపునకు పీసీబీ నుంచి అనుమతి తీసుకోలేదు. ఏ ఆసుపత్రి అయినా ప్రారంభించేటప్పుడు ఎన్ని పడకలతో నిర్మిస్తున్నారనేది అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అనుమతి తీసుకున్న తర్వాత పెంచాలనుకుంటే తిరిగి దరఖాస్తు చేసుకోవాలి. కానీ అందుకు విరుద్ధంగా నకిలీ పత్రాలను సృష్టించి ఆస్పత్రులను నడుపుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.
నామమాత్రపు చర్యలే
ప్రైవేటు ఆస్పత్రులు నిబంధనల మేరకు ఏర్పాటు చేశారా? లేదా? అనే విషయమై పీసీబీ ఎన్విరాన్ మెంటల్ అధికారులు పర్యవేక్షణ చేయాలి. కానీ, అలాంటివేమీ చేయకుండా అధికారులు కార్యాలయాలకే పరిమితం అవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతినెలా మామూళ్లు ముడుతుండడంతో వారి తీరు చూసీచూడనట్లుగా ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. ఇటీవల నగరంలో జరిగిన ఒక తతంగాన్ని పరిశీలిస్తే.. యూసుఫ్‌గూడలోని ఒక నర్సింగ్ హోం మొదటగా 23 పడకలు ఉన్నాయని, తమ వద్ద వెలువడేబోయే మెడికల్ వ్యర్థాల నిర్వహణకు నిర్దేశిత ప్రమాణాలకు లోబడి చేపడతామని దరఖాస్తు చేసుకొని 2017లో పీసీబీ అనుమతి పొందింది. ఈ అనుమతులు 2024 వరకు కొనసాగుతాయని పీసీబీ అధికారులకు తెలిపింది.
ఇదిలా ఉండగా రెండేళ్లుగా దవాఖానా సామర్థ్యాన్ని 23 పడకల నుంచి 43, ఆ తర్వాత 105 పడకలకు పెంచి అనుమతి తీసుకోలేదు. దవాఖానాలో సామర్థ్యానికి మించిన బెడ్లు ఉన్నాయని, వ్యర్థాల నిర్వాహణ సరిగా లేదంటూ కాలుష్య నియంత్రణ మండలికి ఫిర్యాదు అందడంతో అధికారులు దవాఖానాపై దాడులు నిర్వహించారు. బోగస్ పత్రాలు సృష్టించి ఆస్పత్రి నడిపిస్తున్నట్లు తేలడంతో అధికారులు దానిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ దవాఖానాపై ఐపీసీ 406, 420, 468, 471 కేసులు నమోదయ్యాయి. ఇక అంతటితో అధికారులు చేతులు దులుపేసుకున్నారని, ఇంకా నిబంధనలు పాటించని దవాఖానాలు చాలా ఉన్నాయని, కానీ అధికారులు మాత్రం తనిఖీలు నామమాత్రంగా చేసి వదిలేస్తున్నారనే విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి. ఇప్పటికైనా పీసీబీ అధికారులు స్పందించి నిబంధనలు అతిక్రమించే దవాఖానాలపై తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
అనుమతి తప్పనిసరి
ఏ ఆస్పత్రి అయినా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. కొన్ని ప్రవేటు హాస్పిటళ్లు ప్రారంభించేటప్పుడు తక్కువ పడకలకు అనుమతి తీసుకుని, అనంతరం ఎక్కువ పడకలు ఏర్పాటు చేస్తున్నాయి. అలాంటి ఆస్పత్రులపై ప్రత్యేక నిఘా పెట్టాం. అందులో భాగంగానే యూసుఫ్‌గూడలోని ఒక ప్రైవేట్ ఆప్పత్రిపై చర్యలు తీసుకున్నాం. దానిపై ఐపీసీ 406, 420, 468, 471 కేసులు కూడా నమోదయ్యాయి. రూల్స్ పాటించని ప్రతి ఆస్పత్రి పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. – కాలుష్య నియంత్రణ మండలి అధికారి