గ్లోబల్ టెండర్లకు స్పందన లేదు.. ఆశలన్నీ ’స్పుత్నిక్-వి’ పైనే
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో అర్హులైనవారందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్ టెండర్లకు ఆహ్వానం పలికినా పెద్దగా స్పందన రాలేదు. కేవలం రెండు అంతర్జాతీయ కంపెనీలు మాత్రమే ఆసక్తి చూపాయి. సీరం, భారత్ బయోటెక్ లాంటి సంస్థలేవీ దరఖాస్తు చేయలేదు. ఆస్ట్రాజెనికా, స్పుత్నిక్ కంపెనీలు మాత్రమే టెండర్ డాక్యుమెంట్లను సమర్పించాయి. ప్రీ-బిడ్డింగ్ సమావేశానికి కూడా ఈ రెండు మినహా మరే సంస్థలూ హాజరుకాలేదు. రాష్ట్రాలకు నేరుగా టీకాలను పంపిణీ చేయలేమంటూ పంజాబ్ ప్రభుత్వానికి […]
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో అర్హులైనవారందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్ టెండర్లకు ఆహ్వానం పలికినా పెద్దగా స్పందన రాలేదు. కేవలం రెండు అంతర్జాతీయ కంపెనీలు మాత్రమే ఆసక్తి చూపాయి. సీరం, భారత్ బయోటెక్ లాంటి సంస్థలేవీ దరఖాస్తు చేయలేదు. ఆస్ట్రాజెనికా, స్పుత్నిక్ కంపెనీలు మాత్రమే టెండర్ డాక్యుమెంట్లను సమర్పించాయి. ప్రీ-బిడ్డింగ్ సమావేశానికి కూడా ఈ రెండు మినహా మరే సంస్థలూ హాజరుకాలేదు. రాష్ట్రాలకు నేరుగా టీకాలను పంపిణీ చేయలేమంటూ పంజాబ్ ప్రభుత్వానికి ఇప్పటికే స్పష్టం చేసిన ఆస్ట్రాజెనికా ఇప్పుడు తెలంగాణ విషయంలో అందుకు భిన్నమైన వైఖరి తీసుకుంటుందా అనే అనుమానం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారుల్లో తలెత్తింది. దీంతో ఇక మిగిలింది స్పుత్నిక్ కాబట్టి ఆశలన్నీ ఆ సంస్థ పైనే పెట్టుకుంది. జూన్ 4వ తేదీ వరకూ టెండర్లను దాఖలు చేసుకునే అవకాశం ఉన్నందున కొత్త సంస్థలు ఏ మేరకు వస్తాయనేది ఆసక్తికరంగా మారింది.
రాష్ట్రంలో 18-44 ఏజ్ గ్రూపువారికి కరోనా వ్యాక్సిన్లను ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం విదేశాల నుంచి టీకాలను సమకూర్చుకోక తప్పదనే అభిప్రాయానికి వచ్చి ఇటీవల గ్లోబల్ టెండర్లను ఆహ్వానించింది. నెలకు సగటున కనీసంగా 15 లక్షల డోసులను అందించే విధంగా షరతు విధించింది. ఆరు నెలల్లో మొత్తం కోటి డోసులను సరఫరా చేయాలని స్పష్టం చేసింది. భారత్ బయోటెక్, సీరం ఇన్‌స్టిట్యూట్ లాంటి సంస్థలను అప్పటికే సంప్రదించిన తెలంగాణ ప్రభుత్వం ప్రజలందరి అవసరాలకు తగినంతగా సరఫరా చేయాలని రిక్వెస్టు పెట్టింది. కానీ ఆశించిన స్థాయిలో కోట్ల సంఖ్యలో డోసులను సరఫరా చేయడంలో ఉన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఇకపైన అంతర్జాతీయ సంస్థల నుంచి సమకూర్చుకోవడం మినహా మరో మార్గం లేదని భావించి గ్లోబల్ టెండర్ల నిర్ణయం తీసుకుంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ లేదా ఎఫ్‌డీఏ ఆమోదం పొందిన టీకాలను రాష్ట్రాలు నేరుగా దిగుమతి చేసుకోవచ్చంటూ కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు ఇవ్వడంతో చాలా రాష్ట్రాలు గ్లోబల్ టెండర్ల బాట పట్టాయి. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ సైతం ఇప్పటికే గ్లోబల్ టెండర్ల నోటిఫికేషన్‌ను ఇచ్చింది. పంజాబ్ ప్రభుత్వం సైతం అదే తీరులో గ్లోబల్ టెండర్ల బాట పట్టినా ఆస్ట్రాజెనికా సంస్థ మాత్రం నేరుగా రాష్ట్రాలకు టీకాలను పంపిణీ చేయలేమని, కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఇవ్వగలమని స్పష్టం చేసింది. దీంతో పంజాబ్ ప్రభుత్వానికి తన అవసరాల నిమిత్తం టీకాలను సమకూర్చుకోవడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి.
ఇప్పుడు అదే ఆస్ట్రా జెనికా సంస్థ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన గ్లోబల్ టెండర్ నోటిఫికేషన్ ప్రకారం ముందుకొచ్చింది. కానీ రాష్ట్రానికి అవసరమైన విధంగా కోటి డోసులను సరఫరా చేస్తుందా లేదా అనేది తేలాల్సి ఉంది. ఒకవేళ పంజాబ్ రాష్ట్రం విషయంలో నిస్సహాయతను వ్యక్తం చేసినట్లుగానే తెలంగాణ విషయంలోనూ వ్యవహరిస్తే ఇక రాష్ట్ర ప్రభుత్వం కేవలం స్పుత్నిక్ వ్యాక్సిన్ మీద మాత్రమే ఆధార పడాల్సి ఉంటుంది. భారత్‌లో స్పుత్నిక్-వి వ్యాక్సిన్ విక్రయాలు, సరఫరాను రెడ్డీస్ లాబ్ చూసుకుంటోంది. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న రెడ్డీస్ లాబ్ తెలంగాణ విషయంలో కాస్త చొరవ తీసుకుని కోటి డోసులను ఆరు నెలల్లో సరఫరా చేయగలుగుతుందేమో వేచి చూడాలి.
ప్రస్తుతం ప్రైవేటు మార్కెట్ కోసం ఒక్కో డోసు టీకా ధరను రూ. 995గా ఫిక్స్ చేసిన రెడ్డీస్ లాబ్ రాష్ట్ర ప్రభుత్వానికి తక్కువ ధరలో సరఫరా చేసే అవకాశం ఉంది. ఈ ధర ప్రకారమే సరఫరా చేసినా కోటి డోసులకు రూ. 995 కోట్ల మేర ఖర్చు కానుంది. వ్యాక్సిన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం సుమారు 2,500 కోట్ల మేర ఖర్చు కానున్నదని అంచనా వేసి ఆ మేరకు సర్దుబాటు చేయాలనే నిర్ణయానికి వచ్చింది. రాష్ట్రంలో సుమారు మూడు కోట్ల మందికి టీకాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని భావించినా 45 ఏళ్ళు పైబడినవారికి కేంద్ర ప్రభుత్వమే ఉచితంగా సరఫరా చేస్తున్నందున 18-44 ఏజ్ గ్రూపువారికి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం స్వంతంగా టీకాలను సమకూర్చుకోవాలనుకుంటోంది. సుమారు 1.72 కోట్ల మంది ఉంటారని అంచనా వేసినా అందుకు అవసరమైన మూడున్నర కోట్ల డోసుల్లో తొలుత కోటి డోసులను సమీకరించుకుని ఆ తర్వాత మిగిలినవాటికి ఇంకో టెండర్ నోటిఫికేషన్ ఇవ్వాలనుకుంటోంది.
జూన్ 4వ తేదీ నాటికి టెండర్ డాక్యుమెంట్ల సమర్పణ గడువు ముగుస్తుంది కాబట్టి ఎన్ని సంస్థలు ఆసక్తితో ఉన్నాయి, వాటిలో ఏది తక్కువ ధరను కోట్ చేసింది, ఎన్ని డోసులను సరఫరా చేయడానికి సిద్ధపడుతోంది… ఇలాంటి అంశాలన్నింటిపై అదే రోజు రాత్రికి స్పష్టత రానుంది. అన్నింటికంటే తక్కువ ధరను కోట్ చేసిన సంస్థ ఒకవేళ కోటి డోసులను సరఫరా చేయగలిగే సామర్థ్యం ఉంటే మొత్తం వెసులుబాటును ఆ సంస్థకే ఇవ్వాలని, ఒకవేళ సరఫరా చేయలేని పక్షంలో దాని తర్వాతి స్థానంలో అర్హత సాధించి (ఎల్-2) సంస్థకు 40% మేర డోసులను సరఫరా చేసేలా అవకాశం ఇవ్వనుంది.