TDP : రాజకీయాల్లో శాశ్వత శత్రువులుండరు- గోరంట్ల
దిశ, ఏపీ బ్యూరో: తెలుగుదేశం పార్టీ కీలక నేత, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజీనామా వ్యవహారం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రాజీనామా చేసేస్తానంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు తాను చంద్రబాబును కలిసేదే లేదని తెగేసి చెప్పారు. అంతే మూడు రోజులుపోయాక చంద్రబాబుతో ఆయన భేటీ అయ్యారు. బాస్ మాటే వేదం అంటూ బయటకు వచ్చేశారు. టీడీపీకి రాజీనామా చేసేది లేదని తెగేసి చెప్పిన సంగతి తెలిసిందే. చంద్రబాబు బుజ్జగింపులతో […]
దిశ, ఏపీ బ్యూరో: తెలుగుదేశం పార్టీ కీలక నేత, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజీనామా వ్యవహారం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రాజీనామా చేసేస్తానంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు తాను చంద్రబాబును కలిసేదే లేదని తెగేసి చెప్పారు. అంతే మూడు రోజులుపోయాక చంద్రబాబుతో ఆయన భేటీ అయ్యారు. బాస్ మాటే వేదం అంటూ బయటకు వచ్చేశారు. టీడీపీకి రాజీనామా చేసేది లేదని తెగేసి చెప్పిన సంగతి తెలిసిందే. చంద్రబాబు బుజ్జగింపులతో అలకపాన్పు వీడిన బుచ్చయ్య చౌదరి వైసీపీపై తీవ్ర విమర్శలకు దిగారు.
రాజమహేంద్రవరంలోని తన నివాసంలో శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన, జగన్ సర్కార్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రజలను భ్రమల్లో ఉంచుతూ జగన్ పాలన కొనసాగిస్తున్నారంటూ సెటైర్లు వేశారు. రాష్ట్రానికి ఇప్పటివరకు ఎన్ని పెట్టుబడులు తెచ్చారు? ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. మీరు ఇచ్చిన వాలంటరీ ఉద్యోగం ఎలాగూ సేవ కాబట్టి వాటికి మినహాయింపు ఇచ్చి, అవి కాకుండా ఇంకా వేరే ఉద్యోగాలు ఎంత మందికి ఇచ్చారు? ఎన్నాళ్లు భ్రమల్లో ఉంచుతారు? అంటూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి నిలదీశారు.
అంతేకాదు పెన్షన్ లబ్ధిదారులకు జగన్ ప్రభుత్వం చుక్కలు చూపిస్తోందన్నారు. లక్షలాది మంది బడుగు, బలహీన వర్గాల పింఛన్లు తొలగిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ఒకే రేషన్ కార్డ్.. ఒకే పెన్షన్ విధానంతో వృద్ధులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆరోపించారు. ఒక నెల పెన్షన్ తీసుకోక పోతే మరుసటి నెల పెన్షన్ రాదనే కొత్త నిబంధన సరికాదన్నారు. వృద్ధుల కి పెంచుతానన్న పెన్షన్ ఎలాగూ పెంచరు.. కనీసం ఇచ్చేది అయిన సరిగ్గా ఇవ్వాలంటూ బుచ్చయ్య చౌదరి హితవు పలికారు.
ప్రతిపక్ష నేతగా జగన్ చేసిన తప్పుడు ప్రచారం వల్లే పోలవరం అంచనాలు రూ. 55 వేల కోట్లకు కేంద్రం అంగీకరించలేదని ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచారంలో పోలవరం నిర్వాసితుల ఇళ్లకు 25 రకాల సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన జగన్ కనీసం రెండు సౌకర్యాలు కూడా కల్పించలేదని విమర్శించారు. కష్టకాలంలో విద్యుత్ చార్జీలు పెంచి ప్రజల నడ్డివిరుస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న ప్రతిపక్షాలపై పోలీసులు తప్పుడు కేసులు పెట్టడం మానుకోవాలని లేని పక్షంలో మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
ఎలాయితే అఫ్ఘానిస్తాన్‌లో తాలిబన్లు అరచకాన్నీ సృష్టించి, హింసని ప్రేరేపించి, దుర్బుద్ధితో నాశనానికి ఒడిగట్టారో.. అదే పంథాలో మన రాష్ట్రంలో వైసీపీ వాళ్ళు కూడా కులాల కుంపట్లు రాజేసి.. కుయుక్తులతో, ప్రతీకారెచ్ఛతో రాష్ట్రాన్ని అధోగతిపాల్జేస్తున్నారంటూ బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు.
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు
తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న లోటుపాట్లను చంద్రబాబుకు లిఖితపూర్వకంగా తెలియజేసినట్లు బుచ్చయ్య చౌదరి తెలిపారు. ఇతర ప్రతిపక్షాలను కూడా కలుపుకోవాలని చంద్రబాబుకు సూచించినట్లు వెల్లడించారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరని.. అందరితో కలిసి ముందుకు వెళ్లాలని చంద్రబాబు సూచించారని పేర్కొన్నారు. భవిష్యత్‌లో పార్టీ చేపట్టబోయే కార్యక్రమాలపై కూడా చర్చించినట్లు తెలియజేశారు. కార్యకర్తల మనోభావాలను గుర్తించాలని, పార్టీలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని దానిపై తన అభిప్రాయాలను తెలియజేసినట్లు చెప్పుకొచ్చారు.
తన గౌరవానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని చంద్రబాబు హామీ ఇవ్వడంతో రాజీనామా నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లు చెప్పుకొచ్చారు. పార్టీలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా రాజకీయాల నుంచి తప్పుకోవాలనుకున్నానని అయితే మిత్రులు, అభిమానులు రాజీనామా చేయొద్దని కోరినట్లు తెలిపారు. 40 ఏళ్లుగా పార్టీలో కొనసాగుతున్నానని.. బతికి ఉన్నంతకాలం పార్టీకి సేవ చేస్తానని బుచ్చయ్య చౌదరి హామీ ఇచ్చారు.