వ్యాక్సిన్ ఇప్పట్లో కష్టమే!
దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా వ్యాప్తిని అరికట్టాలంటే వీలైనంత ఎక్కువ మందికి వ్యాక్సిన్ ఇవ్వడమే ఉత్తమమైన మార్గమని వైద్య నిపుణులు, తెలంగాణ ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ చెబుతున్నారు. కానీ అంతటి విస్తృత జనాభాకు వ్యాక్సిన్ ఇవ్వడానికి తగిన ఉత్పత్తి, నిల్వలు లేదు. ఇదే ఇప్పుడు రాష్ట్రాలను పీడిస్తున్న సమస్య. దేశంలో 18-44 ఏళ్ళ మధ్య వయస్కులకు మే నెల 1వ తేదీ నుంచి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో వ్యాక్సిన్ తీసుకునే వెసులుబాటు ఉన్నట్లు ప్రకటించారు. కానీ […]
దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా వ్యాప్తిని అరికట్టాలంటే వీలైనంత ఎక్కువ మందికి వ్యాక్సిన్ ఇవ్వడమే ఉత్తమమైన మార్గమని వైద్య నిపుణులు, తెలంగాణ ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ చెబుతున్నారు. కానీ అంతటి విస్తృత జనాభాకు వ్యాక్సిన్ ఇవ్వడానికి తగిన ఉత్పత్తి, నిల్వలు లేదు. ఇదే ఇప్పుడు రాష్ట్రాలను పీడిస్తున్న సమస్య. దేశంలో 18-44 ఏళ్ళ మధ్య వయస్కులకు మే నెల 1వ తేదీ నుంచి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో వ్యాక్సిన్ తీసుకునే వెసులుబాటు ఉన్నట్లు ప్రకటించారు. కానీ తెలంగాణలో తగినన్ని వ్యాక్సిన్ నిల్వలు లేకపోవడంతో ఇప్పటికీ ఆ కార్యక్రమం ప్రారంభం కాలేదు. ఎప్పటికి ప్రారంభం అవుతుందో కూడా చెప్పలేమని ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వ్యాఖ్యానించారు.
సెకండ్ ఫేజ్ (45 ఏళ్ళ పైబడిన వయస్కులకు ఇవ్వాల్సిన) వ్యాక్సినేషన్ కోసం కేంద్ర ప్రభుత్వాన్ని 30 లక్షల డోసులు అడిగితే కేవలం నాలుగున్నర లక్షల డోసులు మాత్రమే వచ్చాయని తెలిపారు. 18-44 ఏజ్ గ్రూపులో ఉన్న 1.75 కోట్ల మందికి మొత్తం మూడున్నర కోట్ల డోసులు అడిగితే 3.90 లక్షల డోసులు మాత్రమే మంజూరైనట్లు వివరించారు. వ్యాక్సిన్ కేటాయింపులు కేంద్రం పరిధిలో ఉన్నందున రాష్ట్రాలు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాయన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి ఒక రోజుకు గరిష్టంగా ఏడు లక్షల డోసుల్ని పంపిణీ చేసే సామర్థ్యం ఉన్నదని, కేంద్రం నుంచి వచ్చే కోటా కేవలం ఒక్క పూటకే సరిపోతుందన్నారు. అవసరాలకు తగినన్ని నిల్వలు లేకుండా 18-44 ఏజ్ గ్రూపువారికి వ్యాక్సినేషన్ ఇచ్చే ప్రక్రియను మొదలుపెట్టలేమన్నారు.
వ్యాక్సిన్ తయారీ సంస్థలతో సంప్రదింపులు జరుగుతున్నాయని, తెలంగాణ విజ్ఞప్తి మేరకు ఎన్ని డోసులు అందుతాయో ఇంకా స్పష్టత రాలేదన్నారు. ముఖ్యమంత్రి త్వరలో దీనిపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారని, ఆ తర్వాతనే క్లారిటీ వస్తుందన్నారు. అప్పటిదాకా నిర్దిష్ట తేదీ నుంచి వ్యాక్సినేషన్ ఇస్తామనే అంశాన్ని చెప్పలేమన్నారు. ప్రస్తుతం కేంద్రం 45 ప్లస్ ఏజ్ గ్రూపువారికి ఇచ్చిన కోటా ప్రకారం అందుబాటులో ఉన్న డోసులను ఇస్తున్నామని వివరించారు. పరిమితంగా ఉన్నందున స్పాట్ రిజిస్ట్రేషన్లను నిలిపివేసి కేవలం అడ్వాన్సుగా ‘కొవిన్‘ పోర్టల్‌లో స్లాట్ రిజిస్టర్ చేసుకున్నవారికి మాత్రమే ఇస్తున్నట్లు తెలిపారు. వ్యాక్సిన్లు సమృద్ధిగా దొరికేంత వరకు ఇలాంటి పరిమితులు, ఆంక్షలు, నిబంధనలు తప్పవన్నారు.