టార్గెట్ రేవంత్..

గ్రేటర్ ఎన్నికల్లో ‘ఆపరేషన్​ఆర్’ ​ప్రారంభమైంది. మల్కాజిగిరి పార్లమెంట్​స్థానంపై నేతలంతా గురి పెట్టారు. ఇప్పుడు ఇక్కడి 50 స్థానాలే పార్టీలకు టార్గెట్‌గా మారాయి. ఇక్కడ రేవంత్‌రెడ్డిని బలహీనపరిస్తే తర్వాత రాజకీయాల్లో దూకుడు తగ్గుతుందని టీఆర్ఎస్, బీజేపీ చూస్తున్నాయి. దీనికోసం ఆపరేషన్ ఆర్​పేరుతో కేటీఆర్ స్పెషల్​టీం మల్కాజిగిరిలో పాగా వేస్తోంది. ఆయన సన్నిహిత ఎమ్మెల్సీలు, సోషల్ మీడియా బృందం, మొన్నటిదాకా గ్రేటర్ సర్వేలు చేసిన బృందాలు మొత్తం మల్కాజిగిరిపైనే ఫోకస్ పెట్టాయి. దిశ, తెలంగాణ బ్యూరో: మల్కాజిగిరి డివిజన్లలో స్వతంత్రులుగా […]

Update: 2020-11-22 02:03 GMT

గ్రేటర్ ఎన్నికల్లో ‘ఆపరేషన్​ఆర్’ ​ప్రారంభమైంది. మల్కాజిగిరి పార్లమెంట్​స్థానంపై నేతలంతా గురి పెట్టారు. ఇప్పుడు ఇక్కడి 50 స్థానాలే పార్టీలకు టార్గెట్‌గా మారాయి. ఇక్కడ రేవంత్‌రెడ్డిని బలహీనపరిస్తే తర్వాత రాజకీయాల్లో దూకుడు తగ్గుతుందని టీఆర్ఎస్, బీజేపీ చూస్తున్నాయి. దీనికోసం ఆపరేషన్ ఆర్​పేరుతో కేటీఆర్ స్పెషల్​టీం మల్కాజిగిరిలో పాగా వేస్తోంది. ఆయన సన్నిహిత ఎమ్మెల్సీలు, సోషల్ మీడియా బృందం, మొన్నటిదాకా గ్రేటర్ సర్వేలు చేసిన బృందాలు మొత్తం మల్కాజిగిరిపైనే ఫోకస్ పెట్టాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: మల్కాజిగిరి డివిజన్లలో స్వతంత్రులుగా బరిలో నిలిచిన వారు పోటీలో ఉండాలని, లేకుంటే తప్పుకుని టీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా ఉండాలంటూ సంప్రదింపులు చేస్తున్నారు. పోటీలో ఉంటే స్వతంత్రుల ఖర్చు మొత్తం అధికార పార్టీనే చూసుకుంటుందని, తప్పుకుని మద్దతిస్తే నజరానాలు ఉంటాయని ఆశ చూపుతున్నారు. మరోవైపు బీజేపీ కూడా అదే పంథాలో ఉంది. ఇటీవల దుబ్బాకలో ఎమ్మెల్యేగా గెలిచిన రఘునందన్‌రావుకు మల్కాజిగిరి పార్లమెంట్ స్థానాన్ని అప్పగించారు. ఫైర్​బ్రాండ్‌గా పేరొందిన రఘునందన్‌రావు, ఎంపీ అరవింద్‌లు అక్కడే మకాం వేస్తున్నారు. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ కాంగ్రెస్ నేతలకు గాలం వేస్తుంటే రేవంత్‌రెడ్డి ప్రధానంగా అడ్డు తగులుతున్నారు. దీంతో కమలదళం రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహించే మల్కాజిగిరి సెగ్మెంట్‌లో కాంగ్రెస్​నేతల గెలుపును అడ్డుకోవాలని చూస్తోంది.

వాస్తవంగా రేవంత్‌రెడ్డి ఇక్కడ తన వర్గీయులు టికెట్లు ఇప్పించుకోవడంలో సఫలమయ్యారు. అయితే ఇది మింగుడుపడని కొంతమంది కాంగ్రెస్ నేతలు కూడా కొందరిని స్వతంత్రులుగా బరిలోకి దింపుతున్నారు. వారితో నామినేషన్లు వేయించారు. వీరిలో కొంతమందిని రేవంత్‌రెడ్డి బుజ్జగించి పోటీ నుంచి తప్పిస్తున్నారు. మరికొంత మంది మాత్రం తమ నేతల మాట ప్రకారమే పోటీలో ఉంటున్నారు. కచ్చితంగా 30 స్థానాల్లో గెలిచే అవకాశాలున్నాయని రేవంత్​బృందం అంచనా వేస్తోంది. ఇప్పటికే నాలుగైదు దఫాలుగా రేవంత్‌రెడ్డి వర్గం సర్వేలు నిర్వహించి టికెట్లు ఖరారు చేసుకుంది. మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో మొత్తం 49 స్థానాలు పూర్తిగా, ఒక వార్డు సగ భాగం ఉంది. ఈ స్థానాల్లో కాంగ్రెస్ నుంచి నిలబడిన వారిని గెలిపించుకోవాలని రేవంత్ వర్గం తీవ్రంగానే ప్రయత్నాలు చేస్తోంది. తనతో పార్టీలోకి వచ్చిన పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు, ములుగు ఎమ్మెల్యే సీతక్క వంటి నేతలను అక్కడే ప్రచారానికి తిప్పుతున్నారు.

టీఆర్ఎస్​ప్రలోభాల బృందం

ఈసారి గ్రేటర్​ఎన్నికల్లో మల్కాజిగిరి పార్లమెంట్ సెగ్మెంట్ వార్డుల్లో ప్రలోభాల బృందం దిగింది. మంత్రి కేటీఆర్‌కు సన్నిహితంగా ఉండే ఓ ఎమ్మెల్సీ ఈ బృందానికి నాయకత్వం వహిస్తున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ రెబెల్స్, స్వతంత్రులపై ఈ బృందం దృష్టి పెట్టింది. కాంగ్రెస్​పార్టీ నుంచి బరిలో ఉన్న వారు గెలువకుండా ఉండేందుకు స్వతంత్రులను పోటీలో ఉంచడంతో పాటు పార్టీలో ద్వితీయ శ్రేణి నేతలను తమవైపు తిప్పుకోవడం కోసం ఈ టీం పని చేస్తోంది. కాంగ్రెస్‌లో ఉంటూనే ఆ పార్టీ​అభ్యర్థులకు వెన్నుపోటు పొడిచే విధంగా కోవర్టులను సైతం ఈ ప్రలోభాల బృందం తయారు చేస్తోందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ 50 డివిజన్లలో ప్రతి అభ్యర్థితో రేవంత్‌రెడ్డి అనుచరవర్గం వెన్నంటి ఉంటోంది.

పావులు కదుపుతున్న బీజేపీ

కాంగ్రెస్‌లో ప్రధాన నేతగా ఉన్న రేవంత్‌రెడ్డి టార్గెట్‌గానే బీజేపీ కూడా పావులు కదుపుతోంది. ఇక్కడ ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే రఘునందన్‌రావులతో ప్రచారం చేయిస్తోంది. రేవంత్‌రెడ్డి దూకుడును తగ్గించగలిగితే రాష్ట్రంలో కమలం పార్టీకి భవిష్యత్తు ఉంటుందని, ఆ పార్టీలోని నేతలను తమవైపు తిప్పుకోవచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే కొంతమంది బీజేపీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నా కేవలం రేవంత్‌రెడ్డిని చూసి ఉంటున్నారని గుర్తించారు. ఈ నేపథ్యంలోనే రేవంత్​రెడ్డిని బలహీనపర్చే క్రమంలో గ్రేటర్​ ఎన్నికల్లో మల్కాజిగిరి పార్లమెంట్ సెగ్మెంట్‌లో బలం తగ్గించాలని, అక్కడ కాంగ్రెస్ అభ్యర్థులు గెలవకుండా చూడాలనే లక్ష్యంతో పని చేస్తున్నారు. అందుకే ఫైర్​బ్రాండ్‌గా పేరొందిన నేతలను మల్కాజిగిరిలో తిప్పుతున్నారు.

Tags:    

Similar News