కేంద్రం నిధులిస్తున్నా.. నిర్లక్ష్యమే!!
దిశ, తెలంగాణ బ్యూరో: గ్రేటర్‌పరిధిలో 150 వార్డులు. ఒక్కో వార్డుకు100 మరుగుదొడ్లు. అంటే మహానగరంలో మొత్తం 15వేల పబ్లిక్టాయిలెట్లు. నాలుగేళ్ల క్రితం మంత్రి కేటీఆర్ ఈ మాటలు చెప్పినప్పుడు నగర ప్రజలు ఉబ్బితబ్బిబ్బయ్యారు. చప్పట్లు కొట్టారు.., కేరింతలు వేశారు. ఇక ఉగ్గ పట్టుకునే ఇబ్బందులు తప్పాయనుకున్నారు. కానీ నేటికీ లక్ష్యం చేరుకోలేదు. 2016లో ఇచ్చిన హామీని అనుసరించి వార్డు లెక్కన కాకపోయినా కనీసం ఏడాదికి వెయ్యి నిర్మించిన మూడో వంతు లక్ష్యం నెరవేరేది. అర్బన్ ఏరియాల్లో పబ్లిక్ […]
దిశ, తెలంగాణ బ్యూరో: గ్రేటర్‌పరిధిలో 150 వార్డులు. ఒక్కో వార్డుకు100 మరుగుదొడ్లు. అంటే మహానగరంలో మొత్తం 15వేల పబ్లిక్టాయిలెట్లు. నాలుగేళ్ల క్రితం మంత్రి కేటీఆర్ ఈ మాటలు చెప్పినప్పుడు నగర ప్రజలు ఉబ్బితబ్బిబ్బయ్యారు. చప్పట్లు కొట్టారు.., కేరింతలు వేశారు. ఇక ఉగ్గ పట్టుకునే ఇబ్బందులు తప్పాయనుకున్నారు. కానీ నేటికీ లక్ష్యం చేరుకోలేదు. 2016లో ఇచ్చిన హామీని అనుసరించి వార్డు లెక్కన కాకపోయినా కనీసం ఏడాదికి వెయ్యి నిర్మించిన మూడో వంతు లక్ష్యం నెరవేరేది. అర్బన్ ఏరియాల్లో పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణానికి స్వచ్ఛ భారత్ అభియాన్ కింద ఆర్థిక సహకారాన్ని అందిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. కనీసం సగమంటే సగం కూడా నిర్మాణం కాలేదు. ఇప్పుడు మళ్లీ ఎన్నికల కోలాహలం మొదలైంది. పురపాలక మంత్రి మళ్లీ పబ్లిక్టాయిలెట్ల మాటలే వల్లే వేస్తున్నారు.
మంత్రి కేటీఆర్ స్వయంగా పర్యవేక్షిస్తున్న జీహెచ్ఎంసీ ముందుకుపోవడం లేదు. నగర పరిశుభ్రతతో పాటు మౌలిక సౌకర్యాలను మెరుగుపర్చడంలో కీలకంగా ఉన్న టాయిలెట్ల నిర్మాణంలో నాలుగేళ్లలో ఒక్క ఇటుక కూడా పడలేదు. జీహెచ్ఎంసీ పాలకవర్గం ఏర్పడిన నాటి నుంచి మంత్రి, జీహెచ్ఎంసీ కొత్తగా టాయిలెట్లు నిర్మిస్తామనడం.., ప్రణాళికలు రచించడం ఒక తంతుగా మారింది. ప్రతీ వెయ్యి మంది జనాభాకు కనీసం ఒకటి చొప్పున టాయిలెట్లు ఉండాలని మార్గనిర్ధేశకాలు ఉన్నాయి. పురపాలక శాఖ మంత్రి స్వయంగా ఇదే విధానాన్ని అమలు చేస్తామని ప్రకటించి నాలుగేళ్లు పూర్తయినా నిర్మాణాలు ముందుకుసాగడం లేదు.
సిటీలో పెరుగుతున్న ఉద్యోగావకాశాల నేపథ్యంలో మహిళల భాగస్వామ్యం సైతం పెరుగుతోంది. ఈ క్రమంలో స్త్రీలు టాయిలెట్ సమస్యలను ఎదుర్కొంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఉచిత టాయిలెట్లు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. మహిళల కోసం ప్రత్యేకంగా ‘లూ కేఫ్’లు అందుబాటులోకి తెస్తామన్న మాటలకు అడ్రస్ దొరకడం లేదు. ప్రయోగాత్మకంగా చేపట్టిన పర్యావరణహిత, ప్రయోగాత్మకంగా చేపట్టాలనుకున్న బయో టాయిలెట్ల నిర్మాణాలు ముందుగా సాగడం లేదు. ఆరు నెలలకోసారి మంత్రి టాయిలెట్ల నిర్మాణాలపై ప్రకటనలు చేయడం సర్వసాధారణమైంది. 2019 చివర, ఈ ఏడాది ప్రారంభంలో కూడా కొత్త మోడళ్లలో టాయిలెట్లను నిర్మించేందుకు స్వయంగా మంత్రి ఆదేశాలు జారీ చేశారు. పది మోడళ్లలో నమూనాలను ఎంఏయూడీ సిద్ధం చేసి పది నెలలు గడుస్తున్నా ఒక్కటి కూడా నిర్మించలేదు. జోనల్ కమిషనర్లకు బాధ్యతలు అప్పజెప్పగా.. ఇప్పటి వరకు స్థల గుర్తింపు, ఏజెన్సీల జాబితా కూడా అధికారుల వద్ద సిద్ధంగా లేదని సమాచారం.
ప్రకటనలతోనే కాలం పొడగింపు..
ఆరు నెలల్లో ఒక్కో యూనిట్ రూ.7.3లక్షల ఖర్చుతో వంద ఈ–టాయిలెట్స్ నిర్మిస్తామని 2017 జనవరిలో జీహెచ్ఎంసీ ప్రకటించింది. ఒక్కో జోన్ లో 10 చొప్పున 60 స్టేషనరీ ఉమెన్ టాయిలెట్స్, 15 మొబైల్ టాయిలెట్స్ అందుబాటులోకి తెస్తామని 2019 డిసెంబర్‌లో బల్దియా మరోసారి ప్రకటించింది. ఇక తాజాగా ఆగస్టు 15 నాటికి 3 వేల టాయిలెట్లను నిర్మిస్తామని కేటీఆర్ ప్రకటించారు. వీటికి అదనంగా మరో 7,200 టాయిలెట్లను అంటే దాదాపు 10 వేల టాయిలెట్లను అందుబాటులోకి తెస్తామని కేటీఆర్ తెలిపారు. స్పెషల్ డ్రైవ్‌లో ప్రతీ జోన్‌లో 1,200 చొప్పున నిర్మిస్తామని ఈ ఏడాది మార్చిలో మంత్రి కేటీఆర్, మేయర్బొంతు రామ్మోహన్ ప్రకటించారు. గ్రేటర్‌లో 7,200 పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణ లక్ష్యాన్ని మరోసారి అక్టోబర్ 2 నాటికి పొడగించారు. అయినా ఇప్పటి వరకూ నెరవేరలేదు. ఉమెన్ టాయిలెట్స్, బిల్డ్‌ఆపరేట్ ట్రాన్స్ఫర్ (బీఓటీ) పద్ధతిలో నిర్మిస్తామని చెప్పినా.. ఏజెన్సీలు ముందుకు రాకపోవడంతో నిర్మాణాలు సాగడం లేదని తెలుస్తోంది.
స్వచ్ఛ భారత్ మిషన్ సూచనల ప్రకారం…
స్వచ్ఛ భారత్ మిషన్ మార్గనిర్ధేశకాల ప్రకారం ప్రతీ వెయ్యి మంది పురుషులకు 10, వెయ్యి మంది మహిళలకు 20 పబ్లిక్ టాయిలెట్లు ఉండాలి. అలాగే కమ్యూనిటీ టాయిలెట్లు 35 మంది పురుషులకు ఒకటి, 25 మంది మహిళలకు ఒకటి చొప్పున ఉండాలి. ఈ లెక్కన మన గ్రేటర్ పరిధిలో కోటిన్నర జనాభా ప్రకారం 15 వేల పబ్లిక్ టాయిలెట్లు, 35 వేల కమ్యూనిటీ టాయిలెట్లు ఉండాలి.
ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్‌లో 1,536 పబ్లిక్ టాయిలెట్లు ఉన్నాయని జీహెచ్ఎంసీ చెబుతుండగా.. కేవలం 313 టాయిలెట్లలో 1,168 మంది సామర్థ్యంతో అందుబాటులో ఉన్నాయని గణంకాలు నిరూపిస్తున్నాయి. 2016లోనే మంత్రి హామీనివ్వడంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే మార్గనిర్ధేశకాలను విడుదల చేసింది. జీహెచ్ఎంసీ ఏటా స్వచ్ఛ ర్యాంకింగ్స్‌లో పాల్గొంటున్నా వసతుల కల్పనపై దృష్టి సారించడంలేదు. పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణానికి ఆర్థిక సాయంతో పాటు అమృత్ కింద నీటి సరఫరా, సీవరేజ్ వసతులను కేంద్రం కల్పిస్తోంది. అయినా టాయిలెట్ల నిర్మాణంపై జీహెచ్ఎంసీ అంతంగా ఆసక్తి కనబర్చడం లేదు.
ప్రైవేట్ టాయిలెట్లపైనే ఆధారం..
గ్రేటర్ లో ప్రస్తుతం ఉన్న టాయిలెట్లు జనాభాకు సరిపోవని బల్దియా అధికారులు సైతం అంగీకరిస్తున్నారు. నగరంలోని 259 పెట్రోల్ బంక్‌లు, 280 రెస్టారెంట్లలో ఉచిత టాయిలెట్లను ప్రజలు ఉపయోగించుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు. అయితే బల్దియా నిర్మించిన వాటిల్లోనూ ఉచిత టాయిలెట్ సౌకర్యం లేకపోవడం గమనార్హం. ఇక ప్రైవేట్ వ్యక్తులు సాధారణ ప్రజలు టాయిలెట్ కోసం అనుమతించడం సాధ్యపడదు. సీఎస్‌ఆర్ కింద రూ.3.91కోట్లతో 50 షీ టాయిలెట్లు, 178 ఇంటిగ్రేటేడ్ స్మార్ట్ వాష్‌రూమ్స్ (లూ కేఫ్)లు ఏర్పాటు చేస్తామన్నా.. పురోగతి కనిపించడం లేదు.