కేంద్రం ఇచ్చినా రాష్ట్రం వద్దంది.. 80 కోట్ల మందిలో మనం లేనట్టే.!

దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్ర ప్రభుత్వ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం తోసిపుచ్చిందనే అపవాదు వస్తోంది. కేంద్రానికి పేరు దక్కుతుందనో, కేంద్రం ఇచ్చే పథకం వద్దనుకుందో కానీ ఉచిత బియ్యాన్ని తీసుకోలేదు. దీంతో రాష్ట్రంలో పాత తరహాలోనే రూపాయి కిలో బియ్యం పంపిణీ చేస్తున్నారు. కేంద్ర పథకాన్ని తిరస్కరించడంపై అటు బీజేపీ కూడా తప్పు పడుతోంది. అయితే దీన్ని సీఎం కేసీఆర్​దృష్టికి తీసుకెళ్లకపోవడంతోనే ఈ బియ్యాన్ని తీసుకోలేకపోతున్నట్లు అధికారవర్గాల్లో చర్చ జరుగుతోంది. 80 కోట్ల మందిలో లేనట్టే..! […]

Update: 2021-05-08 13:45 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్ర ప్రభుత్వ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం తోసిపుచ్చిందనే అపవాదు వస్తోంది. కేంద్రానికి పేరు దక్కుతుందనో, కేంద్రం ఇచ్చే పథకం వద్దనుకుందో కానీ ఉచిత బియ్యాన్ని తీసుకోలేదు. దీంతో రాష్ట్రంలో పాత తరహాలోనే రూపాయి కిలో బియ్యం పంపిణీ చేస్తున్నారు. కేంద్ర పథకాన్ని తిరస్కరించడంపై అటు బీజేపీ కూడా తప్పు పడుతోంది. అయితే దీన్ని సీఎం కేసీఆర్​దృష్టికి తీసుకెళ్లకపోవడంతోనే ఈ బియ్యాన్ని తీసుకోలేకపోతున్నట్లు అధికారవర్గాల్లో చర్చ జరుగుతోంది.

80 కోట్ల మందిలో లేనట్టే..!

కరోనా విపత్కర పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోకున్నా పేద వర్గాలకు ఉచితంగా బియ్యం ఇస్తున్నట్లు ప్రకటించింది. కరోనా రెండో వేవ్ అందరినీ చుట్టుముడుతున్న సమయంలో ఈ నిర్ణయం తీసుకుంది. పేదలకు అండగా నిలిచేందుకు ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకాన్ని అమలు చేస్తోంది. దీని కింద ప్రతి పేదవాడికి రెండు నెలలు (మే, జూన్) ఐదు కిలోల బియ్యం ఉచితంగా సరఫరా చేసేందుకు నిర్ణయించింది. దాని ప్రకారమే రాష్ట్రాలకు కోటా కూడా నిర్ణయించింది. రాష్ట్రాల నుంచి ఇండెంట్ కోరింది. మొత్తం దీని కింద 80 కోట్ల మంది భారతీయులకు లబ్ధి చేకూరుతుందని, ఇందుకు ప్రభుత్వానికి రూ.26 వేల కోట్లు ఖర్చవుతుందని కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే.

వాస్తవానికి గతేడాది కరోనాను కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన సమయంలో ప్రతి పేదవాడికి ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద 5 కిలోల గోధుమలు లేదా బియ్యం ఉచితంగా పంపిణీ చేసింది. గతేడాది మార్చిలో ప్రారంభించిన ఈ పథకం 2020 నవంబర్ వరకు పొడిగించింది. సాధారణంగా ఇచ్చే కోటా కంటే ఎక్కువగా బియ్యం లేదా గోధుమలు సరఫరా చేశారు. అయితే ఈసారి కూడా ఈ పథకాన్ని మళ్లీ అమల్లోకి తీసుకుంది. ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన పథకం కింద రేషన్ కార్డు హోల్డర్లు ఇస్తున్న కోటా కంటే అదనంగా ఐదు కిలోల గోధుమలు లేదా బియ్యం కొనుగోలు చేయడానికి అనుమతించారు. కిలో బియ్యం రూ.3, కిలో గోధుమలు రూ.2లకు విక్రయించారు. బహిరంగ మార్కెట్లో కిలో గోధుమల ధర గతేడాది మార్చిలో రూ.27 ఉన్నా.. సబ్సిడీపై రెండు రూపాయలకే ఇవ్వగా.. బహిరంగ మార్కెట్లో కిలో బియ్యం ధర రూ.37 పలుకుతుండగా, రూ. 3లకు ఇచ్చింది. ఇలా దేశవ్యాప్తంగా 80 కోట్ల మందికి ఉచితంగా ఇస్తుండగా… ఈ జాబితాలో మాత్రం ఇప్పుడు మన రాష్ట్రం లేనట్టే.

మాకు వద్దు..

కేంద్ర ప్రభుత్వ పథకాన్ని తెలంగాణ తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఉచితంగా బియ్యం తీసుకునేందుకు నిరాకరించిందంటున్నారు. అటు సీఎం నుంచి కూడా ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో పాత పద్దతిలోనే రేషన్​డీలర్ల నుంచి డీడీలు తీసుకుని రూపాయి కిలో బియ్యాన్ని విడుదల చేశారు. దీంతో కేంద్ర ప్రభుత్వ బియ్యం వాడుకోవడం లేదు. కేంద్ర బియ్యం మాకొద్దు అనే రీతిలో వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో ఉచిత బియ్యం పంపిణీ లేదని, గతంలో మాదిరిగానే ఈ నెల కూడా రూపాయి కిలో చొప్పున విక్రయించాలని అధికారులు డీలర్లకు అధికారికంగా మెసేజ్‌లు ఇచ్చి పంపిణీని మొదలుపెట్టారు.

సీఎం దృష్టికి వెళ్లలేదట.?

మరోవైపు కేంద్రం.. ఈ స్కీం గురించి సీఎం కేసీఆర్‌కు వివరించలేదని, ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లలేదని అధికారవర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రాల వారీగా కేంద్రం.. మన రాష్ట్రానికి కూడా బియ్యం కేటాయింపులు చేసినట్లు చెబుతున్నారు. కానీ ప్రతి తెల్లరేషన్ కార్డుదారుడికి ఉచితంగా 5 కిలోల బియ్యంపై ఎలాంటి ప్రతిపాదనలు, వివరాలను సీఎంకు చెప్పలేదు. మరోవైపు కరోనా, రాజకీయ పరమైన అంశాల్లో సీఎం బిజీగా ఉండటంతో సంబంధిత మంత్రి, సీఎస్, పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు దీన్ని పట్టించుకోలేదు. ప్రతినెలా 1 నుంచే బియ్యం పంపిణీ ఉండగా.. ఈసారి 3 నుంచి మొదలుపెట్టారు. అప్పటి వరకు రాష్ట్రానికి కేంద్రం బియ్యం కేటాయింపు కూడా చేసింది. కానీ సీఎం నుంచి క్లియరెన్స్​ లేకపోవడంతో ఉచిత బియ్యం వ్యవహారం తేల్చలేదు. మాజీ మంత్రి ఈటలపై విమర్శల్లో పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల బిజీ అయితే.. అధికారులు కూడా దీన్ని గుర్తు చేసే ప్రయత్నాలు చేయలేదని విమర్శలున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉచిత బియ్యం పథకానికి రాష్ట్రం దూరమైంది.

 

Tags:    

Similar News