కరోనా కలకలం.. అంతా వెలవెల

దిశ, నల్లగొండ: ప్రశాంతంగా ఉన్న ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒక్కసారిగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైన వార్తలు వెలుగులోకి రావడంతో జిల్లా ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. నేడు శ్రీరామనవమి పండుగ సందర్భంగా జిల్లావాసులు తెల్లవారుజామున తలంటు స్నానం చేసి టీవీలకు అతుక్కుపోయి సీతారాముల వారి కల్యాణ కార్యక్రమాన్ని వీక్షించారు. కానీ, ఇంటి నుంచి మాత్రం బయటకు వెళ్లలేదు. దీంతో భక్తులు లేక రాములవారి ఆలయాలు వెలవెలబోయాయి. ఢిల్లీ మార్కజ్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన 44 మందిలో […]

Update: 2020-04-02 06:02 GMT

దిశ, నల్లగొండ: ప్రశాంతంగా ఉన్న ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒక్కసారిగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైన వార్తలు వెలుగులోకి రావడంతో జిల్లా ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. నేడు శ్రీరామనవమి పండుగ సందర్భంగా జిల్లావాసులు తెల్లవారుజామున తలంటు స్నానం చేసి టీవీలకు అతుక్కుపోయి సీతారాముల వారి కల్యాణ కార్యక్రమాన్ని వీక్షించారు. కానీ, ఇంటి నుంచి మాత్రం బయటకు వెళ్లలేదు. దీంతో భక్తులు లేక రాములవారి ఆలయాలు వెలవెలబోయాయి.

ఢిల్లీ మార్కజ్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన 44 మందిలో ఆరుగురికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు టీవీలో ప్రసారం కావడంతో జిల్లావాసుసలు ఒక్కసారిగా హతాశులయ్యారు. కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన ఆరుగురిలో నల్గొండ పట్టణానికి చెందినవారు ఐదుగురు, మిర్యాలగూడకు చెందిన ఒక మహిళ ఉండటంతో ఉమ్మడి జిల్లా ప్రజలు భయంతో వణికిపోతున్నారు. జనాలు బయటకు వచ్చేందుకు భయపడటంతో నల్లగొండ జిల్లా కేంద్రంలోని పండుగ రోజున రోడ్లు నిర్మానుష్యంగా దర్శనమిచ్చాయి.

ఢిల్లీ నుంచి వచ్చిన వ్యక్తి హైదరాబాదులో 4 రోజుల క్రితం చనిపోయిన విషయం విదితమే. ఈ మరణ వార్త తర్వాత తెలంగాణ వ్యాప్తంగా ఆరుగురు మర్కజ్ ప్రార్థనలకు వెళ్లి వచ్చినవారు కరోనా సోకడంతో మరణించారని కేంద్రం ప్రకటించింది. దీంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి మర్కజ్ ప్రార్థనలకు వెళ్లిన 54 మందిని ఆదివారం పోలీసులు, వైద్యారోగ్య సిబ్బంది గుర్తించారు. అనంతరం వారందరినీ గాంధీ ఆసుపత్రికి తరలించి స్క్రీనింగ్ టెస్ట్ తోపాటు రక్త శాంపిల్ సేకరించి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇందులో పదిమంది సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి క్వారంటైన్ లో ఉండగా మిగతావారిని సూర్యాపేట, నల్లగొండ, భువనగిరి, మిర్యాలగూడ ఐసోలేషన్ సెంటర్లకు తరలించారు. సోమ, మంగళవారాల్లో మరో పది మంది మర్కజ్ కు వెళ్లిన వారిని గుర్తించారు. వీరిని కూడా తగు పరీక్షల నిమిత్తం ‘గాంధీ’కి తరలించారు. వీరి కుటుంబ సభ్యులను సైతం వైద్యారోగ్య సిబ్బంది హోమ్ క్వారంటైన్ లో స్వీయ నిర్భందం చేశారు.

మొదటగా లేదని.. ఇప్పుడమో..

మర్కజ్ వెళ్లి వచ్చిన వారిలో జిల్లాకు చెందిన 54 మందికి పరీక్షలు నిర్వహించిన వైద్య సిబ్బంది వారిలో ఏ ఒక్కరికి కూడా కరోనా లక్షణాలు లేవని ప్రకటించారు. ఇదే విషయాన్ని జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి బుధవారం ధృవీకరించారు. జిల్లాలో కరోనా కేసులు లేవని కంగారు పడొద్దు అని ఆయన ప్రజలకు ధైర్యం చెప్పారు. మనోధైర్యం కల్పించేందుకు మంత్రి చెప్పిన మాటలు 24 గంటలు కూడా గడవక ముందే భిన్నమైన పరిస్థితులు తలెత్తడం జిల్లా ప్రజలను మరోసారి తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నది. కాగా, నల్లగొండ జిల్లాలో 44 మందికి పరీక్షలు నిర్వహించగా ఆరుగురికి పాజిటివ్ గా తేలడంతోపాటు మరో ఐదుగురి రిపోర్టులు పెండింగ్లో ఉన్నాయి.

యాదాద్రి భువనగిరి జిల్లాలో 12 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా తొమ్మిది మందికి నెగిటివ్ వచ్చినట్లు అధికారులు ధృవీకరించారు. కాగా, ముగ్గురికి సంబంధించిన రిపోర్టులు సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి నుంచి రావాల్సి ఉందని డీఎంహెచ్వో సాంబశివరావు తెలిపారు. రావలసిన వీరి రిపోర్టులో రిజల్ట్ ఏమి ఉంటుందోనని వారి కుటుంబ సభ్యులతోపాటు జిల్లా ప్రజల్లో ఒక రకమైన ఆందోళన వెంటాడుతున్నది.

జంకుతున్న జనం

తెలంగాణలో కరోనా ప్రభావం మొదలై దాదాపు 25 రోజులు కావస్తున్నది. బుధవారం వరకు జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాకపోయినప్పటికీ జిల్లాలో వియత్నాం, బర్మా దేశస్తుల సంచారంతో కొంత ఉలిక్కిపడ్డారు. వారికి పరీక్షలు నిర్వహించిన అధికారులు కరోనా లేదని ప్రకటించడంతో ఊపిరి పీల్చుకున్నారు. గత 25 రోజులుగా అనేక వదంతులతో జిల్లా ప్రజలు భయం గుప్పిట్లో కాలం వెళ్లదీస్తున్నారు. అదే భయం ఇప్పుడు నిజం కావడంతో గుండె ఆగినంత పని అయిపోయింది. ఇంకెన్ని పాజిటివ్ కేసులు బయటకు వస్తాయోనని వీరి ద్వారా కాంటాక్ట్ పాజిటివ్ కేసులు ఏ మేరకు పెరుగుతాయనన్న ఆందోళన జిల్లా యంత్రాంగాన్ని సైతం వెంటాడుతున్నది.

ప్రతిరోజు ఉదయం పూట కూరగాయలు, నిత్యావసర వస్తువుల కోసం బయటకు వచ్చే జనాలు ఈరోజు మార్కెట్లో కనిపించలేదు. కూరగాయల మార్కెట్ లు బోసిపోయి కనిపించాయి. నిత్యావసర వస్తువులు అమ్మే కిరాణా షాపులు, సూపర్ మార్కెట్ దుకాణాల వద్ద కొనుగోలుదారుల సందడి కనిపించలేదు. నల్గొండ పట్టణంలో ఐదుగురికి పాజిటివ్ రావడం పట్ల జిల్లా కేంద్రం ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్నారు.

క్వారంటైన్ ల వద్ద కట్టుదిట్టం

నల్లగొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి, భువనగిరి హోమియో ఆసుపత్రి, మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రి, సూర్యాపేట జిల్లా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ సెంటర్ లతోపాటు మహాత్మా గాంధీ యూనివర్సిటీ, సూర్యాపేట జిల్లాలోని ఇమాంపేట మోడల్ స్కూల్, బాలంపల్లి గురుకుల పాఠశాల, బీబీనగర్ ఎయిమ్స్ లో ఏర్పాటు చేసిన ప్రభుత్వ క్వారంటైన్ ల వద్ద పోలీసులు భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు. బుధవారం సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో కరోనా పేషెంట్ మృతి చెందడంతో అందుకు బాధ్యులుగా డాక్టర్లను చిత్రీకరిస్తూ రోగి బంధువులు వైద్యులపై దాడి చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నల్లగొండ ఎస్పీ ఏవీ రంగనాథ్, సూర్యాపేట ఎస్పీ భాస్కరన్, యాదాద్రి భువనగిరి జిల్లా డీసీపీ నారాయణ రెడ్డిల ఆధ్వర్యంలో స్థానిక పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు.

Tags: Nalgonda, Corona Effect, Positive, Sriramula temple, Police

Tags:    

Similar News