చీకట్లో ట్యాంక్‌బండ్.. సుందరీకరణ ఇంకెప్పుడు..?

దిశ, తెలంగాణ బ్యూరో: ట్యాంక్ బండ్‌కు న్యూలుక్ తీసుకొస్తాం. సరికొత్త అందాలు అద్ది జిగేల్‌ అనేలా పనులు చేస్తామంటూ 2018లో ప్రభుత్వం ఊదరగొట్టింది. కానీ నేటికీ అభివృద్ధి పనులు పూర్తికానేలేదు. కేవలం ట్విట్టర్ వేదికగా డెడ్ లైన్.., పనులు పూర్తవడం అవుతుందే కానీ క్షేత్రస్థాయిలో పనులు ముందుకుసాగడం లేదు. నగర సుందరీకరణలో భాగంగా మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో హెచ్ఎండీఏ 2018లో ట్యాంక్‌బండ్ బ్యూటీఫికేషన్ పనులు చేపట్టింది. ఈ పనులు రెండేండ్ల తర్వాత కూడా పనులు కొనసాగుతూనే ఉన్నాయి. […]

Update: 2021-03-15 12:30 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ట్యాంక్ బండ్‌కు న్యూలుక్ తీసుకొస్తాం. సరికొత్త అందాలు అద్ది జిగేల్‌ అనేలా పనులు చేస్తామంటూ 2018లో ప్రభుత్వం ఊదరగొట్టింది. కానీ నేటికీ అభివృద్ధి పనులు పూర్తికానేలేదు. కేవలం ట్విట్టర్ వేదికగా డెడ్ లైన్.., పనులు పూర్తవడం అవుతుందే కానీ క్షేత్రస్థాయిలో పనులు ముందుకుసాగడం లేదు. నగర సుందరీకరణలో భాగంగా మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో హెచ్ఎండీఏ 2018లో ట్యాంక్‌బండ్ బ్యూటీఫికేషన్ పనులు చేపట్టింది. ఈ పనులు రెండేండ్ల తర్వాత కూడా పనులు కొనసాగుతూనే ఉన్నాయి. అంతేకాదు చేసిన పనులు నెలలు తిరగకముందే పాడైపోతున్నాయి. సాగర్ చుట్టూ ఏర్పాటు చేసిన కొత్త స్ట్రీట్ లైట్లు నెల రోజులు దాటకముందే చీకట్లు పంచుతున్నాయి. ఇక ట్యాంక్‌బండ్‌పై గతంలోనే నాణ్యతగా ఉన్న విలువైన, సుందరమైన రెయిలింగ్, రీ యూజబుల్ బ్రిక్స్‌ను కూడా తొలగించి..నిధులు దుర్వినియోగం చేస్తున్నారంటూ సిటిజన్స్ మండిపడుతున్నారు.

ప్రపంచస్థాయి నగరమంటూ ప్రచారం సాగించిన ప్రభుత్వం, మున్సిపల్ శాఖ హైదరాబాద్ సుందరీకరణ పేరుతో ప్రత్యేక ప్రాజెక్టులు చేపట్టింది. కేబుల్ బ్రిడ్జి, చారిత్రాత్మక కట్టడాల పునరుద్ధరణతో పాటు ట్యాంక్‌బండ్ సుందరీకరణకు పూనుకున్నది. ఇందుకోసం రూ.38 కోట్లను కూడా కేటాయించింది. అయితే ఈ ప్రాజెక్టు ఖర్చు సుమారు రూ.60కోట్లపైనే ఉంటుందని నిర్మాణరంగా నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫుట్‌పాత్‌ల ఆధునీకరణ, చూడముచ్చట గొలిపే రెయిలింగ్‌, అందమైన స్ట్రీట్ లైటింగ్‌ ఏర్పాటు చేయనున్నట్టు అధికారులు ప్రకటించారు. అధునాతన టాయిలెట్లు అందుబాటులోకి తీసుకువస్తామన్న పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దీనికోసం రూ.14.50 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇక రూ.12.50 కోట్లతో స్ట్రీట్‌ లైట్‌, రెయిలింగ్‌ పనులను చేపట్టారు.

సుమారు 15 మీటర్లకు ఒకటి చొప్పున లైటింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేయగా.. కొన్ని స్తంభాలపై ఇప్పటికే లైట్లు వెలగడం లేదు. పురాతన స్మృతులను గుర్తుకు తెచ్చేలా ట్యాంక్‌బండ్‌పై పాత డిజైన్లను చేపడుతున్నామని అధికారులు చెబుతుండగా.. ఉన్న అందాలను చెడగొడుతున్నారంటూ నగర ప్రజలు మండిపడుతున్నారు. గతంలో ఉన్న ఫుట్‌పాత్‌లు, రెయిలింగ్ నాణ్యమైన స్థితిలో ఉన్నప్పటికీ వాటిని తొలగించాల్సిన అవసరమేముందంటే అధికారుల వద్ద సమాధానం లేదు. చారిత్రాత్మకతకు అద్దంపట్టేలా, అందంగా ఉన్న ట్యాంక్ బండ్ రెయిలింగ్‌ను కూడా తొలగించారు. హైదరాబాద్ – సికింద్రాబాద్‌లను కలుపుతూ ఉండే ట్యాంక్ బండ్ రోడ్డుపై ఏండ్ల తరబడి పనులు కొనసాగుతుండటం వల్ల వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. సుందరీకరణలో భాగంగా ఏర్పాటు చేసిన వీధి లైట్లు పాడై రోడ్లు చీకటిగా మారిపోయాయి. అయినా అధికారుల్లో స్పందన కనిపించడం లేదు.

రెండేండ్ల నుంచి ట్విట్టర్‌లోనే పనులు పూర్తి

ఎన్నికలకు ముందే ట్యాంక్‌బండ్ బ్యూటీఫికేషన్ పూర్తి చేస్తామని కేటీఆర్ ప్రకటించారు. అయితే తరచుగా ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా బ్యూటీఫికేషన్ పనులను అదిగో.. ఇదిగో అంటూ ఊరిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఫుట్‌పాత్‌ టైల్స్ తొలగించి, కొత్తవి వేసే పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఏర్పాటు చేసిన వీధి దీపాలు మెయింటెనెన్స్ సరిగా లేకపోవడం వల్ల వెలగడం లేదు. న్యూ స్టైల్‌లో ఉండే ఈ స్ట్రీట్ లైట్లను ఈ ఏడాది జనవరి 31వ తేదీన మొదటిసారి వెలిగించారు. ఫిబ్రవరి నెల చివరి వరకూ కూడా ఈ లైట్లు సరిగా వెలగలేదంటే పనుల్లో నాణ్యతపై సందేహాలు తలెత్తుతున్నాయి.

ఇక ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ 2018 జూన్ 26న ‘కేటీఆర్ ఆదేశాల మేరకు హుస్సేన్ సాగర్ బ్యూటీఫికేషన్ పనులను పరిశీలించానని, గ్రీనరీ, ఫుట్ పాత్, ఎల్‌ఈడీ లైట్ల పనులను 2018 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని ‘తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించారు. అయితే ఫుట్ పాత్ పనులు కొనసాగుతుండగా.. ఎల్‌ఈడీ లైట్లను ఈ ఏడాది 31న ప్రారంభించారు. సుమారు మూడేండ్లు చేరువవుతున్న సందర్భంలో హుస్సేన్ సాగర్ సుందరీకరణ పనులు ఎప్పటికీ పూర్తవుతాయో అధికారులకే తెలియడం లేదు. మూడేండ్లలో అంచనా ఖర్చు రెట్టింపు అయినా పనులు యాభై శాతం కూడా పూర్తికాకపోవడం గమనార్హం.

నాణ్యత, పారదర్శకతతో పనులు పూర్తి చేయాలి

ట్యాంక్‌బండ్‌పై అందమైన రెయిలింగ్, బ్రిక్స్ ఉండేవి. వాటిని తొలగించినప్పుడు నగరంలోని వేరే చెరువుల సుందరీకరణ కోసం కూడా వినియోగించవచ్చు. 2018లోనే పనులు పూర్తి చేస్తామని ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ గతంలోనే ప్రకటించారు. రెండేండ్ల తర్వాత కూడా పనులు పూర్తి కాలేదు. అప్పుడు కేటాయించిన బడ్జెట్‌తోనే పనులు పూర్తి చేయడం కూడా సాధ్యం కాదు. ప్రభుత్వాధికారుల్లో పారదర్శకత లోపించిందనడానికి ట్యాంక్‌బండ్ సుందరీకరణ ఉదాహరణగా నిలుస్తోంది. గ్రేటర్‌ సిటీలో హైలెట్ ప్రోగ్రాంను తీసుకున్నప్పుడు నాణ్యత, పారదర్శకత పాటించాల్సిన అవసరాన్ని మర్చిపోకూడదు. కేటీఆర్ స్వయంగా పర్యవేక్షిస్తున్న ఇలాంటి ప్రాజెక్టు ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఇక సిటీని అభివృద్ధి చేయడంపై ప్రజలు ఎలా నమ్మకాన్ని కొనసాగించగలరో అధికారులు ఆలోచించాలి. -డి. హరీశ్, ఐటీ ఉద్యోగి, హైదరాబాద్

Tags:    

Similar News