కరోనా కలకలం… ఐటీ కళకళ!

కరోనా వైరస్ మనుషులనే కాదు.. వ్యవస్థలనే వణికిస్తోంది. అన్ని రంగాల ఆర్థిక మూలాలను కబళిస్తోంది. పర్యాటకం, హాస్పిటాలిటీపై కోలుకోలేని దెబ్బపడింది. ఈ రెండు రంగాల్లో సేవలందిస్తున్న ఐటీ పరిశ్రమకు నష్టాలు వాటిల్లే అవకాశాలున్నా మిగతా రంగాల్లో సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ దూసుకెళుతోంది. ఐటీ రంగం రూపాంతరం చెందుతున్నది. కొవిడ్-19 నేపథ్యంలో విద్య, బోధన, వైద్యం, చికిత్స, ఎంటర్‌టైన్‌మెంట్ సంబంధిత అంశాల్లో టెక్నాలజీ వినియోగం పెరుగుతోంది. కొత్త కొత్త యాప్‌లు, స్టార్టప్‌లు, టెక్నాలజీ ఆవిష్కరణలు అందుబాటులోకి వస్తున్నాయి. అంతా డిజిటలైజేషన్‌గా […]

Update: 2020-06-10 20:47 GMT

కరోనా వైరస్ మనుషులనే కాదు.. వ్యవస్థలనే వణికిస్తోంది. అన్ని రంగాల ఆర్థిక మూలాలను కబళిస్తోంది. పర్యాటకం, హాస్పిటాలిటీపై కోలుకోలేని దెబ్బపడింది. ఈ రెండు రంగాల్లో సేవలందిస్తున్న ఐటీ పరిశ్రమకు నష్టాలు వాటిల్లే అవకాశాలున్నా మిగతా రంగాల్లో సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ దూసుకెళుతోంది. ఐటీ రంగం రూపాంతరం చెందుతున్నది. కొవిడ్-19 నేపథ్యంలో విద్య, బోధన, వైద్యం, చికిత్స, ఎంటర్‌టైన్‌మెంట్ సంబంధిత అంశాల్లో టెక్నాలజీ వినియోగం పెరుగుతోంది. కొత్త కొత్త యాప్‌లు, స్టార్టప్‌లు, టెక్నాలజీ ఆవిష్కరణలు అందుబాటులోకి వస్తున్నాయి. అంతా డిజిటలైజేషన్‌గా మారుతున్నది. రోజురోజుకు ఐటీ కొత్త పుంతలు తొక్కుతున్నదని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

దిశ, న్యూస్ బ్యూరో: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఏ ఆరోగ్య సమస్య తలెత్తినా ఆసుపత్రికి వెళ్లే సాహసం చేయడం లేదు. ఏదైనా ప్రత్యామ్నాయం కోసం జనం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే హెల్త్ యాప్స్, స్టార్టప్‌లు, వెబ్‌సైట్లు, ఆన్‌లైన్ కన్సల్టేషన్ల వైపు చూస్తున్నారు. డాక్టర్లను కూడా ఆన్‌లైన్‌లోనే కలుస్తున్నారు. సమస్యను చెప్పుకొని చికిత్స పొందుతున్నారు. ఈ ప్రక్రియకే మొగ్గు చూపుతున్నారు. ఉదాహరణకు తెలంగాణ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ అసోసియేష‌న్ (టీటా) డిజిథాన్ కృషితో సమ‌గ్ర టెలీమెడిసిన్ సేవ‌లు అందుబాటులోకి వచ్చాయి. ‘టి.క‌న్స‌ల్ట్' పేరుతో ఇప్పటికే కొన్ని పల్లెల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆయా గ్రామాల ప్రజలు ఆన్‌లైన్ ద్వారా వైద్యసేవ‌లు పొంద‌నున్నారు. టెలీమెడిసిన్ సేవ‌లు అందించ‌డంలో భాగంగా ఆన్‌లైన్‌ విధానం ద్వారా సంబంధిత స్పెష‌లిస్ట్ డాక్ట‌ర్ త‌మ‌ అందుబాటు స‌మ‌యాన్ని పేర్కొంటారు. దానికి అనుగుణంగా ప్ర‌జ‌లు అపాయింట్‌మెంట్ పొందుతారు. సంబంధిత డాక్ట‌ర్, గ్రామ‌స్తుడు ఆన్‌లైన్ ద్వారా క‌న్స‌ల్ట్ అవుతారు. వీరిద్ద‌రి మ‌ధ్య జ‌రిగిన టెలీ మెడిసిన్ ప్ర‌క్రియ తర్వాత ప్రిస్క్రిప్షన్ సైతం ఆన్‌లైన్‌లోనే పంపిస్తారు. పంచాయ‌తీ కార్యాల‌యంలో నోడ‌ల్ ఆఫీస‌ర్ అయిన ఆశా వర్కర్ ఈ వీడియో క‌నెక్ట్ ప్ర‌క్రియ‌ను స‌మ‌న్వ‌యం చేస్తారు. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో వ్య‌క్తులు బ‌య‌ట‌కు రావ‌ద్ద‌నే ఆదేశాలు ఉండ‌టంతో వాటిని గౌర‌వించ‌డంతో పాటుగా మెరుగైన వైద్య‌సేవ‌లు సామాన్యుల‌కు సైతం ఈ ప్రాజెక్టు ద్వారా చేరువకానున్నాయి. ఇటలీ, ఫ్రాన్స్‌, నెద‌ర్లాండ్స్ త‌దిత‌ర క‌రోనా తీవ్ర ప్ర‌భావిత దేశాల్లోని ఎన్నారైల‌కు కొవిడ్‌-19 విష‌యంలో 'డిజిథాన్ ఆన్‌లైన్ క్లినిక్‌' ద్వారా వైద్య సేవ‌లు అందించిన ప్ర‌క్రియ‌కు కొన‌సాగింపుగా ప‌ల్లె సీమ‌ల్లోని ప్ర‌జ‌లకు ఈ స్పెషాలిటీ వైద్యం అందుబాటులోకి తెస్తున్న‌ట్లు తెలంగాణ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ చెబుతోంది. గ్రామ‌స్థులు వైద్య స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్నార‌ని వారికి ఆ ఇబ్బందులు తొల‌గించేందుకు ఈ ప్రాజెక్టు ఉప‌యుక్తంగా ఉంటుంద‌ని పేర్కొంది. చాలా ప్రైవేటు ఆసుపత్రులు కూడా ఇలాంటి ఆన్‌లైన్ సేవలకు అనేక యాప్స్ అందుబాటులోకి తీసుకొచ్చాయి.

ఆన్‌లైన్‌లోనే చదువులు..

ప్రభుత్వ రంగంలోనూ అనేక సర్వీసులు ఐటీతోనే ముడిపడి ఉన్నాయి. కరోనా నేపథ్యంలో మరిన్ని సేవల విస్తరణ అనివార్యంగా మారనుంది. ఫీజుల చెల్లింపులు, బ్యాంకింగ్, ఇన్సూరెన్సు రంగాల్లోనూ డేటా వినియోగం విస్తృతం కానున్నాయని ఐటీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే సైబర్ సెక్యూరిటీలోనూ ప్రతిఒక్కరూ సాఫ్ట్‌వేర్ వినియోగం తప్పనిసరి కానుంది. విద్యాబోధన కూడా ఆన్‌లైన్‌కు మారుతున్నది. ఈ ఏడాది ఆగస్టు తర్వాతే స్కూళ్లు తెరిచే అవకాశాలున్నాయని సర్కారు చెబుతున్నది. అప్పటి వరకు తరగతులు నడిచే అవకాశమే లేదు. దాంతో ప్రతి విద్యాసంస్థ ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించుకునే పనిలో నిమగ్నమైంది. ఇంట్లోనే కూర్చొని చదివే రోజులు వచ్చాయి. డిజిథాన్ ఎడ్యుకేషన్‌కు మార్కెట్లో డిమాండ్ పెరిగింది. చాలా విద్యా సంస్థలు ఇప్పటికే డిజిటల్ తరగతులను ఆరంభించాయి. ఈ క్రమంలోనే డిజిటల్ పాఠాల నిర్వహణకు అవసరమైన స్టార్టపులు అనేకం అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. అదే స్థాయిలో ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి.

ఫేషియల్ మూవ్‌మెంట్‌తో గుర్తింపు

రాష్ట్ర ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇయర్‌గా ప్రకటించిన తర్వాత ప్రతి ఒక్కరూ ఐటీ, డేటా వినియోగంపై ఆలోచించడం మొదలుపెట్టారు. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో 60 మంది ఒకేసారి కూర్చొని వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తున్నారు. ఆ సమావేశంలో పాల్గొన్న వారంతా ఆసక్తిగా వింటున్నారో లేదో ఫేషియల్ మూవ్‌మెంతోనే గుర్తించే సాఫ్ట్‌వేర్ అందుబాటులోకి వచ్చింది. కార్డియాలజిస్టులు, గైనకాలజిస్టులు, చిన్న పిల్లల నిపుణులు సైతం ఆన్‌లైన్‌ లోనే సమస్యను తెలుసుకొని చికిత్సనందించే వ్యవస్థలు ఏర్పడ్డాయి. వేరే దేశాలకు కూడా అనేక ఉత్పత్తులు అవసరం. వాటిని రూపొందించగల సత్తా హైదరాబాద్ ఐటీ కంపెనీలకు, నిపుణులకు ఉంది. అందుకే ఉద్యోగ ఉపాధి అవకాశాలకు ఎలాంటి ఢోకా ఉండదని చెబుతున్నారు.

అతి తక్కువ ఫీజుతో అనేక కోర్సులు: సందీప్ కుమార్ మక్తాల, అధ్యక్షుడు, తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్

హైదరాబాద్‌లో ఐటీ రంగానికి ఎలాంటి ఢోకా లేదు. మరిన్ని అవకాశాలు రానున్నాయి. విద్య, వైద్యం, సర్వీసులు, ఎంటర్ టైన్‌మెంట్ రంగాల్లో అనేక యాప్స్, వెబ్‌సైట్లు, డిజిటలైజేషన్ పెరగనున్నాయి. కొన్నిరంగాలకు సంబంధించిన అంశాల్లో ఐటీకి నష్టం వాటిల్లవచ్చు. కానీ కొత్త మార్కెట్‌కు చాలా అవకాశాలు ఉంటాయి. డిజిటల్ తరగతుల నిర్వహణ, వైద్యుల సేవలకు ఐటీ తోడ్పాటు అవసరం. కరోనా వైరస్ నేపథ్యంలో ఐటీ రూపాంతరం చెందుతున్నది. హైదరాబాద్‌లోనే విస్తరణకు చాలా అవకాశాలు ఉన్నాయి. నగరంలో ప్రస్తుతం ఒక వైపు మాత్రమే విస్తరించింది. ఇంకా మూడు వైపులా విస్తరణకు అవసరమైన భూములు అనేకం ఉన్నాయి. పైగా హైదరాబాద్‌లో కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ. అనేక కంపెనీలు ఇక్కడ వాటి శాఖలను ఏర్పాటు చేసేందుకు ముందుకొస్తున్నాయి.

ఐటీ గ్లోబల్ లింకుతో కూడినది: రమేష్, ప్రొఫెసర్, కో-ఇన్నోవేషన్ ఐఐఐటీ-హెచ్

ఐటీ గ్లోబల్‌తో ముడిపడి ఉంటుంది. కరోనా వైరస్‌తో కొంత ప్రభావం ఉంటుంది. వరల్డ్ ఎకానమీ దివాళా తీసిన సందర్భంలోనూ ఐటీ రంగానికి ఏం కాలేదు. మనకు అవకాశాలు అనేకం ఉంటాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో 1000 మందిని తొలగిస్తే ఇక్కడ 500 మందితో పని చేయించుకోవచ్చునన్న అభిప్రాయం నెలకొంది. వచ్చే మూడు నెలల పాటు ప్రభావం ఉంటుంది. రిటెయిల్ మార్కెట్ పెరుగుతుంది. వస్తువు ఎక్కడి నుంచి కొంటామన్నది ముఖ్యం కాదు. కానీ వస్తువు కొన్నామా లేదన్నదే ప్రధానం. ఐటీ కూడా అంతే. రూపం మారుతుంది. గతంలో షాపులకు వెళ్లి కొనేవారు. ఇప్పుడు ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తారు. అంటే ఇండస్ట్రీ గ్లోబల్‌కు లింకై ఉంటుంది. ఐటీకి విస్తారంగా మార్కెట్ ఉంటుంది. ఇప్పడున్న స్టార్టపులు కొత్త తరహాలో వస్తాయి. ఐటీ వినియోగం పెరుగుతున్నప్పుడు అవకాశాలు కూడా అదే స్థాయిలో పెరుగుతాయి. ఐటీలో నైపుణ్యం చాలా ప్రధానం.

Tags:    

Similar News