ఎంపీలు, ఎమ్మెల్యేల నేరాల విచారణపై హైకోర్టు సంతృప్తి
దిశ, తెలంగాణ బ్యూరో : పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులపై పెండింగ్‌లో ఉన్న నేరారోపణలు, నమోదైన కేసులపై ప్రత్యేక కోర్టులో విచారణ ప్రక్రియ సంతృప్తికరంగానే సాగుతోందని, ప్రతీరోజూ ఆ కోర్టుల నుంచి తమకు నివేదికలు అందుతూ ఉన్నాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ విచారణ ప్రక్రియను తొందరగా ముగించేందుకు వీలుగా అవసరమైన కోర్టు సిబ్బందిని, పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించాల్సిందిగా ఇప్పటికే ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశామని స్పష్టం చేసింది. ప్రజా ప్రతినిధులపై నమోదైన కేసుల విచారణను […]
దిశ, తెలంగాణ బ్యూరో : పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులపై పెండింగ్‌లో ఉన్న నేరారోపణలు, నమోదైన కేసులపై ప్రత్యేక కోర్టులో విచారణ ప్రక్రియ సంతృప్తికరంగానే సాగుతోందని, ప్రతీరోజూ ఆ కోర్టుల నుంచి తమకు నివేదికలు అందుతూ ఉన్నాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ విచారణ ప్రక్రియను తొందరగా ముగించేందుకు వీలుగా అవసరమైన కోర్టు సిబ్బందిని, పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించాల్సిందిగా ఇప్పటికే ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశామని స్పష్టం చేసింది. ప్రజా ప్రతినిధులపై నమోదైన కేసుల విచారణను వేగవంతం చేయాలంటూ ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం విచారించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ విజయసేన్ రెడ్డిలతో కూడిన డివిజన్ బెంచ్ పై వ్యాఖ్యలు చేసింది.
పబ్లిక్ ప్రాసిక్యూటర్లను, కోర్టు సిబ్బందిని నియమించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది గురువారం విచారణ సందర్భంగా హైకోర్టును కోరారు. దీనికి స్పందించిన డివిజన్ బెంచ్ ఇప్పటికే ప్రభుత్వాన్ని ఆదేశించినందున తగిన చర్యలు తీసుకుంటుందనే భావిస్తున్నట్లు వ్యాఖ్యానించింది. ఎంపీలు, ఎమ్మెల్యేల కేసుల విచారణకు పోలీసుల నుంచి తగిన సహకారం అందడంలేదని న్యాయవాది సత్యం రెడ్డి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పటికైతే ఈ కేసులను విచారిస్తున్న ప్రత్యేక కోర్టుల నుంచి రోజూ నివేదికలు వస్తున్నాయని బదులిచ్చింది. పోలీసులు సహకరించడంలేదంటూ ఆ కోర్టుల న్యాయాధికారులు ఇప్పటివరకూ తమ దృష్టికి ఎలాంటి అంశాలను తీసుకురాలేదని వివరించింది.
ప్రజా ప్రతినిధులపై నమోదైన కేసుల విచారణలో ఎవరికీ ఎలాంటి ఆందోళన అవసరం లేదని స్పష్టం చేసింది. ఎంపీలు, ఎమ్మెల్యేల కేసులను సుప్రీంకోర్టు, హైకోర్టు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని వివరించింది. ఆ ప్రకారమే సుప్రీంకోర్టుకు ప్రతీ నెలా క్రమం తప్పకుండా నివేదికను పంపిస్తున్నామని, కేసుల పురోగతిపై అన్ని వివరాలనూ అందిస్తున్నామని తెలిపింది. ప్రస్తుతం ఈ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు, హైకోర్టు పర్యవేక్షిస్తూ ఉన్నందున మళ్ళీ ఈ అంశంపై నోటీసులు జారీ చేయాల్సిన అవసరం లేదని హైకోర్టు అభిప్రాయపడింది.