రైతన్న విలవిల.. మంటల్లో కాలిపోయిన ధాన్యం..!
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్/ నారాయణపేట: అమ్మకానికి సిద్ధంగా ఉంచిన వరి ధాన్యం బస్తాలు కాలి బూడిదైన ఘటన బుధవారం నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం గోటూరులో చోటు చేసుకుంది. అప్పు చేసి మరీ పండించుకున్న వరి ధాన్యాన్ని అమ్మి తమ కష్టాలను తీర్చుకుందాం అనుకున్న రైతుల ఆశలు బూడిద పాలయ్యాయి. గ్రామానికి చెందిన బొంబాయి రాములు, సిద్ది చిన్న నరసయ్య, సిద్ది నర్సింలు, పొట్టి రాములు, సిద్ధి కిష్టన్న, మబ్బు బుచ్చన్నలకు చెందిన మొత్తం 800కు […]
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్/ నారాయణపేట: అమ్మకానికి సిద్ధంగా ఉంచిన వరి ధాన్యం బస్తాలు కాలి బూడిదైన ఘటన బుధవారం నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం గోటూరులో చోటు చేసుకుంది. అప్పు చేసి మరీ పండించుకున్న వరి ధాన్యాన్ని అమ్మి తమ కష్టాలను తీర్చుకుందాం అనుకున్న రైతుల ఆశలు బూడిద పాలయ్యాయి. గ్రామానికి చెందిన బొంబాయి రాములు, సిద్ది చిన్న నరసయ్య, సిద్ది నర్సింలు, పొట్టి రాములు, సిద్ధి కిష్టన్న, మబ్బు బుచ్చన్నలకు చెందిన మొత్తం 800కు పైగా వరి బస్తాలను నింపి అమ్మకం కోసం సిద్ధంగా ఉంచారు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం ఉరుములు మెరుపులు, గాలులతో కూడిన వర్షం కురవడంతో అక్కడే ఉన్న విద్యుత్ వైర్లు గాలికి ఒకదానికి మరొకటి తాకడంతో నిప్పు రవ్వలు చెలరేగాయి.
దీంతో సమీపంలో ఉన్న వరిగడ్డికి అంటు కోవడంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో బస్తాల్లో నింపిన ధాన్యం మొత్తం అగ్నికి ఆహుతి అయింది. తాము కాయాకష్టం చేసి పండించిన వరి ధాన్యం కాలి బూడిద పాలు అవడంతో రైతులు బోరున విలపించారు. విషయం తెలుసుకున్న తాహసీల్దార్ బాలచందర్, ఎస్‌ఐ రాజేందర్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. అప్పటికే వాతావరణం అనుకూలించడం, విద్యుత్తు సరఫరా ఉండడంతో మోటార్‌లు పెట్టి మంటలు ఆర్పారు. ఈ సంఘటనలో దాదాపుగా ఆరువందలకు పైగా బస్తాలు కాలినట్లు అధికారులు గుర్తించారు. 8 లక్షలకు పైగా నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు. నష్టపోయిన రైతులను ఆదుకోవాలని బాధితులు ప్రభుత్వాన్ని, అధికారులను వేడుకుంటున్నారు.