అంతా ఆన్ లైన్ మాయ.. కౌలు రైతు కష్టం వృథా..!

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: పది మందికి అన్నం పెట్టాలనే ఆశతో రైతు భూమిని నమ్ముకొని సాగు చేస్తున్నారు. ఇదే రంగారెడ్డి జిల్లాలో భూ యజమాని వ్యవసాయం చేయడం తక్కువ సంఖ్యలో ఉంటుంది. కానీ భూమి లేని నిరుపేదలు ఇతర భూములను కౌలుకు తీసుకొని వ్యవసాయం చేయడం తెలంగాణ రాష్ట్రంలోనే అధికంగా ఉంటారు. అందులో రంగారెడ్డి జిల్లా నెంబర్ వన్లో ఉంటుంది. ఆరుగాలం కష్టించి రెక్కలు ముక్కలు చేసుకుని.. కంటికి రెప్పలా కాపాడుకున్న పంటను అమ్ముకునే స్వతంత్రం కూడా […]

Update: 2021-10-21 04:07 GMT

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: పది మందికి అన్నం పెట్టాలనే ఆశతో రైతు భూమిని నమ్ముకొని సాగు చేస్తున్నారు. ఇదే రంగారెడ్డి జిల్లాలో భూ యజమాని వ్యవసాయం చేయడం తక్కువ సంఖ్యలో ఉంటుంది. కానీ భూమి లేని నిరుపేదలు ఇతర భూములను కౌలుకు తీసుకొని వ్యవసాయం చేయడం తెలంగాణ రాష్ట్రంలోనే అధికంగా ఉంటారు. అందులో రంగారెడ్డి జిల్లా నెంబర్ వన్లో ఉంటుంది. ఆరుగాలం కష్టించి రెక్కలు ముక్కలు చేసుకుని.. కంటికి రెప్పలా కాపాడుకున్న పంటను అమ్ముకునే స్వతంత్రం కూడా లేని దుస్థితి తెలంగాణ ప్రభుత్వంలో కౌలు రైతులకు దాపురించింది.

ఎన్నో యేండ్లుగా బీడు భూములను సాగు చేసుకొని వ్యవసాయం చేస్తున్న రైతులకు పట్టాలు ఇవ్వకుండా ప్రభుత్వం మోసం చేస్తోంది. భూస్వాముల వద్దనున్న భూములను సాగు చేసుకొని జీవిద్దామంటే మరోరకంగా రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తుందని కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కౌలు రైతులకు.. అందాల్సిన సంక్షేమ పథకాలు, సబ్సిడీలు ఇవ్వకపోగా.. సాగు చేసిన పంటను అమ్ముకునేందుకు కూడా వీల్లేకుండా చేస్తోంది ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పంట సర్వేలో భాగంగా ఆన్లైన్ పోర్టల్లో పంట, రైతు వివరాలు సేకరించింది. ఈ వివరాల ఆధారంగానే వానాకాలం పంట కొనుగోలు చేయనుంది. కానీ ఆన్లైన్ పోర్టల్లో కౌలు రైతుల వివరాలు సేకరించలేదు. భూ యజమానుల పేర్లనే నమోదు చేస్తోంది. వారి పేరున ఉన్న పంటలు మాత్రమే కొనుగోలు చేస్తామని చెప్పడంతో కౌలు రైతుల్లో ఆందోళన మొదలైంది. ఇంటిల్లిపాది శ్రమ పడి పండించిన పంటను యజమానుల చేతుల్లో పోయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కౌలు రైతుల సాగు రంగారెడ్డి జిల్లాలోనే అత్యధికం..

రాష్ట్ర రాజధాని శివారు ప్రాంతమైన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగిస్తున్న వారిలో భూ యజమానుల కంటే కౌలు రైతులు ఎక్కువగా ఉన్నారు. ఈ ప్రాంతంలో భూములు 30 శాతం వరకు వ్యాపారుల చేతుల్లో ఉండటంతో వాటిని కౌలు రైతులే సాగు చేస్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఈ ఏడాది 7 లక్షల 75523 మంది రైతులు, 12 లక్షల 2952 ఎకరాలు భూమిని సాగు చేశారు. ఇందులో లక్ష 45 వేల మంది కౌలు రైతులు ఉన్నారు. రంగారెడ్డి జిల్లాలో సుమారు 6 లక్షల 20 వేల ఎకరాలు, వికారాబాద్లో 5 లక్షల 82583 ఎకరాల్లో వానాకాలం పంట సాగైనట్టు వ్యవసాయ అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇందులో 30 శాతం పంటలను కౌలు రైతులు సాగు చేశారు. సాగులో ఉన్న పంటల వివరాలను సేకరించేందుకు నెల రోజులుగా వ్యవసాయ శాఖ అధికారులు సర్వే చేస్తున్నారు. ఆన్లైన్ పోర్టల్లో పంటల వివరాలు నమోదు చేస్తున్నారు.

జిల్లాలో ఈ ప్రక్రియ 90 శాతం పూర్తయినట్టు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఏ పంటలు సాగు చేశారనే వివరాలు సేకరిస్తున్నారు. అయితే, పంటలకు అనుగుణంగా మార్కెట్ ఏర్పాటు చేయడానికి వివరాలు సేకరణ భాగానే ఉన్నప్పటికీ.. సాగు చేసిన రైతుల వివరాలు తీసుకోకుండా.. భూ యజమానుల వివరాలు మాత్రమే తీసుకుంటున్నారు. దాంతో కష్ట పడి పంట పండించిన తమకు గుర్తింపు లేకుండా పోతుందని కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూ యజమానుల పేరుతోనే ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చెబుతుండటంతో.. చెమటోడ్చి పండించిన పంటను కౌలు రైతులు యజమానుల చేతుల్లో పోయాల్సి ఉంది. ధాన్యం డబ్బులు సైతం భూయజమానుల ఖాతాలోనే జమవుతాయి. ఇప్పటికే భూయజమానులు పంట చేతికి రాకముందే కౌలు వసూలు చేసుకుంటున్నారు. ఇక పంట డబ్బులు వారి చేతుల్లోకి పోతే తమ చేతికి సకాలంలో అందుతాయనే నమ్మకం లేదని కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

మా కష్టాన్ని.. యజమానుల చేతుల్లో పెట్టొద్దు.. కిష్టయ్య, కౌలు రైతు, అంతప్పగూడ ఆరెకరాలు కౌలుకు తీసుకున్న మూడెకరాల్లో వరి, మూడెకరాల్లో పత్తి పంట వేశాను. పంట సర్వేలో భూ యజమాని పేరును నమోదు చేశారు. పంట విక్రయాలు యజమాని పేరుతోనే జరుగుతాయని అధికారులు అంటున్నారు. అప్పు.. సప్పు చేసి.. పస్తులుండి, కష్టం చేసి.. పండించిన పంటను యజమాని చేతుల్లో పోస్తే మా బతుకెట్టాగో అర్ధం కావడం లేదు. కౌలు రైతులు పండించిన పంటను కూడా లెక్కల్లోకి తీసుకోవాలి.

 

Tags:    

Similar News