అసైన్డ్ భూమిలో చర్చి నిర్మాణం పై తలెత్తిన వివాదం.. పోలీసుల తీరుపై ఎంపీ సీరియస్
దిశ, కొండపాక : కుకునూరు పల్లి పోలీసుల తీరుపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు (MP Raghunandan Rao) సీరియస్ అయ్యారు. కొండపాక మండలం తిమ్మారెడ్డి పల్లి మదిర గ్రామం సార్లపల్లిలో అసైన్డ్ భూమిలో చర్చి నిర్మాణ పనుల విషయంలో నిర్మాణ దారులు, గ్రామ బీ జే పీ కార్యకర్తల మధ్య వివాదం చోటు చేసుకుంది. ఈ విషయమై విచారణ నిమిత్తం బీజేపీ కార్యకర్తలను కుకునూరు పల్లి పోలీస్ స్టేషన్ కు (Police station) పిలిపించిన పోలీసులు తదనంతరం రిమాండ్ చేయాలని ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు సోమవారం అర్ధరాత్రి సమయానికి కుకునూరు పల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకొని పోలీసులపై ప్రశ్నల వర్షం కురిపించారు. అసైన్డ్ భూమిలో ప్రార్థనా స్థలం నిర్మాణానికి ఎవరు అనుమతులు ఇచ్చారు...? బీజేపీ కార్యకర్తలు ఏమైనా ఉగ్రవాదులా.. నాన్ బెయిల్ కేసులు ఎలా నమోదు చేస్తారని మండిపడ్డారు.
గజ్వేల్ ఏసీపీ పోలీసు స్టేషన్ కు చేరుకొని ఎంపీ కి నచ్చ జెప్పె ప్రయత్నం చేసినా ఎంపీ శాంతించలేదు. పోలీస్ స్టేషన్ నుంచి సంబంధిత మండల తహశీల్దార్ కు ఫోన్ చేసి ప్రభుత్వ భూమిలో అక్రమంగా చర్చి నిర్మాణం చేపట్టిన వ్యక్తి పై అందుకు సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చివరకు డీసీపీ మల్లారెడ్డి పోలీసు స్టేషన్ కు సంఘటన పై పూర్తి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఎంపీ రఘునందన్ రావు తెల్లవారుజామున స్టేషన్ నుంచి వెళ్లి పోయారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ... బీజేపీ నాయకుల పై కక్ష పూరితంగా కేసు నమోదు చేశారని ఆరోపించారు. రిమాండ్ సెక్షన్లు లేకున్న పోలీసులు బీజేపీ కార్యకర్తలను రిమాండ్ చేయడం దారుణమన్నారు. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని తేల్చి చెప్పారు.