'పిల్లల్ని ముట్టుకోలేరు.. ముద్దుపెట్టుకోలేరు'
దిశ, మహబూబ్ నగర్: భారంగా లేదు కానీ, బాధగా ఉంది. అయినా మేము ముందుకెళ్తున్నాం. ఎందుకంటే సమాజ శ్రేయస్సే మా ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు ఓ అధికారి. విషయమేందని ఆ అధికారిని కదిలిస్తే.. ఆయన కష్టమేందో చెప్పుకొచ్చారు. ఆ వివరాలు మీరే చూడండి.. రాత్రి ఇంట్లో పిల్లలను నిద్రపుచ్చి విధులకు బయలుదేరిన సగటు ఉద్యోగి… వేకువజాము వరకు విధి నిర్వహణలో నిమగ్నమై… పలు చోట్ల తిరుగుతూ… ఎక్కడ పడితే అక్కడ కొంతసేపు సేద తీరుతూ… అలసి ఉదయానికి […]
దిశ, మహబూబ్ నగర్: భారంగా లేదు కానీ, బాధగా ఉంది. అయినా మేము ముందుకెళ్తున్నాం. ఎందుకంటే సమాజ శ్రేయస్సే మా ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు ఓ అధికారి. విషయమేందని ఆ అధికారిని కదిలిస్తే.. ఆయన కష్టమేందో చెప్పుకొచ్చారు. ఆ వివరాలు మీరే చూడండి..
రాత్రి ఇంట్లో పిల్లలను నిద్రపుచ్చి విధులకు బయలుదేరిన సగటు ఉద్యోగి… వేకువజాము వరకు విధి నిర్వహణలో నిమగ్నమై… పలు చోట్ల తిరుగుతూ… ఎక్కడ పడితే అక్కడ కొంతసేపు సేద తీరుతూ… అలసి ఉదయానికి ఇంటికి చేరుకున్నాడు. రాత్రంతా ఇంట్లో లేని తండ్రి… గుమ్మం వద్ద తమ తండ్రి రాక కోసం ఎదురు చూస్తున్న పిల్లలు… కళ్ళెదుటే ఉన్నా ఒకరినొకరు హత్తుకోలేని స్థితిలో తండ్రి, పిల్లలు… ఇది నేడు సమాజంలో విధులు నిర్వర్తిస్తున్న పోలీసుల దుస్థితి. అలసి ఇంటికి వెళ్ళినా నేరుగా లోపలికి వెళ్ళలేని పరిస్థితి… ఇంట్లో వారిని కనీసం ముట్టుకోలేని దుస్థితి… అతను వస్తున్నాడని తెలిసినా ఇంటి బయట భార్య, పిల్లల కంటే ముందుగా… డెటాల్ బాటిల్, వేడి నీరు, శానిటైజర్లు కనిపిస్తున్నాయి. కానీ, తప్పదు వాటిని విస్మరించి ఇంట్లోకి కూడా వెళ్ళలేని దుస్థితి నేటి పోలీసులది. ఇదే విషయాన్ని మక్తల్ లో విధులు నిర్వహిస్తున్న పోలీసు ఉద్యోగి నర్సింహులును కదలిస్తే తన కష్టాలను కళ్లకు కట్టినట్టు చెప్పారు.ఆయన బాధ వర్ణనాతీతం.
‘నేను రాత్రంతా విధులు ముగించుకుని, ఉదయం ఏడు గంటలకు ఇంటికి వెళ్ళాను. కానీ, నాకు గుమ్మం వద్ద నా ఇద్దరు పిల్లలు ఎదురుపడ్డారు. వారిని ముట్టుకోవాలంటే ముందుగా నేను వారికంటే ముందు డెటాల్, శానిటైజర్లను ముట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొన్నది. అలాగే డెటాల్ నీళ్ళతో ఇంట్లోకి వెళ్ళకుండా బయటే స్నానం చేస్తే తప్ప ఇంట్లోకి కూడా వెళ్ళలేని దీనస్థితి. చివరకు నన్ను చూసి నా భార్యా పిల్లలు, నాతోపాటు రోజు తిరిగే స్నేహితులు కూడా భయపడుతున్నారు. ఇదంతా కేవలం విధుల్లో భాగమే అయినప్పటికీ ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవడం కొంత బాధాకరంగా వుంది. కానీ, సమాజ శ్రేయస్సు కోసం నా కుటుంబాన్ని సైతం పక్కకు పెట్టి ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో విధులు నిర్వహించడం కూడా కొంత గర్వంగా వుంది. నన్ను చూసి చాలామంది భయపడుతూ పక్కకు తప్పుకుంటూ వెళ్తున్నారు. మా విధులను చూసి పొగిడేవారు కూడా లేకపోలేదు’ అని ఆ పోలీస్ అధికారి తన ఆవేదన వ్యక్తం చేశారు.
తప్పుడు ప్రచారం..
ప్రజల కోసం పోలీస్ శాఖతోపాటు ఇతర శాఖల వారు తమలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారని, ప్రజల కోసం మేము మా కుటుంబాలను పక్కకు పెట్టి విధులను నిర్వహిస్తుంటే.. కొంతమంది మాత్రం తమపై తప్పుడు ప్రచారం చేయడం కొంత బాధగా వుందన్నారు ఆ పోలీస్ అధికారి. తాము ఎవ్వరిపై కూడా ఉద్దేశపూర్వకంగా లాఠీలు ఎత్తడంలేదనే విషయాన్ని వారు కూడా గ్రహించాలని, విధి నిర్వహణలో భాగంగానే అని, వారి క్షేమం కోసమే లాఠీలకు పని చెప్పాల్సి వస్తుందని ఆయన తెలిపారు. ప్రజలు కూడా మాకు సహకరించి ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తే సహకరించినవారవుతారని, అదే సమయంలో మేము కూడా వారికి మరింత మెరుగైన సేవలను అందించగలుగుతామనే విషయం వారు కూడా గ్రహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Tags: Mahaboobnagar, police problems, family, childrens, corona effect