కేసీఆర్ నియంత పాలనతో ప్రజలు విసుగు చెందారు.. బండి సంజయ్ ఫైర్

దిశ, తెలంగాణ బ్యూరో : స్వరాష్ట్రంలో సమైక్య పాలనకు మించిన అవినీతి జరుగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ​తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం తెలంగాణ ప్రాంత ప్రశిక్షణ విభాగం ఆధ్వర్యంలో వర్చువల్​ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్​ మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్, టీడీపీ పాలనను మించి కేసీఆర్ పాలనలోనే అవినీతి ఎక్కువగా రాజ్యమేలుతోందని విమర్శలు చేశారు. కేసీఆర్ కుటుంబ అవినీతి, నియంత పాలనతో ప్రజలు […]

Update: 2021-11-24 11:59 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : స్వరాష్ట్రంలో సమైక్య పాలనకు మించిన అవినీతి జరుగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ​తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం తెలంగాణ ప్రాంత ప్రశిక్షణ విభాగం ఆధ్వర్యంలో వర్చువల్​ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్​ మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్, టీడీపీ పాలనను మించి కేసీఆర్ పాలనలోనే అవినీతి ఎక్కువగా రాజ్యమేలుతోందని విమర్శలు చేశారు. కేసీఆర్ కుటుంబ అవినీతి, నియంత పాలనతో ప్రజలు విసిగిపోయారని అన్నారు. రాష్ట్రంలోని ప్రజలంతా బీజేపీని ప్రత్యామ్నాయ పార్టీగా ఆదరిస్తున్నారని, ఇటీవల ప్రజా సంగ్రామ యాత్రకు వచ్చిన ఆదరణే ఇందుకు నిదర్శనమన్నారు. కేసీఆర్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలతో పాటు పలు వర్గాలకు ఇచ్చిన హామీల అమలు కోసం ప్రజా క్షేత్రంలోకి వెళ్లి నిలదీయాలని బండి పిలుపునిచ్చారు. పాలకులు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తే ప్రజలు తగిన బుద్ధి చెబుతారనడానికి దేశ చరిత్రతో పాటు ఉమ్మడి రాష్ట్రంలోని అనేక సంఘటనలే నిదర్శనమని పేర్కొన్నారు.

ఇందిరాగాంధీ హయాంలో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన పార్టీ బీజేపీ అని, ఆమె మరణానంతరం రాజీవ్ గాంధీ పాలనలోనూ అవినీతి రాజ్యమేలిందని బండి ఆరోపించారు. నాడు సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ పాలనలో అవినీతి కొనసాగిందని, మర్రి చెన్నారెడ్డి, అంజయ్య, కోట్ల విజయభాస్కర్ రెడ్డి పాలనలో ప్రజలు విసిగిపోయారన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలు బీజేపీని ప్రత్యామ్నాయ పార్టీగా చూస్తున్నారని, బీజేపీకి అవకాశం ఇస్తేనే పేదలకు న్యాయం జరుగుతుందని ప్రజలు నమ్ముతున్నారని బండి సంజయ్ ​తెలిపారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం యువత, మహిళలు, రైతులు సహా ఏ వర్గానికి ఏయే హామీలిచ్చింది? వేటిని విస్మరించింది అనే అంశాలపై అధ్యయనం చేసి ప్రజల్లోకి తీసుకెళ్లి టీఆర్ఎస్ ను ఎండగట్టాలని బండి నాయకులకు పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా వాటికి కొమ్ముకాసే పార్టీ ఎంఐఎం అని విమర్శలు చేశారు. అందుకే పాతబస్తీ అభివృద్ధికి దూరంగా ఉందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో బీజేపీ ప్రధాన కార్యదర్శులు మంత్రి శ్రీనివాసులు, దుగ్యాల ప్రదీప్ కుమార్, ప్రశిక్షణ కమిటీ కన్వీనర్ ఓ.ఎస్.రెడ్డి, ఓబీసీ జాతీయ మోర్చా అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎస్.ప్రకాశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News