పట్టా భూమిలో పల్లె ప్రకృతి..? మొరపెట్టుకున్నా పట్టించుకోని వైనం..

దిశ, దుబ్బాక: పట్టా భూమిలో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేసి, ఇది పట్టా కాదు పరంపోగు అంటూ బాధితులను చెప్పులరిగేలా తిప్పించుకుంటున్నారు అధికారులు. ఎన్నిసార్లు అడిగినా ఇదిగో అదిగో అంటూ మాట దాటివేస్తున్నారే తప్ప, ఆఫీస్‌లో నుండి బయటకు వచ్చి భూమిని చూసింది లేదు సర్వే చేసింది లేదు. అసలు ఏం జరుగుతుందో తెలియకుండానే ఆఫీస్‌లో నుండే సమాధానాలు చెప్తున్నారు రెవెన్యూ అధికారులు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్ద చీకోడు గ్రామానికి చెందిన భాసంగారి […]

Update: 2021-08-18 05:06 GMT

దిశ, దుబ్బాక: పట్టా భూమిలో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేసి, ఇది పట్టా కాదు పరంపోగు అంటూ బాధితులను చెప్పులరిగేలా తిప్పించుకుంటున్నారు అధికారులు. ఎన్నిసార్లు అడిగినా ఇదిగో అదిగో అంటూ మాట దాటివేస్తున్నారే తప్ప, ఆఫీస్‌లో నుండి బయటకు వచ్చి భూమిని చూసింది లేదు సర్వే చేసింది లేదు. అసలు ఏం జరుగుతుందో తెలియకుండానే ఆఫీస్‌లో నుండే సమాధానాలు చెప్తున్నారు రెవెన్యూ అధికారులు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్ద చీకోడు గ్రామానికి చెందిన భాసంగారి లక్ష్మి సర్వే నెంబర్ 1203, 1204 లో నాలుగున్నర ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. అయితే ఈ గ్రామానికి చెందిన కొందరు ఇందులో అసైన్మెంట్ భూమి ఉంది అంటూ, పక్కనే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మాణం కూడా చేయడం జరిగిందని, సర్వే నెంబర్ 1203,1204 లో 25 గుంటలు భూమిలో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేశారు.

అయితే మా పట్టా భూమిలో మీరెలా పల్లె పకృతి వనాన్ని ఏర్పాటు చేస్తారంటూ స్థానిక సర్పంచ్‌ని, సంబంధిత అధికారులను బాధితురాలు అడిగినప్పటికీ, మాకేం తెలియదు.. ఇది గత సర్పంచ్ హయాంలోనే గ్రామానికి కేటాయించిన స్థలం.. అంటూ గ్రామ పెద్ద మనుషులు దాటవేశారు. అప్పటి నుండి బాధితురాలి వద్ద ఉన్న పట్టా పాస్ పుస్తకాలు తీసుకొని అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. ఇటీవలే జిల్లా మంత్రి నుంచి మొదలుకొని ఎంపీ, కలెక్టర్, ఆర్డీవో దృష్టికి తీసుకెళ్లి వీరివద్ద ఉన్న ఆధారాలను చూపెట్టి తమ గోడు చెప్పుకున్నారు. ఎంతమందికి చెప్పుకున్నా మళ్లీ తిరిగి తహసీల్దార్ వద్దకే పంపుతున్నారు తప్ప, తమ సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు అంటున్నారు బాధితులు. మండల పరిధిలోని అధికారులు కాలయాపన చేస్తూ వస్తూన్నారని ఆరోపించారు. బుధవారం రోజు బాధితురాలు కుటుంబ సభ్యులతో కలిసి స్థానిక తహసీల్దార్ రాజేందర్ రెడ్డి ని కలిసి ‘సార్ మా స్థలాన్ని మాకు ఇప్పించండి’ అంటూ మొరపెట్టుకున్నారు.

ఇదే విషయమై స్థానిక తహసీల్దార్ ను విలేకరులు వివరణ కోరగా ఆ భూమిపై ఆధారాలు సేకరిస్తున్నామన్నారు. అంతేకాకుండా ప్రొఫెషనల్‌గా సర్వేయర్ అందుబాటులో లేకపోవడంతో ఆలస్యమవుతోందని సమాధానమిచ్చారు. బాధితులు మాత్రం మా భూములు మాకు ఇప్పించకుంటే కార్యాలయం ముందు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని మీడియాతో మొర పెట్టుకున్నారు. నిజానికి రెవెన్యూ అధికారులు ఆ గ్రామానికి వెళ్లి సర్వే నంబర్ 1203, 1204 ను ఆధీనంలోకి తీసుకొని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి అందులో అసైన్డ్ భూమి ఉందా? లేదా అనేది తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకుంటే అధికారుల చేతులు ఏమన్న మారాయా అనే విమర్శలు అయితే ప్రజలలో బలంగానే వినిపిస్తున్నాయి. నిజానికి ఈ భూమి ఎవరికి చెందుతుందో తేటతెల్లం చేయాల్సిన బాధ్యత అయితే రెవెన్యూ అధికారులపై ఉందనే చెప్పాలి.

Tags:    

Similar News